Share News

నీటి కేటాయింపులపై ట్రైబ్యునల్‌ పాత్ర నామమాత్రమే!

ABN , Publish Date - Feb 25 , 2026 | 03:24 AM

నీటి కేటాయింపులపై ట్రైబ్యునల్‌ పాత్ర నామమాత్రంగానే ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌ తెలిపింది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసే అధికారం దానికి లేదని స్పష్టం చేసింది.

నీటి కేటాయింపులపై ట్రైబ్యునల్‌ పాత్ర నామమాత్రమే!

  • ప్రాజెక్టులవారీగా కేటాయించే అధికారం లేదు: ఏపీ

  • తెలంగాణ వాదనలు అపరిపక్వం, అనాలోచితం

  • వాటిని పరిగణనలోకి తీసుకోవద్దు

  • రాజధాని అమరావతి పరిధి 217 చ.కి.మీ. మాత్రమే

  • 8,603 చ.కి.మీ.గా ఉందనడం నిజం కాదు

  • హైదరాబాద్‌ పట్టణీకరణపై తెలంగాణ చేస్తున్న వాదనల్లోనూ వాస్తవం లేదు

  • బ్రిజేశ్‌ ట్రైబ్యునల్‌ ఎదుట ఏపీ న్యాయవాదుల స్పష్టీకరణ

  • తదుపరి విచారణ మార్చి 23, 24 తేదీలకు వాయిదా

అమరావతి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): నీటి కేటాయింపులపై ట్రైబ్యునల్‌ పాత్ర నామమాత్రంగానే ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌ తెలిపింది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసే అధికారం దానికి లేదని స్పష్టం చేసింది. కృష్ణా జలాలపై తెలంగాణ చేస్తున్న అపరిపక్వ, అనాలోచిత, నిరాధార వాదనలను పరిగణనలోకి తీసుకోవద్దని కోరింది. ట్రైబ్యునల్‌ న్యాయసమ్మతంగానూ.. చట్టం మేరకు మాత్రమే జోక్యం చేసుకోగలదని తెలిపింది. పరిశ్రమలు, తాగునీరు, పర్యావరణానికి నదీ జలాలను తప్పనిసరిగా కేటాయించాలని స్పష్టం చేసింది. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి సంబంధించి విచారణ జరుపుతున్న బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ ఎదుట సీనియర్‌ న్యాయవాది జైదీప్‌ గుప్తా సారథ్యంలో సీనియర్‌ కౌన్సిల్‌ ఉమాపతి, న్యాయవాదులు ఎస్‌.సంజయ్‌, శరత్‌చంద్రతో కూడిన న్యాయవాద బృందం.. కృష్ణా డెల్టా సిస్టమ్‌ సాగునీటి అవసరాలపై వరుసగా రెండోరోజైన మంగళవారం కూడా తన వాదనలు కొనసాగించింది. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదిలోకి ఎత్తిపోస్తున్నందున.. తమకు 105.9 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించాలన్న తెలంగాణ వాదనను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించేందుకు వీల్లేదని తెలిపింది. ‘గోదావరి జలాలను కృష్ణా నదిలోకి మళ్లించే పక్షంలో ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీల కృష్ణా జలాలను పంచుకోవాలని గోదావరి ట్రైబ్యునల్‌ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. తమ ఒక్క రాష్ట్రానికే 105.9 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ కోరడంలో న్యాయం లేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యాక.. కుడి ప్రధాన కాలువ గుండా పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోసే ప్రక్రియ నిలిచిపోతుంది.


అయినా ఈ అంశం బ్రిజేశ్‌ ట్రైబ్యునల్‌ పరిధిలోకి రాదు’ అని తెగేసిచెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా తీరంలో నగరీకరణ కారణంగా కృష్ణా జలాలను తమకు అధికంగా ఇవ్వాలన్న తెలంగాణ వాదన కూడా న్యాయసమ్మతం కాదని తెలిపింది. ‘రాజధాని అమరావతి నగరం పరిధిని 217 చదరపు కిలోమీటర్ల వరకే ప్రకటించారు. కానీ 8,603 చదరపు కిలోమీటర్లుగా ఉందన్న పొరుగు రాష్ట్రం వాదనలో నిజం లేదు. ప్రభుత్వం అధికారికంగా చేసిన ప్రకటననే పరిగణనలోకి తీసుకోవాలి. హైదరాబాద్‌ పట్టణీకరణపై తెలంగాణ చేస్తున్న వాదనల్లోనూ వాస్తవం లేదు. 10,472 చదరపు కిలోమీటర్ల మేర వ్యవసాయం తగ్గిపోయిందంటూ.. ఆ నీటిని పరిశ్రమలకు, తాగునీటికీ తరలించాలని చెబుతోంది. పులిచింతల రిజర్వాయరులోని నీటి పునఃపంపిణీ సాధ్యం కాదు. నాగార్జునసాగర్‌ కుడి, ఎడమ కాలువలు, మున్నేరు ద్వారా పులిచింతలకు 12 టీఎంసీల దాకా బదలాయిస్తున్నారన్న వాదనలోనూ నిజం లేదు. నీటి కేటాయింపులపై తెలంగాణ సూచించిన 30 అంశాలను పరిగణనలోకి తీసుకునేందుకు ఆస్కారమే లేదు’ అని స్పష్టంచేసింది. అనంతరం ట్రైబ్యునల్‌ తదుపరి విచారణను వచ్చే నెల 23, 24 తేదీలకు వాయిదావేసింది.

Updated Date - Feb 25 , 2026 | 03:51 AM