Share News

ప్రపంచస్థాయి పర్యాటక గమ్యస్థానంగా ఏపీ

ABN , Publish Date - Jul 18 , 2026 | 05:09 AM

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ నాయకత్వంలో రూపొందించిన ‘స్వర్ణాంధ్ర పర్యాటక విజన్‌-2047’ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచస్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ తెలిపారు.

ప్రపంచస్థాయి పర్యాటక గమ్యస్థానంగా ఏపీ

  • రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి.. భరోసా మాది

  • టూరిజం సదస్సులో మంత్రి కందుల దుర్గేశ్‌ హామీ

  • కేంద్ర సాంస్కృతిక కార్యదర్శి వివేక్‌తో విడిగా భేటీ

  • పలు పెండింగ్‌ ప్రతిపాదనలపై నివేదిక అందజేత

న్యూఢిల్లీ, జూలై 17(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ నాయకత్వంలో రూపొందించిన ‘స్వర్ణాంధ్ర పర్యాటక విజన్‌-2047’ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచస్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ తెలిపారు. ఢిల్లీలో జరుగుతున్న ‘ఫెయిత్‌ టూరిజం సదస్సు-2026’లో రెండో రోజు శుక్రవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక రంగంలో ఉన్న అపారమైన పెట్టుబడి అవకాశాలను జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు, పెట్టుబడిదారులకు వివరించారు. ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. పెట్టుబడులకు భరోసా తమ ప్రభుత్వానిదని హామీ ఇచ్చారు. కాన్‌క్లేవ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఏపీ టూరిజం స్టాల్‌ను మంత్రి సందర్శించారు. సందర్శకులకు ఏపీ పర్యాటక రంగ విశిష్టతలు, చారిత్రక, ఆధ్యాత్మిక వైభవాన్ని స్వయంగా వివరించారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటుకు ఉన్న అనుకూల వాతావరణాన్ని వారికి వివరించి, భాగస్వాములు కావాల్సిందిగా ఆహ్వానించారు. మంత్రి దుర్గేశ్‌తో పాటు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ ఏపీ పర్యాటక రంగ పెట్టుబడులపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. మరోవైపు కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి వివేక్‌ అగర్వాల్‌తో మంత్రి దుర్గేశ్‌ విడిగా భేటీ అయ్యారు. 5 కీలకమైన పెండింగ్‌ ప్రతిపాదనలపై నివేదిక సమర్పించారు. వీటిపై నెలలోనే స్పష్టమైన రూపాన్ని తీసుకువస్తామని, త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని కేంద్ర కార్యదర్శి హామీ ఇచ్చారు.

Updated Date - Jul 18 , 2026 | 05:10 AM