ఐఐటీ భువనేశ్వర్‌లో ఏపీ విద్యార్థి మృతి
ABN , Publish Date - May 11 , 2026 | 03:46 AM
ఐఐటీ భువనేశ్వర్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పీహెచ్‌డీ విద్యార్థి హాస్టల్ భవనంపై నుంచి కిందపడి మృతిచెందాడు.
హాస్టల్ భవనంపై నుంచి కిందపడి దుర్మరణం
భువనేశ్వర్, మే 10: ఐఐటీ భువనేశ్వర్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పీహెచ్‌డీ విద్యార్థి హాస్టల్ భవనంపై నుంచి కిందపడి మృతిచెందాడు. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థిని గూడూరు ప్రాంతానికి చెందిన తనికొండ నిశాంత్ కుమార్‌గా గుర్తించినట్టు పోలీసులు ఆదివారం తెలిపారు. నిశాంత్ కుమార్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ చేస్తూ.. ఐఐటీ భువనేశ్వర్ క్యాంప్‌సలోని బ్రహ్మపుత్ర బాయ్స్ హాస్టల్ ‘ఏ’ బ్లాక్‌లో ఉంటున్నాడు. శనివారం మధ్యాహ్నం హాస్టల్ భవనం ఆరో అంతస్తులోని బాల్కనీ నుంచి కిందపడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న నిశాంత్‌ను గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది.. వెంటనే క్యాంప్‌సలోని ‘సంజీవన్ ఆస్పత్రి’కి తరలించారు. అక్కడ అత్యవసర చికిత్స అనంతరం.. వైద్యుడి సలహా మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే నిశాంత్ మృతిచెందినట్టు ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని.. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా.. లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.