బినామీలం కాదు బాధితులం
ABN , Publish Date - Jun 05 , 2026 | 05:27 AM
మేం ఎవరికీ బినామీలం కాదు సార్. మమ్మల్ని బెదిరించి మా ఆస్తులు లాక్కున్నారు. ఆర్థికంగా నష్టపోయి అప్పులపాలయ్యాం. ఇప్పుడు వాళ్ల కేసుల్లో మమ్మల్ని చేర్చి ఇబ్బంది పెట్టొద్దు.....
ఆర్థికంగా నష్టపోయాం.. కేసుల్లో మమ్మల్ని చేర్చొద్దు
సిట్ విచారణలో జగన్ పీఏ బాధితుల గగ్గోలు
హాజరైన స్థిరాస్తి వ్యాపారి, మైనింగ్ కాంట్రాక్టర్
వైసీపీ ఆఫీసు ఉద్యోగికి సిట్ నోటీసు
నేడు విచారణకు రావాలని ఆదేశం
ఎటు వెళ్తుందోనని పార్టీ వర్గాల ఆందోళన
అమరావతి, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): ‘మేం ఎవరికీ బినామీలం కాదు సార్. మమ్మల్ని బెదిరించి మా ఆస్తులు లాక్కున్నారు. ఆర్థికంగా నష్టపోయి అప్పులపాలయ్యాం. ఇప్పుడు వాళ్ల కేసుల్లో మమ్మల్ని చేర్చి ఇబ్బంది పెట్టొద్దు’ అని మాజీ సీఎం జగన్ పీఏ కె.నాగేశ్వరరెడ్డి(కేఎన్‌ఆర్)తో ఆర్థిక లావాదేవీలు జరిపిన వ్యక్తులు విచారణలో వాపోయినట్లు తెలిసింది. సిట్ విచారణలో కేఎన్‌ఆర్ అక్రమాస్తులు భారీగా బయటపడుతున్నాయి. మద్యం ముడుపుల కన్నా దందాలతో ఎక్కువ దోచాడు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో మూలాల్ని వెలికితీస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కీలక నిందితుడు, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం నుంచి పదెకరాల భూమి కొనుగోలు చేసిన కేఎన్‌ఆర్‌ను పిలిచి విచారించింది. అందులో లభించిన కొన్ని ఆర్థిక లావాదేవీలు పరిశీలించిన సిట్ అధికారులు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులో భారీగా కేఎన్‌ఆర్ అక్రమాస్తులను గుర్తించారు. బ్యాంకు ఖాతాలు పరిశీలించగా విదేశాల్లో సైతం కేఎన్‌ఆర్ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో విజయవాడకు చెందిన లక్కీ హుందాయ్ కార్ల షోరూమ్ యజమాని నుంచి వివరాలు సేకరించారు. కేఎన్‌ఆర్‌కు షోరూమ్‌లో వాటా ఇవ్వడం వెనకున్న రహస్యాన్ని తేల్చారు. ఇదే సమయంలో జగన్ పీఏ అక్రమాస్తులు, ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సభ్యుల వ్యాపారాలు ఇతరత్రా బాగోతాలను పూర్తి స్థాయిలో వెలికి తీసేందుకు తొమ్మిది ప్రత్యేక బృందాలను సీఐడీ నియమించింది. వాటిని క్షుణ్నంగా పరిశీలిస్తున్న సిట్ అధికారులు తమకు లభించిన ఆధారం మేరకు హైదరాబాద్‌కు చెందిన ఒక స్థిరాస్తి వ్యాపారి, నెల్లూరు జిల్లాకు చెందిన మరో మైనింగ్ కాంట్రాక్టర్‌ను విజయవాడకు పిలిపించి బుధ, గురువారం రెండు రోజులు ప్రశ్నించారు. కేఎన్‌ఆర్ కుటుంబంతో జరిపిన భూ, ఆర్థిక లావాదేవీలపై స్థిరాస్తి వ్యాపారిని ప్రశ్నించారు. ‘మార్కెట్లో నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మంచి పేరుంది సార్.. నేను ఎవరికీ బినామీని కాదు. విజయవాడలో వేసిన వెంచర్ నుంచి వేల చదరపు గజాలు లాక్కున్నారు. కేఎన్‌ఆర్ స్నేహితుడు ప్రతిసారీ గన్ ముందు పెట్టి బెదిరించాడు. అతనికి ఎలాంటి ప్రాణహాని లేకున్నా విజయవాడ పటమట పోలీసులతో లైసెన్స్ తీసుకుని సెటిల్మెంట్ల కోసం చూపించేవాడు. రూపాయి ఇచ్చి ఐదు రూపాయల ఆస్తి రాయించుకున్నారు. వాళ్ల దెబ్బకు ఆర్థికంగా నష్టపోయా. అప్పుల పాలయ్యా. దయచేసి ఆ కేసుల్లో నా పేరు చేర్చొద్దు’ అంటూ ఆయన ప్రాధేయపడినట్లు తెలిసింది. ఆ స్థిరాస్తి వ్యాపారి చెప్పినదాంట్లో ఎంతమేర వాస్తవముందో నిర్ధారించుకున్నాకే తదుపరి చర్యలు తీసుకుందామనే ఆలోచనలో సిట్ అధికారులు ఉన్నారు.
నేడు వైసీపీ ఆఫీసు ఉద్యోగి విచారణ
మాజీ సీఎం జగన్ నివాసం ఉండే తాడేపల్లి ప్యాలె్‌సకు పక్కనే ఉండే వైసీపీ కేంద్ర కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి, కడప జిల్లాకు చెందిన మనోహర్‌కు సిట్ నోటీసులు ఇచ్చింది. శుక్రవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం నుంచే మనోహర్ జీతాలు అందుకున్నట్టు తెలుస్తోంది. జగన్ పీఏ కేఎన్‌ఆర్‌కు సంబంధించిన లావాదేవీలు, ఇతరత్రా వ్యవహారాల గురించి మనోహర్‌కు బాగా తెలుసునని సమాచారం. దీంతో మద్యం కుంభకోణం, కేఎన్‌ఆర్ ఇతర దందాల గురించి కీలక సమాచారం రాబట్టేందుకు సిట్ విచారించనున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో వైసీపీ ఆఫీసులో పనిచేసే ఉద్యోగికి తొలిసారిగా సిట్ నోటీసు ఇవ్వడం ఆ పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. అంతిమంగా ఎటు వెళ్తోంది? పార్టీ ఆఫీసును దాటుకుని పక్కనే ఉన్న ప్యాలె్‌సలోకి దారితీస్తుందా? అన్న ఆందోళన వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.