కారుణ్య కొలువుకు మోక్షమెప్పుడు?
ABN , Publish Date - Feb 10 , 2026 | 04:53 AM
కరోనా కాలంలో(2019-2020) చాలా మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. వీరిలో రాష్ట్ర వ్యాప్తంగా 922 మంది ప్రభుత్వ టీచర్లు ఉన్నారు. ప్రభుత్వం 2012లో విడుదల చేసిన..
కరోనాతో మరణించిన 922 మంది టీచర్లు
ఉద్యోగాల కోసం కుటుంబాల ఎదురుచూపు
ఖాళీలు లేవంటున్న జడ్పీ అధికారులు
కలిసేందుకూ ఇష్టపడని నాటి సీఎం జగన్
ఇటీవల స్పందించిన ఉపముఖ్యమంత్రి పవన్
కానీ, జీఏడీలో పలు అంశాలపై మెలికలు
కరోనా సమయంలో జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న 922 మంది ఉపాధ్యాయులు మృతిచెందారు. 2020లో ఈ మరణాలు సంభవించాయి. నిబంధనల ప్రకారం వారి కుటుంబ సభ్యులకు ‘కారుణ్య నియామకం’ కింద వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ అప్పటి అధికారులు పెద్దగా స్పందించలేదు. దీంతో నాటి సీఎం జగన్‌ను కలిసి సమస్యను వివరిద్దామని బాధితులు ప్రయత్నించారు. కానీ, వారిని ఆయన కరుణించలేదు. ఆరేళ్లు దాటి పోతున్నా... మరణించిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యుల ‘కారుణ్య’ రోదన అరణ్య వేదనగానే మిగిలిపోయింది.
(గుంటూరు సిటీ-ఆంధ్రజ్యోతి)
కరోనా కాలంలో(2019-2020) చాలా మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. వీరిలో రాష్ట్ర వ్యాప్తంగా 922 మంది ప్రభుత్వ టీచర్లు ఉన్నారు. ప్రభుత్వం 2012లో విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారంసర్వీస్‌లో ఉండి మరణించిన ఉపాధ్యాయుల కుటుంబసభ్యులకు జిల్లా పరిషత్, మండల పరిషత్ కార్యాలయాల్లో కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించాలి. ఈ నిబంధన నేపథ్యంలోనే కరోనాతో మరణించిన ఉపాధ్యాయుల కుటుంబసభ్యులు ఉద్యోగాల కోసం జిల్లా పరిషత్‌లకు దరఖాస్తు చేసుకున్నారు. ఒకేసారి వందల దరఖాస్తులు రావటంతో తమ వద్ద అన్ని ఖాళీలు లేవని అధికారులు తేల్చిచెప్పారు. చేసేది లేక బాధితులు సమస్య వివరించేందుకు నాటి సీఎం జగన్‌ను కలిసే ప్రయత్నం చేసినా ఆయన అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని బాధితులు తెలిపారు.
కూటమి లోనే కదలిక..
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాధితులు తమ సమస్యను పంచాయతీరాజ్ శాఖను నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి జిల్లా పరిషత్‌లలో తగినన్ని ఖాళీలు లేనప్పుడు కలెక్టర్లకు ఈ బాధ్యతను అప్పగించాలని అధికారులకు సూచించారు. ఇది జరిగి కూడా చాలా నెలలు అయింది. డిప్యూటీ సీఎం సూచనతో సంబంధిత ఫైల్‌ను జీఏడీ(సాధారణ పరిపాలనా విభాగం)కు పంపారు. అక్కడి అధికారులు మాత్రం గడచిన సంవత్సర కాలంగా బాధితులను కార్యాలయం చుట్టూ తిప్పుతూనే ఉన్నారు. కొర్రీలతో కాలయాపన చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు.
ఉద్యోగం లేదు.. పెళ్లి కాదు..
ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులు ఆకస్మికంగా మరణించటంతో వారి పిల్లల జీవితాలు రోడ్డున పడ్డాయి. చాలా మంది పెళ్లిళ్లు కూడా అర్థాంతరంగా ఆగిపోయాయి. తల్లిదండ్రుల మరణంతో పిల్లలకు ఉద్యోగం వస్తుందన్న ఆలోచనతో కొందరు సంబంధాలు కుదుర్చుకున్నారు. ఉద్యోగం రావటం ఆలస్యం అవుతోందని తెలియడంతో పెళ్లి సంబంధాలు చాలా వరకు రద్దయ్యాయి. కొందరికి కుటుంబ పెన్షన్ వస్తోంది. తల్లిదండ్రులు ఇద్దరు మరణించటంతో కొందరికి ఆ పెన్షన్ కూడా రాని పరిస్థితి నెలకొంది. తల్లి దండ్రులు ఉన్నప్పుడు హాయిగా బతికిన పిల్లలను ఒక్కసారిగా ఆర్థిక ఇబ్బందులు చుట్టు ముట్టడంతో ప్రస్తుతం వారి జీవనం ఇబ్బందుల్లో పడింది. ఈ నేపథ్యంలోనే పల్నాడు జిల్లాకు చెందిన ఒక బాధితురాలు కొద్ది రోజుల కిందట బలవన్మరణానికి ప్రయత్నించారు. పొరుగు ఇంట్లో ఉన్న వాళ్లు గమనించి ఆమెను కాపాడారు.
జగన్‌కు జాలి లేదు
మా తల్లిదండ్రులు ఎంతో మందికి చదువులు చెప్పారు. వారి మరణం తర్వాత మా జీవితాలు రోడ్డున పడ్డాయి. ఒక్కోసారి చని పోవాలని అనిపిస్తోంది. అధికారులు మమ్మల్ని ఇంతగా ఇబ్బంది పెట్టటం ధర్మమా?. కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి. జగన్ ప్రభుత్వం ఎటూ జాలి చూపించలేదు.
- సీహెచ్ సువర్ణ కుమార్, గుంటూరు
రోజొక యుగంలా గడుస్తోంది
నాన్న ఉన్నప్పుడు రోజులు ఎలా గడిచాయో కూడా తెలియలేదు. ఇప్పుడు రోజొక యుగంలా గడుస్తోంది. ఎక్కడకి వెళ్లాలో.. ఎలా బతకాలో అర్థం కావటం లేదు. ఉద్యోగం వస్తే కుటుంబాన్ని బతికించుకోగలను. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి.
- బి రామలక్ష్మి, ప్రకాశం
కూటమి ప్రభుత్వం పైనే ఆశలు
జగన్ ప్రభుత్వం మా బాధలు తెలుసుకోవడానికి కూ డా ప్రయత్నం చేయలేదు. కూట మి ప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్య పరిష్కారం కోసం చర్యలు మొదలయ్యాయి. ఆర్థికంగా, సామాజికంగా ఎన్నో ఇబ్బందులు, అవమానాలు భరిస్తున్నాం. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు మాపై కరుణ చూపాలి.
- మాదాను విజయ్ కుమార్, విజయనగరం
మా బాధలు ఆలకించండి
మా సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకు వెళ్లిన తర్వాత ఆయన స్పందించారు. ఆ తర్వాత ఫైల్‌ను జీఏడీకి పంపారు. అక్కడ అధికారులు ఆలస్యం చేస్తున్నారు. రోజులు గడవడం చాలా కష్టంగా ఉంది. ఆరేళ్లుగా అల్లాడి పోతున్నాం. మా బాధలు ఇప్పటికైనా ఆలకించి న్యాయం చేయాలి.
- ఎస్‌కె షబ్బీర్, గుంటూరు