Share News

‘తల్లికి వందనం’ నేడే

ABN , Publish Date - Jul 22 , 2026 | 04:52 AM

విద్యార్థుల చదువు వారి కుటుంబాలకు భారం కాకూడదన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం రెండో ఏడాది నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది.

‘తల్లికి వందనం’ నేడే

  • తొలి విడతలో ఈ రోజు 64.76 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి

  • తల్లుల బ్యాంకు ఖాతాల్లో 13 వేల చొప్పున జమ చేయనున్న ప్రభుత్వం

  • ఆగస్టు 30న రెండో విడత అమలు

అమరావతి, జూలై 21(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల చదువు వారి కుటుంబాలకు భారం కాకూడదన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం రెండో ఏడాది నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం నుంచే నిధుల విడుదల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ సారి రెండు విడతలుగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఇప్పటికే యూడైస్‌ ద్వారా నమోదైన విద్యార్థులకు తొలి విడత బుధవారం నిధులు జమచేయనున్నారు. ఇక, ఈ ఏడాదే కొత్తగా స్కూళ్లలో చేరిన విద్యార్థులకు రెండో విడతలో ఆగస్టు 30న పథకాన్ని అమలు చేస్తారు. తొలి విడతలో 64.76 లక్షల మంది విద్యార్థులకు నిధులు అందనున్నాయి. బుధవారం నుంచి మూడు రోజుల పాటు నిధుల జమ ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకా వివరాలు ధృవీకరించాల్సిన విద్యార్థులు, ఒకటో తరగతి, ఇంటర్‌ ఫస్టియర్‌లో చేరేవారికి రెండో విడతలో నిధులు విడుదల చేస్తారు. మొత్తం ఈ ఏడాది 67.47 లక్షల మంది విద్యార్థులకు ‘తల్లికి వందనం’ పథకాన్ని వర్తింపజేయాలని పాఠశాల విద్యాశాఖ అంచనా వేసింది. 42.7 లక్షల మంది తల్లుల ఖాతాల్లో ఈ నగదు జమ కానుంది. దీనికిగాను ప్రభుత్వం రూ.10,121 కోట్లు వెచ్చిస్తోంది. ఒక్కో విద్యార్థికి రూ.15 వేలను ఈ పథకంలో కేటాయించారు. అయితే, ఆయా పాఠశాలల నిర్వహణ కోసం రూ.2 వేలు మినహాయించి.. రూ.13 వేల చొప్పున తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలున్నా ఒక్కరికే ‘అమ్మఒడి’ అమలు చేయగా, కూటమి ప్రభుత్వం ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తోంది. దీం తో గత ప్రభుత్వంతో పోలిస్తే దాదాపు రెట్టింపు నిధులను ప్రభుత్వం కేటాయించాల్సి వస్తోంది.

Updated Date - Jul 22 , 2026 | 04:53 AM