లక్ష కోట్లతో ఉద్యాన హబ్
ABN , Publish Date - May 15 , 2026 | 03:55 AM
రాయలసీమను ప్రపంచ స్థాయి హార్టీకల్చర్ హబ్‌గా మార్చే లక్ష్యంతో రూ.లక్ష కోట్ల అంచనా వ్యయంతో ‘సమగ్ర ఉద్యానవన అభివృద్ధి ప్రణాళిక (ఐహెచ్‌డీపీ)’ అమలుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
‘సీమ సమగ్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక’కు ఓకే
10 సీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో అమలు
కేంద్రం వాటా రూ.40,352 కోట్లు
ప్రైవేటు పెట్టుబడులు 59 వేల కోట్లు
అమరావతి, మే 14 (ఆంధ్రజ్యోతి): రాయలసీమను ప్రపంచ స్థాయి హార్టీకల్చర్ హబ్‌గా మార్చే లక్ష్యంతో రూ.లక్ష కోట్ల అంచనా వ్యయంతో ‘సమగ్ర ఉద్యానవన అభివృద్ధి ప్రణాళిక (ఐహెచ్‌డీపీ)’ అమలుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో కేంద్రప్రభుత్వం రూ.40,352 కోట్లు మంజూరు చేస్తుంది. మిగతా రూ.59 వేల కోట్లు ప్రైవేటు పెట్టుబడుల రూపంలో వస్తాయని రాష్ట్రప్రభుత్వం ఆశిస్తోంది. కేంద్రం మంజూరు చేసే నిధుల్లో ఉద్యాన రంగానికి రూ.14,906 కోట్లు, నీటిపారుదలకు రూ.20,884 కోట్లు, గ్రామీణ రోడ్ల నిర్మాణం, వాటిని రోడ్డు, రైలు, నౌకాశ్రయాలకు అనుసంధానించడానికి రూ.4562 కోట్లు కేటాయించనున్నారు.ప్రస్తుతం సీమలో 8.4 లక్షల హెక్టార్లలో ఉద్యాన సాగు ఉండగా.. 2030 నాటికి 14.41 లక్షల హెక్టార్లకు పెంచడం.. ప్రస్తుత ఉద్యాన ఉత్పత్తులను 222 లక్షల టన్నుల నుంచి 435 లక్షల టన్నులకు పెంచాలనే లక్ష్యాలతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది. దీనిని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు 2026-27 రాష్ట్ర బడ్జెట్‌లో రూ.30 వేల కోట్లు ప్రతిపాదించింది. అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, ప్రకాశం, మార్కాపురం.. మొత్తం 10 జిల్లాల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు.