Share News

పారిశ్రామికవేత్తలుగా రైతులు

ABN , Publish Date - Jul 08 , 2026 | 03:49 AM

రైతు కుటుంబాలు కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా పారిశ్రామికీకరణ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇథనాల్‌కు డిమాండ్‌ పెరగనున్న నేపథ్యంలో..

పారిశ్రామికవేత్తలుగా రైతులు

  • పెరుగుతున్న ఇథనాల్‌ డిమాండ్‌ను సద్వినియోగం చేసుకోవాలి

  • ఆ రంగంలో పెట్టుబడులు ఆకర్షించాలి

  • గ్రామీణ ఎకానమీ బలోపేతమయ్యే ప్రణాళిక

  • ఆ దిశగా ప్రత్యేక పాలసీ రూపకల్పన చేయాలి

  • పర్యాటక రంగంలో అపార అవకాశాలు

  • 100 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్ల ఏర్పాటు లక్ష్యం

  • రైల్వే టెర్మినల్స్‌తో ఎంఎ్‌సఎంఈల సంధానం

  • 19వ ఎస్‌ఐపీబీ సమావేశంలో సీఎం

  • రూ.9,676 కోట్లతో 11 ప్రాజెక్టులకు ఓకే

  • 11 వేల మందికి ఉద్యోగ అవకాశాలు

అమరావతి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): రైతు కుటుంబాలు కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా పారిశ్రామికీకరణ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇథనాల్‌కు డిమాండ్‌ పెరగనున్న నేపథ్యంలో ఆ రంగంలో రైతులను ప్రోత్సహించాలని సూచించారు. రూరల్‌ ఎకానమీని బలోపేతం చేసేలా ఇథనాల్‌ పరిశ్రమల ఏర్పాటు దిశగా సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని చెప్పారు. ఇథనాల్‌, మీథేన్‌, ఏవియేషన్‌ ఇంధనానికి సంబంధించి ఒక ప్రత్యేక పాలసీ రూపొందించాలన్నారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం 19వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రూ. 9,676 కోట్ల పెట్టుబడులు, 10,931 మందికి ఉద్యోగావకాశాలను కల్పించే 11 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పెట్రోల్‌లో కలిపేందుకు ఇథనాల్‌ భారీగా అవసరం కానుందని చెప్పారు. ఇథనాల్‌ బ్లెండింగ్‌ 40 శాతానికి పెరిగితే, మొక్కజొన్న పంటకు డిమాండ్‌ ఏర్పడుతుందని అన్నారు. ఇథనాల్‌ తయారీ రంగంలో వచ్చే అన్ని పెట్టుబడులను ప్రోత్సహించాలని సూచించారు. సంపద సృష్టి, సర్క్యులర్‌ ఎకానమీ అనేది ప్రభుత్వ విధానమని వెల్లడించారు.


ఇక రాష్ట్ర పర్యాటక రంగంలోనూ అపార అవకాశాలున్నాయని చంద్రబాబు చెప్పారు. తిమ్మమ్మ మర్రిమానుతో సహా రాష్ట్రవ్యాప్తంగా 100 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లను ఏర్పాటు చేయడమే లక్ష్యమన్నారు. పోలవరం, దిండి, గండికోట, కంబం చెరువులాంటి ప్రాంతాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. లంబసింగి, అరకు సమీపంలో రిసార్ట్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. జిందాల్‌ సంస్థ లంబసింగి, అరకు ప్రాంతాల్లో రిసార్ట్స్‌ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతోందని తెలిపారు. ఏటికొప్పాక, కొండపల్లి, ధర్మవరం, మంగళగిరి, ఉప్పాడ, పొందూరు కళారూపాలను కూడా పెద్దఎత్తున ప్రోత్సహించాలన్నారు. పర్యాటక రంగం నుంచి రాష్ట్ర ఆదాయం పెరిగేలా చూడాలన్నారు. పర్యాటకరంగ అభివృద్ధికి అవసరమైన హోటల్‌ గదులు పెద్దఎత్తున వస్తున్నాయన్నారు. 2024లో 4,390 హోటల్‌ రూములు ఉంటే.. ఈ రెండేళ్లలో 9,364కు నిర్మాణంలో ఉన్నాయని వెల్లడించారు.


సోలార్‌ సెల్స్‌ తయారీలో అగ్రగామి కావాలి

రెన్యూవబుల్‌ ఎనర్జీ విస్తృతం కావడంతో సోలార్‌ సెల్స్‌ తయారీ పరిశ్రమలను రాష్ట్రానికి ఆహ్వానించాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. సోలార్‌ సెల్స్‌ తయారీలో ఏపీ అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు. ఇంకా ఏర్పాటు చేయాల్సిన 38 ఎంఎ్‌సఎంఈ పార్కులను త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. రైల్వే టెర్మినల్స్‌కు ఎంఎస్ఎంఈలను అనుసంధానం చేయాలని సూచించారు. సమావేశంలో మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌, అనగాని సత్యప్రసాద్‌, పి.నారాయణ, గొట్టిపాటి రవికుమార్‌, కందుల లక్ష్మీ దుర్గేశ్‌, సీఎస్‌ సాయిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


ఎస్‌ఐపీబీ ఆమోదం పొందిన ముఖ్య ప్రాజెక్టులు

  • డీఎస్ఆర్‌ హాస్పిటాలిటీ సర్వీసెస్‌ నెల్లూరు జిల్లాలో 4-స్టార్‌ హోటల్‌ నిర్మాణం. రూ.139.92 కోట్ల పెట్టుబడి, 180 మందికి ఉద్యోగాలు.

  • శ్రీనివాసం అమ్యూజ్‌మెంట్‌ ప్రై.లిమిటెడ్‌ కడప జిల్లాలో రూ. 68.69 కోట్లతో అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ నిర్మాణం. 690 మందికి ఉద్యోగాలు.

  • తిరుపతి జిల్లా సత్యవేడు చిన్నఎత్తిపాకంలో నెక్సస్‌ ఇంటిగ్రేటెట్‌ లాజిస్టిక్స్‌ పార్క్‌ ఏర్పాటుకు రూ. 255 కోట్ల పెట్టుబడి. 400 మందికి ఉపాధి.

  • అక్షత్‌ ఇంటిగ్రేటెడ్‌ ప్రై.లిమిటెడ్‌ అనకాపల్లి జిల్లా పరవాడలో రూ.1600 కోట్లుతో సోలార్‌ సెల్స్‌, మాడ్యూల్స్‌ తయారీ యూనిట్‌, 750 మందికి ఉద్యోగాలు.

  • బెర్రీ అల్లాయ్స్‌ లి. బొబ్బిలి గ్రోత్‌ సెంటర్‌లో ఇంటిగ్రేటెడ్‌ మాంగనీస్‌ ప్లాంట్‌, డీఆర్‌ఐ కార్బన్‌ పేస్ట్‌ ప్లాంట్‌ కు 1200 కోట్లు పెట్టుబడి, 831 మందికి ఉద్యోగాలు.

  • జియో మైసూర్‌ ఇండియా ప్రై.లిమిటెడ్‌ కర్నూలు జిల్లా స్వర్ణగిరిలో గోల్డ్‌ మైనింగ్‌ ప్రాజెక్టుకు రూ. 689 కోట్లు పెట్టుబడి. 1,750 మందికి ఉపాధి.

  • ఈకో బాక్స్‌ ఇండిస్ట్రియల్స్‌ అసెట్‌-4 ప్రై.లి. (గూగుల్‌ వేర్‌ హౌస్‌ పార్టనర్స్‌) విశాఖలో లాజిస్టిక్స్‌, లైట్‌ ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటుకు రూ. 1,008 కోట్ల పెట్టుబడి, 5,000 మందికి ఉపాధి.

  • అదానీ ఫౌండేషన్‌ విశాఖ జిల్లా కాపులుప్పాడలో రూ. 2,200 కోట్ల పెట్టుబడితో ప్రాజెక్టు.

  • మోండెలీజ్‌ ఇండియా ఫుడ్స్‌ ప్రై.లి. తిరుపతి జిల్లా శ్రీసిటీలో రూ. 1,801 కోట్ల పెట్టుబడితో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు. 80 మందికి ఉపాధి.

Updated Date - Jul 08 , 2026 | 06:10 AM