Share News

పిల్లలు తగ్గిపోతున్నారు!

ABN , Publish Date - Apr 07 , 2026 | 04:49 AM

‘ఒక్కరు, ఇద్దరు కాదు... ముగ్గురు పిల్లలు ముద్దు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. ఎక్కువ మంది పిల్లలు ఉన్న దంపతులకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నారు. ‘పాపులేషన్‌ మేనేజ్‌మెంట్‌’ అవసరమని పదేపదే చెబుతున్నారు.

పిల్లలు తగ్గిపోతున్నారు!

  • రాష్ట్రంలో పడిపోతున్న జననాల రేట్

  • జననాల రేటు2.1 నుంచి 1.5 శాతానికి తగ్గిన చిన్నారులు

  • ఇద్దరు కూడా వద్దనుకుంటున్న జంటలు

  • బడుల్లో తగ్గుతున్న విద్యార్థుల చేరికలు

  • ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో కనిపించని గ్రోత్‌

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘ఒక్కరు, ఇద్దరు కాదు... ముగ్గురు పిల్లలు ముద్దు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. ఎక్కువ మంది పిల్లలు ఉన్న దంపతులకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నారు. ‘పాపులేషన్‌ మేనేజ్‌మెంట్‌’ అవసరమని పదేపదే చెబుతున్నారు. దీనికి కారణం... రాష్ట్రంలో జననాల సంఖ్య తగ్గడమే! ఆ ప్రభావం ఇప్పటికే మొదలైంది. రాష్ట్రంలోని పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య రివర్స్‌ ట్రెండ్‌లో కనిపిస్తోంది. సాధారణంగా పాఠశాలల్లో చేరికలు ప్రతి సంవత్సరం ఎంతోకొంత పెరుగుతూ ఉంటాయి. కానీ, తాజా గణాంకాలు చూస్తే విద్యార్థుల సంఖ్య పెరగకపోగా తగ్గిపోయింది. రాష్ట్రంలో ప్రీప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదివే విద్యార్థుల సంఖ్యపై ఇటీవల రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. 2024-25లో విద్యార్థులు 83,44,988 ఉంటే ఆ సంఖ్య 2025-26 విద్యా సంవత్సరంలో 83,28,448కి తగ్గిపోయింది. అంటే మొత్తంగా 16,540 మంది విద్యార్థులు తగ్గారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో 36.43 లక్షల నుంచి 34.93 లక్షలకు తగ్గిపోయారు.

అక్కడా లేరు.. ఇక్కడా లేరు

గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో విద్యా విధానం మారుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే విద్యార్థులు అంతగా రాణించరనే ప్రచారం పెరిగి ప్రైవేటు బాట పడుతున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలను మెరుగు పరుస్తున్నారు. చిన్నారులకు పౌష్టికాహారం, ఉచితంగా బ్యాగులు, బూట్లు, పుస్తకాలు అందిస్తున్నారు. అయినప్పటికీ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడం లేదు. ఇదేపరిస్థితి ప్రైవేటులోనూ కనిపిస్తోంది. ఒకప్పుడు ప్రతి సంవత్సరం అడ్మిషన్లలో ఎంతోకొంత పెరుగుదల ఉంటే, ఇప్పుడు తగ్గుతూ వస్తోంది. దీనికి కారణం జననాల రేటు తగ్గడమేనని అంచనా వేస్తున్నారు.


‘ప్రాథమిక’ ప్రమాదం!

విద్యార్థుల తగ్గుదల ప్రాథమిక తరగతుల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఒకటో తరగతి అడ్మిషన్లలోనే ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. గత ఏడేళ్ల గణాంకాలు పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. 1-5 తరగతుల విద్యార్థులు.. 2018-19లో 36.12 లక్షల మంది ఉండగా.. 2024- 25 నాటికి ఆ సంఖ్య 32.64 లక్షలకు పడిపోయింది. అంటే దాదాపుగా 3.48 లక్షల మంది ప్రాథమిక తరగతుల్లో తగ్గిపోయారు. 2020-21లో ఈ సంఖ్య భారీగా పెరిగి 38.02 లక్షలకు చేరుకోగా అనంతరం గణనీయంగా తగ్గుతూ వస్తోంది. 2025-26 విద్యా సంవత్సరంలో మరింత తగ్గిపోయింది.

నాలుగేళ్లలోనే..

రాష్ట్రంలో కేవలం గత నాలుగేళ్లలో జననాల రేటు గణనీయంగా పడిపోయింది. సుమారు ఇది 0.6 శాతం మేరకు తగ్గిందని అంచనా. పుట్టే పిల్లల సంఖ్య 2.1 నుంచి 1.5 శాతానికి తగ్గింది. మారిన జీవన పరిస్థితులు, పెరిగిన ఖర్చుల దృష్ట్యా ఇద్దరు పిల్లల్ని కనడానికి కూడా యువ దంపతులు ఆసక్తి చూపట్లేదు. చాలా మంది ఒక్కరితోనే సరిపెట్టుకుంటున్నారు. ఈ కారణంగానే చిన్నారుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని తెలుస్తోంది.

Updated Date - Apr 07 , 2026 | 04:50 AM