ముగిసిన ‘సర్’
ABN , Publish Date - Jul 25 , 2026 | 05:18 AM
రాష్ట్రంలో ఓటర్ల సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ ముగిసింది. దీనిలో భాగంగా జూన్ 15 నుంచి చేపట్టిన ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ, డిజిటలైజేషన్ గడువు శుక్రవారంతో పూర్తయింది.
4.16 కోట్ల ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్
100శాతం పూర్తయిన ఫారాల పంపిణీ, స్వీకరణ
44.71 లక్షల మంది అన్‌కలెక్టబుల్ ఓటర్లు
అమరావతి, జూలై 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఓటర్ల సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ ముగిసింది. దీనిలో భాగంగా జూన్ 15 నుంచి చేపట్టిన ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ, డిజిటలైజేషన్ గడువు శుక్రవారంతో పూర్తయింది. ఈ ఏడాది మే 25 నాటికి రాష్ట్రంలో 4,16,26,694 మంది ఓటర్లు ఉండగా, అందరికీ ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసి, వాటిని తిరిగి స్వీకరించి డిజిటలైజ్ చేశారు. వివరాల సేకరణకు వీలుకాని (అన్‌కలెక్టబుల్) ఫారాలు కూడా డిజిటలైజ్ అయినట్లుగానే ఎన్నికల సంఘం పరిగణిస్తుంది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు అందిన సమాచారం ప్రకారం... రాష్ట్రవ్యాప్తంగా 44,71,523 అన్‌కలెక్టబుల్ ఎన్యుమరేషన్ ఫారాలు ఉన్నాయి. వీటిలో అత్యధిక వాటా మరణించిన ఓటర్లదే. వీరి సంఖ్య 15,19,558 (3.65శాతం)గా గుర్తించారు. ఇక శాశ్వతంగా చిరునామా మారినవారు 14,34,112 (3.45శాతం), అన్‌ట్రేసబుల్, ఆబ్సెంట్ ఓటర్లు 7,76,900 (1.87శాతం) ఉన్నారు. అలాగే డబుల్ ఎంట్రీలు 7,32,566 (1.76శాతం) ఉన్నాయి. అదేవిధంగా 2002 నాటి ఓటరు జాబితాతో మ్యాపింగ్ కానివారు 8,55,560 మంది ఉన్నారు. ఈ నెల 31న కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసే ముసాయిదా ఓటర్ల జాబితాలో వీరు ఓటరుగా ఉండే అవకాశం లేదు. పూర్తి వివరాలను ఎన్నికల సంఘం శనివారం వెల్లడించనుంది. 16 జిల్లాల్లో 10 శాతానికిపైగా అన్‌కలెక్టబుల్ ఫారాలు ఉన్నాయి. ఈ జాబితాలో తిరుపతి (16.26శాతం) టాప్‌లో ఉండగా, ఆ తర్వాత స్థానాల్లో వరుసగా నెల్లూరు(14.72శాతం), పోలవరం (13.98శాతం), కర్నూలు (13.13శాతం), గుంటూరు (13.2శాతం), కడప (12.91శాతం), నంద్యాల (12.71శాతం), అల్లూరి (12.66శాతం) జిల్లాలు ఉన్నాయి.