‘తల్లికి వందనం’ జూలైలో
ABN , Publish Date - Jun 10 , 2026 | 04:12 AM
తల్లికి వంద నం పథకం నగదును జూలైలో విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు కసరత్తు చేస్తోంది.
మొదటి వారంలోనే విడుదలకు కసరత్తు
68 లక్షల మంది అర్హులకు పథకం అమలు
ఎల్లుండి తెరుచుకోనున్న బడులు
అమరావతి, జూన్ 9(ఆంధ్రజ్యోతి): తల్లికి వంద నం పథకం నగదును జూలైలో విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు కసరత్తు చేస్తోంది. 2025లో పాఠశాలలు పునఃప్రారంభమైన జూన్ 12న పథకాన్ని అమలుచేశారు. ఈ ఏడాది వివిధ కారణాలతో వచ్చే నెల అమలుచేయాలని భావిస్తున్నారు. గతేడాది 67.27 లక్షల మందికి పథ కం వర్తించగా, ఈ ఏడాది ఆ సంఖ్య 68 లక్షలుగా గుర్తించారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు ఈ పథకాన్ని అమలుచేస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నా కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి అమలుచేసింది. ఇద్దరు ముగ్గురు బడికి వెళ్లే పిల్లలున్నా రూ.13వేలు మాత్రమే ఇచ్చింది. కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలుంటే అంత మందికీ రూ.13వేలు చొప్పున ఇస్తోంది. గతేడాది చాలా మంది తల్లులు సగటున రూ.26వేల చొప్పున లబ్ధి పొందారు. కర్నూలు జిల్లాలో అనేక మందికి రూ.50వేలకుపైగా అందాయి. గతేడాది నిబంధనల ప్రకారమే ఈ సంవత్సరం కూడా పథకం అమలుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ నిధులు వేర్వేరుగా అందుతాయి. ఇందుకోసం సుమారుగా రూ.9వేల కోట్లు అవసరం కానున్నాయి. గత ప్రభుత్వం ఏడాదికి సగటున 42లక్షల మంది లబ్ధిదారులకు పథకం అమలుచేస్తే, కూటమి ప్రభుత్వం ఏడాదికి 67లక్షల మందికిపైగా పథకాన్ని అమలుచేస్తోంది. దీంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం రెట్టింపైంది.
యథావిధిగా బడుల పునఃప్రారంభం
అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈనెల 12నే బడులు పునఃప్రారంభం కానున్నాయి. ఎండల తీవ్రత నేపథ్యంలో వేసవి సెలవులు పొడిగిస్తారనే చర్చ జరిగింది. తెలంగాణలో బడుల పునఃప్రారంభ తేదీని ఈనెల 15కు మా ర్చారు. దీంతో రాష్ట్రంలోనూ 15కు మార్చాలని ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. అయితే రుతుపవనాలు ఇప్పటికే రాయలసీమలోకి ప్రవేశించడంతో రెండు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో ఎప్పటిలాగే జూన్ 12నే బడులు తెరవాలని ప్రభు త్వం నిర్ణయించింది. తొలి రోజునే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించనున్నారు. అలాగే, స్టూడెంట్ కిట్‌లో కొన్ని వస్తువులు ఇస్తారు. యుద్ధం కారణంగా కిట్ల తయారీ ధరలు పెరిగిపోవడం వల్ల పంపిణీ కొంత ఆలస్యమవుతోంది.