87 కోట్ల ఉచిత ప్రయాణాలు
ABN , Publish Date - Aug 15 , 2026 | 04:44 AM
మహిళల ఆర్థిక సాధికారత, ఆత్మగౌరవానికి ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ఏడాది పూర్తి అయింది.
ఏడాదిలో ‘స్త్రీ శక్తి’ లబ్ధి ఇది
రోజూ 24 లక్షల మందికి ప్రయోజనం
స్కీమ్‌పై ఇప్పటి వరకు 3095 కోట్ల వ్యయం
ఆర్టీసీ బస్సుల ప్రయాణాల్లో 40 నుంచి 62 శాతానికి పెరిగిన అతివల వాటా
‘స్త్రీ శక్తికి సంవత్సరం.. రెట్టింపైన ఆత్మగౌరవం’
పేరుతో నేడు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు
అమరావతి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): మహిళల ఆర్థిక సాధికారత, ఆత్మగౌరవానికి ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ఏడాది పూర్తి అయింది. గతేడాది ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పథకం ఏడాదిలోనే భారీ విజయం సాధించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలోని వివిధ వర్గాల మహిళలు రికార్డు స్థాయిలో 87 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారు. రోజుకు సగటున 24 లక్షల మంది ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ‘స్త్రీ శక్తి’ కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు ప్రభుత్వం రోజుకు సగటున రూ.8.53 కోట్ల సబ్సిడీ భరిస్తోంది. ఇప్పటి వరకు రూ.3095 కోట్లు ఖర్చు చేసింది. మహిళలు ఉద్యోగ, ఉపాధి, విద్య, వైద్యం, ఇతర అవసరాల కోసం సులభంగా రాకపోకలు సాగించేందుకు ఈ పథకం దోహదపడుతోంది. ఏపీఎ్‌సఆర్టీసీలోని మొత్తం 9978 బస్సుల్లో 7631 బస్సుల్లో (76 శాతం) స్త్రీ శక్తి అమలవుతోంది. ఎక్స్‌ప్రెస్, అలా్ట్ర పల్లెవెలుగు, పల్లెవెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ కేటగిరీ బస్సుల్లో ఈ పథకం అమల్లో ఉంది. స్త్రీ శక్తి ప్రారంభానికి ముందు ఆర్టీసీ ప్రయాణాల్లో మహిళల వాటా 40 శాతంగా ఉండేది. ఈ స్కీమ్ అమల్లోకి వచ్చిన తర్వాత అది 62 శాతానికి పెరిగింది. ప్రజారవాణా వినియోగం పెరగడంతో రోడ్డు ప్రమాదాలు కూడా గణనీయంగా తగ్గినట్లు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. మహిళలు ద్విచక్ర వాహనాలు, ఇతర వ్యక్తిగత రవాణా సాధనాలపై ఆధారపడటం తగ్గి, బస్సులను ఎక్కువగా వినియోగిస్తున్నట్లు తెలిపింది.