Share News

‘స్త్రీశక్తి’తో 73.62 కోట్ల ఉచిత ప్రయాణాలు

ABN , Publish Date - Jun 23 , 2026 | 05:00 AM

రాష్ట్రంలో ‘స్ర్తీశక్తి’ పథకాన్ని ప్రారంభించిన నాటి నుంచి జూన్‌ 18 వరకు 73.62 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు చేశారని రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

‘స్త్రీశక్తి’తో 73.62 కోట్ల  ఉచిత ప్రయాణాలు

  • ఆర్టీసీ బస్సుల్లో భారీగా పెరిగిన ఆక్యుపెన్సీ

  • దశలవారీగా ఈ-బస్సులు ప్రవేశపెడుతున్నాం

  • గ్రామీణ ప్రాంతాలకూ విద్యుత్‌ ఏసీ బస్సులు

  • ఏ డిపోనూ ఎవరికీ ఇవ్వం.. అన్నీ ఆర్టీసీ కంట్రోల్‌లోనే ఉంటాయి.. మంత్రి మండిపల్లి

అమరావతి, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ‘స్ర్తీశక్తి’ పథకాన్ని ప్రారంభించిన నాటి నుంచి జూన్‌ 18 వరకు 73.62 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు చేశారని రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. స్త్రీశక్తి, దివ్యాంగ శక్తి పథకాలను ప్రవేశపెట్టిన తర్వాత బస్సుల అక్యుపెన్సీ 69 శాతం నుంచి 92 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. ఆర్టీసీలో విద్యుత్‌ బస్సుల ను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, దశలవారీగా ఈ-బస్సు సర్వీసులను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాలకు కూడా విద్యుత్‌ ఏసీ బస్సులు నడపనున్నట్లు చెప్పారు. గత రెండేళ్లలో రవాణా శాఖ సాధించిన ప్రగతిపై సోమవారం మంత్రి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. 20 24-25లో 1489 కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చామన్నారు. స్త్రీశక్తి పథకానికి 2025-26 సంవత్సరానికి రూ.1200 కోట్లు, 2026-27 సంవత్సరానికి ఇప్పటి వరకు రూ.160 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. ఆర్టీసీకి ప్రయాణ చార్జీల ద్వారా కాకుండా, ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం పెరిగిందని తెలిపారు.


అన్నీ ఆర్టీసీ కంట్రోల్‌లోనే..

ఆర్టీసీలో ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రవేశపెట్టడంపై ఉద్యోగులు, కార్మిక సంఘాలు ఎలాంటి అపోహలకు గురికావాల్సిన అవసరం లేదని రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు స్పష్టం చేశారు. జీసీసీ విధానంలో ఆర్టీసీ యాజమాన్య హక్కులు, సేవల నిర్వహణ, డ్రైవర్ల నిర్వహణ, షెడ్యూళ్లు, ఆదాయ నిర్వహణ, కార్యకలాపాల పర్యవేక్షణ మొత్తం సంస్థ ఆధీనంలోనే కొనసాగుతుందన్నారు. ప్రైవేటు భాగస్వామ్య సంస్థలకు బస్సుల సాంకేతిక నిర్వహణ, చార్జింగ్‌ మౌలిక సదుపాయాల నిర్వహణ వంటి పరిమిత బాధ్యతలు మాత్రమే ఉంటాయన్నారు. ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్‌లకు ఎలక్ట్రిక్‌ వాహనాలపై ప్రత్యేక నైపుణ్య శిక్షణ అందిస్తామని, భవిష్యత్తులో సంస్థనే సమర్థంగా ఈ సేవలను నిర్వహించే సామర్థ్యాన్ని బలోపేతం చేస్తామన్నారు.


రాబోయే రోజుల్లో అన్నీ ఈ-బస్సులే!

ప్రభుత్వం గ్రీన్‌ ట్రాన్స్‌పోర్టుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో వెయ్యి ఎలక్ట్రిక్‌ బస్సులను మంజూరు చేయించడంతో పాటు, కాలపరిమితి ముగిసిన వాహనాల స్థానంలో వచ్చే ఐదేళ్లలో జీసీసీ (గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్ట్‌) విధానం ద్వారా మొత్తం 8321 విద్యుత్‌ బస్సులను దశలవారీగా ప్రవేశపడతామని వెల్లడించారు. పీఎం ఈ-బస్‌ సేవ పథకం కింద 750 ఈ-బస్సులను 11 నగరాల్లోని 12 డిపోల్లో ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఈ బస్సులు దశల వారీగా అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. అదేవిధంగా తిరుపతికి అదనంగా 300 ఈ-బస్సులను కేంద్రం మంజూరు చేసిందని దీనికి టెండర్లు కూడా విడుదలయ్యాయయన్నారు. పూర్వోదయ పథకం కింద బస్సుల కేటాయింపు కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఆర్టీసీకి సంబంధించిన భూమిని కానీ, ఏ ఆర్టీసీ డిపోను గానీ ఎవరికీ దారాదత్తం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. అన్నీ ఆర్టీసీ కంట్రోల్‌లోనే ఉంటాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 85 ఆటోమేటెడ్‌ డ్రైవింగ్‌ టెస్టింగ్‌ సెంటర్ల ద్వారా పారదర్శక, సాంకేతికత ఆధారిత డ్రైవింగ్‌ పరీక్షల వ్యవస్థను విజయవంతంగా అమలు చేశామన్నారు. 2024-25లో రూ.4004 కోట్లుగా ఉన్న రవాణా శాఖ ఆదాయం, 2025-26 నాటికి రూ.5050 కోట్లకు పెరిగిందని, ఇది ప్రభుత్వ సంస్కరణలు, పారదర్శకత పరిపాలనకు నిదర్శనమన్నారు. రోడ్డు భద్రతపై సమగ్ర నిఘా, బస్సు కదలికలపై మానిటరింగ్‌కు కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు.

Updated Date - Jun 23 , 2026 | 05:02 AM