బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలి
ABN , Publish Date - Apr 26 , 2026 | 05:45 AM
విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు తమకు అవకాశం ఇవ్వాలని, బోధనేతర పనుల నుంచి విముక్తి కగిలించాలని ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఫ్యాప్టో ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభం
విజయవాడ (ధర్నాచౌక్), ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు తమకు అవకాశం ఇవ్వాలని, బోధనేతర పనుల నుంచి విముక్తి కగిలించాలని ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ సాధన, 12వ పీఆర్సీ, మధ్యంత భృతి, కారుణ్య నియామకాలు, సీపీఎస్ రద్దు, మెమో 57 అమలు, పెండింగ్ బకాయిలు తదితర డిమాండ్ల సాధనకు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్‌లో మూడు రోజుల రిలే నిరాహార దీక్షలు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతలు మాట్లాడారు. ‘ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించి విద్యాశాఖలో ఏళ్ల తరబడి ఉన్న సమస్యను తొలగించాలి. 11వ పీఆర్సీ గడువు ముగిసి 33 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ 12వ పీఆర్సీ ఏర్పాటు చేయలేదు. తక్షణమే 30 శాతం మధ్యంతర భృతి చెల్లించాలి. 2003 డీఎస్సీ ద్వారా నియామకమైన ఉపాధ్యాయులు, పోలీసులు ఇతర ఉద్యోగులు సుమారు 11 వేల మందికి పాత పెన్షన్ విధానం అమలు చేయాలి. ఉపాధ్యాయుల జనరల్ బదిలీలతో పాటు అంతర్ జిల్లా బదిలీలు చేపట్టాలి.’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.