Share News

Andhra Pradesh Economy: 17.11శాతం వృద్ధిరేటు లక్ష్యం

ABN , Publish Date - Jan 13 , 2026 | 04:51 AM

స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించే దిశగా వేగంగా రాష్ట్రం వేగంగా ముందుకు సాగుతోంది. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ) వృద్ధిరేటు 2025-26 నాటికి 17.11 శాతంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించాం...

Andhra Pradesh Economy: 17.11శాతం వృద్ధిరేటు లక్ష్యం

  • అదనపు ఆదాయం కోసం కొత్త మార్గాలు

  • 2047 నాటికి తలసరి ఆదాయం రూ. 54 లక్షలు

  • ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌ కుమార్‌ వెల్లడి

అమరావతి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ‘‘స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించే దిశగా వేగంగా రాష్ట్రం వేగంగా ముందుకు సాగుతోంది. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ) వృద్ధిరేటు 2025-26 నాటికి 17.11 శాతంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించాం’’ అని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్‌ కుమార్‌ చెప్పారు. సోమవారం సచివాలయంలో జరిగిన సెక్రటరీల సదస్సులో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి, ఇతర సెక్రటరీలు మాట్లాడారు. అదనపు ఆదాయం కోసం కొత్త మార్గాలు అన్వేషిస్తున్నామని, ఏపీ లాటరీ, ఆన్‌లైన్‌ గేమింగ్‌, ఎస్‌జీఎస్‌టీపై 1 శాతం సెస్‌ లాంటి మార్గాల్లో రూ. వేల కోట్ల అదనపు ఆదాయం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశామని పీయూష్‌ కుమార్‌ వెల్లడించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘‘2047-48 నాటికి జీఎస్‌డీపీలో సేవారంగం వాటా 55.19 శాతానికి చేరుకుంటుంది. 2023-24లో తలసరి ఆదాయం రూ. 2,66 ,995 ఉండగా, 2047-48 నాటికి రూ. 54,60,748 కి పెరుగుతుంది. ఎస్‌జీఎస్‌టీపై 1 శాతం సెస్‌ ద్వారా రూ. 4,700 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ లాటరీ ద్వారా రూ. 3,000 కోట్లు, ఆన్‌లైన్‌ గేమింగ్‌ పన్ను ద్వారా రూ. 1,400 కోట్లు అదనపు ఆదాయానికి అవకాశం ఉంది. స్థానిక సంస్థల వినోదపన్ను రూపంలో రూ. 2,300 కోట్లు, రెండో, మూడో స్థాయి అమ్మకాలపై వ్యాట్‌ ద్వారా రూ. 1,300 కోట్లు, వృత్తిపన్ను పెంపు ద్వారా రూ. 400 కోట్లు, విజయవాడ, విశాఖ మున్సిపల్‌ పరిధిలో వృత్తిపన్ను వసూళ్ల బదిలీ ద్వారా రూ.110 కోట్లు సాధించే అవకాశం ఉంది. ఇలా కొత్త ఆదాయ వనరుల ద్వారా రూ. 13,100 కోట్లు సాధించాలనే లక్ష్యంతో ఉన్నాం. మద్యంపై పన్నులు, స్టాంపులు, రిజిస్ర్టేషన్లు, గనులు, భూగర్భ సంపద, రవాణా పన్నులు ఇతర శాఖల్లో సగటున 60-75 శాతం వరకు వసూళ్లు నమోదయ్యాయి. ఏపీ జీఎస్టీ కలెక్షన్లు నెలవారీగా 27 శాతం వృద్ధి, వార్షిక సగటు వృద్ధి 31 శాతంగా నమోదైంది. రాష్ట్ర ఆదా య ఆర్జన శాఖలు లక్ష్యాల్లో 80-85 శాతం సాధించాయి. 2025-26 ఆర్థి క సంవత్సరంలో ఆదాయ ఆర్జన శాఖలు గణనీయమైన పురోగతి సాధించాయి. హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఐఓసీఎల్‌, రిలయన్స్‌, ఎస్సార్‌, ఓఎన్జీసీ వంటి సంస్థలపై వ్యాట్‌/జీఎస్టీ ఆడిట్లు చేస్తున్నారు.


అభివృద్ధికి శ్రమిస్తున్నాం

2024-29కి ప్రభుత్వ ఆర్థిక కార్యాచరణ ప్రణాళిక ప్రకారం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ రూ. 29.29 లక్షల కోట్లు, తలసరి ఆదాయం రూ. 4.85 లక్షలు చేరేలా లక్ష్యాలు నిర్దేశించాం. వ్యవసాయ రంగంలో 13.43 శాతం, పారిశ్రామిక రంగంలో 17.23 శాతం, సేవా రంగంలో 16.46 శాతం, నికర పన్నుల్లో 14.2 శాతం వృద్ధి రేటుతో అభివృద్ధి సాధించేందుకు శ్రమిస్తున్నాం. 2024-25లో వ్యవసాయ రంగంలో రూ. 6,02,728 కోట్లు, పారిశ్రామిక రంగంలో రూ. 3,99,358 కోట్లు, సేవా రంగంలో రూ. 7,10,714 కోట్ల ఉత్పత్తి సాధించి మొత్తం జీఎ్‌సడీపీ రూ. 18,65,704 కోట్లుగా అంచనా వేశాం. దేశవ్యాప్తంగా 2024-25లో భారత ఆర్థిక పరిమాణం రూ. 301 లక్షల కోట్లు కాగా, ఆంధ్రప్రదేశ్‌ రూ. 14.22 లక్షల కోట్లుగా ఉంది. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3.15 లక్షలకు చేరగా, దేశ సగటు రూ.1.87 లక్షలే ఉంది. దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌ జీఎ్‌సడీపీ వృద్ధిరేటు 12.02 శాతం, కర్ణాటక 9.2 శాతం, తమిళనాడు 8.7 శాతం, తెలంగాణ 9.1 శాతం, కేరళ 9.8 శాతం నమోదు కాగా దేశ సగటు వృద్ధిరేటు 6.5 శాతంగా ఉంది. తలసరి ఆదాయం పరంగా మొదటిస్థానంలో కర్ణాటక రూ.3.48 లక్షలు, తెలంగాణ రూ.3.43 లక్షలు, తమిళనాడు రూ.3.22 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌ రూ.3.15 లక్షలు, కేరళ రూ.2.90 లక్షలతో ఉన్నాయి. మొత్తంమీద ఆంధ్రప్రదేశ్‌ 2024-25లో 188 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, రూ.3.15 లక్షల తలసరి ఆదాయం, రూ.12.02 శాతం వార్షిక వృద్ధిరేటుతో దేశ ఆర్థిక పురోగతిలో ప్రముఖ స్థానాన్ని సంపాదించి, అభివృద్ధి పథకంలో ముందుకు సాగుతోంది.


వ్యవసాయరంగంలో బలమైన వృద్ధి

రాష్ట్రంలో ఎక్కువ జిల్లాలు ఏ ఏ+ విభాగాల్లో ఉండడం రాష్ట్రం వ్యవసాయ ఉత్పత్తిలో బలమైన వృద్ధి సూచిస్తోంది. పరిశ్రమల రంగంలో అనేక జిల్లాలు 70-85 శాతం పనితీరు సాధించగా, ముఖ్యంగా అనంతపురం, కర్నూలు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలు మంచి ర్యాంకులు సాధించాయి. సేవారంగం లో జిల్లాల పనితీరు, ఐటీ, పర్యాటకం, రవా ణా, రియల్‌ ఎస్టేట్‌, హెల్త్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ రంగాల్లో ఆధారపడి ఉండగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు జిల్లాలు అత్యుత్తమ ఫలితాలు చూపాయి.

కేంద్ర పథకాల అమల్లో పురోగతి

8 రొనాల్డ్‌రాస్‌, ఆర్థిక శాఖ సెక్రటరీ

‘‘2025-26 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రాయోజిత పథకాల అమలులో గణనీయమైన పురోగతి నమోదైంది. స్పర్శ్‌, ఎన్‌ఎన్‌ఏ వ్యవస్థల పరిధిలో ఉన్న కేంద్ర పథకాల కోసం రూ. 12,621 కోట్ల వ్యయం జరిగింది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు అత్యధికంగా రూ. 6,333 కోట్లు కేటాయించగా, ఇందులో రూ. 2,825 కోట్లకు సూత్రప్రాయ ఆమోదం ఉంది. దీనిలో రూ. 2029 కోట్ల మేర వ్యయం జరిగింది. వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార శాఖలు రూ.489 కోట్లు, వైద్యఆరోగ్యశాఖ రూ.1174 కోట్లు, మహిళా శిశుసంక్షేమ శాఖ రూ.15 కోట్లు, పట్టణాభివృద్ధి శాఖ రూ.120 కోట్లు ఖర్చు చేశాయి. సాక్షం అంగన్‌వాడీ పోషణ 2.0 పథకానికి కేంద్రం రూ.1007 కోట్లు కేటాయించగా, ఇప్పటివరకు రూ. 31 కోట్లు ఖర్చు మాత్రమే జరిగింది. 2025-26లో మొత్తమ్మీద కేంద్ర పథకాల అమల్లో రూ. 12,621 కోట్ల వ్యయంతో, 45-55 శాతం సగటు వినియోగంతో ఉంది. సామాజిక సంక్షేమం, మైనారిటీ, అటవీ శాఖలు తమ పనితీరును మెరుగుపర్చాల్సిన అవసరం ఉంది’’

Updated Date - Jan 13 , 2026 | 04:52 AM