‘తెలుగు’లో తడబాటు
ABN , Publish Date - May 05 , 2026 | 04:12 AM
ఈసారి పదో తరగతి ఫలితాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. మాతృభాష తెలుగులో ఎక్కువమంది విద్యార్థులు తడబడటం, పరాయి భాషలు హిందీ, ఇంగ్లీష్‌లో మాత్రం ఉత్తీర్ణతాశాతం ఎక్కువ ఉండటం...
మాతృభాషలోనే ఎక్కువమంది ఫెయిల్
హిందీ, ఇంగ్లిష్‌ల్లో మాత్రం అత్యధిక ఉత్తీర్ణత
ఆసక్తి కలిగిస్తున్న టెన్త్ ఫలితాలు
అమరావతి, మే 4(ఆంధ్రజ్యోతి): ఈసారి పదో తరగతి ఫలితాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. మాతృభాష తెలుగులో ఎక్కువమంది విద్యార్థులు తడబడటం, పరాయి భాషలు హిందీ, ఇంగ్లీష్‌లో మాత్రం ఉత్తీర్ణతాశాతం ఎక్కువ ఉండటం ఆశ్చర్యం కలిగిస్తున్న పరిణామం. సబ్జెక్టుల్లో సైన్సు అత్యధిక విద్యార్థులకు సవాల్‌గా మారింది. ఎక్కువమంది ఈ సబ్జెక్టులో ఫెయిల్ కావడమో లేక తక్కువ మార్కులు స్కోర్ చేయడమో జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు 6,17,827 మంది రాయగా, 5,26,677 మంది ఉత్తీర్ణులయ్యారు. 91,150 మంది. ఫెయిల్ అయ్యారు. వీరిలో మాతృభాష తెలుగులోనే ఎక్కువ మంది డమ్కీ కొట్టారు. దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ పట్ల సాధారణంగా శ్రద్ధ తక్కువ. ఇంగ్లీషు అంటే మన విద్యార్థులు క్లిష్టంగా భావిస్తారు.అయితే ఈ రెండింటిలోనూ తక్కువ మందే ఫెయిల్ కావడం గమనార్హం. సైన్స్‌లో 54,272 మంది (59.5 శాతం), సోషల్ 38,066(41.80), మ్యాథ్స్ 39,722(43.60) మంది ఫెయిల్ అయ్యారు. ఇక ఇంగ్లీష్‌లో 8,771 మంది(9.6 శాతం), హిందీ 1,436 (1.6 శాతం) మంది ఉత్తీర్ణులు కాలేదు. తెలుగులో అత్యధికంగా 37,679(41.3 శాతం) మంది ఫెయిల్ అయ్యారు. వీరిలో బాలికల కంటే బాలురే ఎక్కువగా ఉన్నారు. 82.68 శాతం మంది బాలురు పాస్ కాగా, బాలికలు 87.9 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక.. 573 మందికి (0.6శాతం) అన్ని సబ్జెక్టులూ పోయాయి. 3,514 మంది(3.9 శాతం) ఐదు సబ్జెక్టులు, 8,268 మంది (9.1శాతం) నాలుగు సబ్జెక్టులు, 12,938 మంది(14.2 శాతం) మూడు సబ్జెక్టులు, 21,195 మంది (23.3 శాతం) రెండు సబ్జెక్టులు, 44,662 మంది (49 శాతం) ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యారు.