50 వేల గదులు, 10 వేల హోం స్టేలు
ABN , Publish Date - Mar 26 , 2026 | 03:01 AM
రాష్ట్రానికి పెరుగుతున్న పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని 2029 నాటికి రాష్ట్రంలో 50 వేల హోటల్ గదులను నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యాటకశాఖకు ...
పెరుగుతున్న పర్యాటకుల కోసం సిద్ధం చేయండి
పర్యాటక శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
పాక కళల హబ్‌గా ఏపీని మార్చేందుకు ఇండియన్ కలినరీ ఇన్‌స్టిట్యూట్‌తో ఒప్పందం
అమరావతి, మార్చి 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి పెరుగుతున్న పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని 2029 నాటికి రాష్ట్రంలో 50 వేల హోటల్ గదులను నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యాటకశాఖకు దిశానిర్దేశం చేశారు. గత ఏడాదిలో రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు 30.92 కోట్ల మంది పర్యాటకులు వచ్చారని, గడిచిన తొమ్మిది నెలల కాలంలో 21 శాతం మేర వృద్ధి కనిపించిందని చెప్పారు. ఈ సంఖ్య మరింత పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో పర్యాటక శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, పర్యాటక ప్రాంతాల్లో 10 వేలకు పైగా హోం స్టేలు కూడా అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు. ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపిన టూరిజం ప్రాజెక్టులు వేగంగా ఏర్పాటు అయ్యేలా చూడాలని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్ హోటళ్లు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు, నగరాలకు వచ్చేలా చూడాలన్నారు. గోదావరి పుష్కరాల నాటికి కూడా రాజమహేంద్రవరం సహా ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హోం స్టేల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. హోం స్టేల నిర్వహణకు రేటింగ్ కూడా పెట్టాలని చెప్పారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. ‘‘అరకు, చింతపల్లి, ముంచింగిపుట్టు, మారేడుమిల్లి తదితర ప్రాంతాలతో పాటు కనీసం 10-15 ప్రాంతాల్లో కారవాన్ పార్కులను ఏర్పాటు చేయాలి. అక్కడ కుటుంబంతో సహా పర్యాటకులు సురక్షితంగా ప్రకృతిని ఆస్వాదించేలా సదుపాయాలు కల్పించాలి. తిరుపతి, విశాఖలో అమ్యూజ్‌మెంట్ పార్కుల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలి. ఎకో, టెంపుల్ టూరిజానికి ప్రోత్సాహం ఇచ్చేలా ప్రాజెక్టులు చేపట్టాలి. ప్రసాద్, స్వదేశ్ దర్శన్ పథకాల ప్రాజెక్టులను 2026 మే నాటికి సిద్ధం చేయాలి. రాజమండ్రి హ్యావ్‌లాక్ బ్రిడ్జిపైకి పర్యాటకులను అనుమతించేలా డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలి.
శాఖల మధ్య సమన్వయం కోసం కమిటీ
రాష్ట్రంలో పర్యాటకం ప్రోత్సాహకానికి పర్యాటక, అటవీ, దేవదాయశాఖ, పోలీసు, మెరైన్ తదితర శాఖల సమన్వయం కోసం సీఎస్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయాలి. విశాఖ, విజయవాడ, శ్రీశైలం, గండికోట, కంభం చెరువు లాంటి చోట్ల వాటర్ ఏరో డ్రోమ్స్ ఏర్పాటు చేయాలి. విశాఖ, కృష్ణపట్నం పోర్టుల నుంచి క్రూజ్ నౌకలను తిప్పాలి. అందరికీ అందుబాటులో ఉండటానికి టెంట్ సిటీలను కేటగిరీలుగా విభజించాలి’’ అని తెలిపారు. ప్రసాద్, స్వదేశ్ దర్శన్ ప్రాజెక్టులకు సంబంధించి మరో రూ. 663 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు పర్యాటక శాఖ అధికారులు సీఎంకు వివరించారు.
ఇండియన్ కలినరీ ఇన్‌స్టిట్యూట్‌తో ఒప్పందం
ఆంధ్రప్రదేశ్‌ను పాకశాస్త్ర హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పర్యాటక శాఖ తిరుపతిలోని ఇండియన్ కలినరీ ఇన్‌స్టిట్యూట్ (ఐసీఐ)తో అవగాహన ఒప్పందం చేసుకుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో ఇండియన్ కలినరీ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధులు, ఏపీ పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. తెలుగు రుచులను, వంటకాలను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు ప్రాంతీయ ఆహార సంస్కృతిని చాటి చెప్పేలా ఆ సంస్థ సహకారం అందించనుంది. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తదితరులు పాల్గొన్నారు.
పీఎన్‌జీతో ఆతిథ్య రంగాన్ని కాపాడండి
సీఎంకు ఏపీ స్టార్ హోటల్స్ సంఘం వినతి
విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రధాన నగరాల్లో పైప్‌డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) కనెక్షన్ల విస్తరణను వేగవంతం చేసి ఆతిథ్య రంగానికి సహకరించాలని ఏపీ స్టార్ హోటల్స్ సంఘ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం ఆయిల్ కంపెనీలు క్షేత్రస్థాయిలో కేవలం 10 నుంచి 15 శాతం వరకే కమర్షియల్ గ్యాస్ సరఫరా చేస్తున్నాయని, దీనిని 50 శాతం వరకు పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. హోటళ్లు ఎలక్ట్రిక్ కుకింగ్ చేస్తుంటే విద్యుత్ బిల్లులు భారీగా పెరుగుతున్నాయని వివరించారు. యూనిట్‌కు రూ. 2 చొప్పున విద్యుత్ సబ్సిడీ కల్పించాలని కోరారు. సీఎంను కలిసిన వారిలో ఏపీ స్టార్ హోటల్స్ సంఘం అధ్యక్షుడు స్వామి తదితరులు ఉన్నారు.