Share News

ఈ ఏడాది 2 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం

ABN , Publish Date - Feb 20 , 2026 | 05:20 AM

రాష్ట్రానికి పెద్దఎత్తున పరిశ్రమలు వస్తున్నందున వాటిలో యువతకు ఉపాధి కల్పనపై దృష్టిపెట్టాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్‌ అధికారులను ఆదేశించారు.

ఈ ఏడాది 2 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం

  • రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు వస్తున్నాయి

  • వాటిలో యువతకు ఉపాధి కల్పనపై దృష్టి పెట్టాలి

  • కంపెనీల అవసరాలకు అనుగుణంగా శిక్షణ కార్యక్రమాలు

  • జాబ్‌ క్యాలెండర్‌లో అధ్యాపక పోస్టులు ఉండాలి

  • విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖలపై లోకేశ్‌ సమీక్ష

అమరావతి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి పెద్దఎత్తున పరిశ్రమలు వస్తున్నందున వాటిలో యువతకు ఉపాధి కల్పనపై దృష్టిపెట్టాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్‌ అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖలపై గురువారం ఉండవల్లి నివాసంలో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గ్రౌండ్‌ అయిన పరిశ్రమల్లో ఈ ఏడాది 2లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. రియలన్స్‌, సీబీజీ, జూపిటర్‌ లాంటి కంపెనీలకు అవసరమయ్యే నైపుణ్యాలను గుర్తించి అందుకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇవ్వాలన్నారు. కరిక్యులమ్‌లో మార్పులకు ప్రముఖ కంపెనీల సలహాలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు సొంతంగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశాయని, వాటిని అధ్యయనం చేసి, అదే తరహాలో ఐటీఐలకు అనుబంధంగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. వీలైనంత త్వరగా నైపుణ్యం పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి సూచించారు. కాగా పోర్టల్‌కు 25 రంగాల డేటా అనుసంధానం చేశామని, 20 వేల మంది విద్యార్థులు, 60 వేల మంది నిరుద్యోగులకు ఏఐ ఆధారిత ఇంటర్వ్యూలు నిర్వహించామని అధికారులు వివరించారు. యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో అధ్యాపక పోస్టుల భర్తీపై సమీక్షించారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా మెగా డీఎస్సీ తరహాలో ఉగాదికి ఇవ్వబోయే జాబ్‌ క్యాలెండర్‌లో ఈ పోస్టులు పెట్టాలని మంత్రి స్పష్టంచేశారు. కోచింగ్‌ సెంటర్లకు నిబంధనల రూపకల్పనకు ప్రజాభిప్రాయం తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షలో ఉన్నతాధికారులు కోన శశిధర్‌, నారాయణ భరత్‌గుప్తా, గణేష్ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2026 | 06:00 AM