టీచర్లకు ప్రత్యేక టెట్
ABN , Publish Date - Jul 09 , 2026 | 04:30 AM
ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించేందుకు అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. 2011కు ముందు నియమితులైన టీచర్లు ప్రత్యేక టెట్ రాసేందుకు అర్హులని తెలిపింది.
2011కు ముందు నియమితులైన వారికి వర్తింపు
అమరావతి, జూలై 8(ఆంధ్రజ్యోతి): ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించేందుకు అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. 2011కు ముందు నియమితులైన టీచర్లు ప్రత్యేక టెట్ రాసేందుకు అర్హులని తెలిపింది. ఈ ఏడాది డిసెంబరు లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ పరీక్ష నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఇటీవల సాధారణ టెట్‌కు నోటిఫికేషన్‌కు 74 వేల మంది ఇన్‌సర్వీస్ టీచర్లు దరఖాస్తు చేశారు. అందులో అర్హత సాధించని వారు ప్రత్యేక టెట్ రాసుకునే వెసులుబాటు ఉంటుంది. రాష్ట్రంలో సుమారు 80 వేల మంది టీచర్లు టెట్ అర్హత సాధించాల్సి ఉంటుందని అంచనా. 2028 ఆగస్టు 31 నాటికి దేశంలోని మొత్తం టీచర్లు టెట్ అర్హత సాధించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ఉపాధ్యాయ సంఘాల హర్షం
ప్రత్యేక టెట్ నిర్ణయంపై ఏపీటీఎఫ్-1938 అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, ఎస్.చిరంజీవి, ఎస్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.రఘునాథరెడ్డి, ఎల్.సాయి శ్రీనివాస్, టీఎన్‌యూస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, రామిశెట్టి వెంకటేశ్వర్లు, ఏపీటీఎఫ్-257 అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీహెచ్ మంజుల, కె.బసవలింగారావు, ఆర్‌జేయూపీ ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.షరీఫ్, ఏపీటీఎఫ్ -అమరావతి అధ్యక్షుడు సీవీ ప్రసాద్, ఎస్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.రఘునాథరెడ్డి, ఎల్.సాయి శ్రీనివాస్, ఆపస్ అధ్యక్షుడు ఎస్.బాలాజీ హర్షం వ్యక్తం చేశారు.