Share News

Polavaram Nallamala Sagar Project: నల్లమలసాగర్‌పై కేసును కొట్టేయండి

ABN , Publish Date - Jan 04 , 2026 | 03:55 AM

పోలవరం- నల్లమలసాగర్‌ అనుసంధానంపై తెలంగాణ అపరిపక్వతతో కేసు వేసిందని సుప్రీంకోర్టులో ఏపీ జల వనరుల శాఖ అఫిడవిట్‌ దాఖలు చేయనుంది.....

Polavaram Nallamala Sagar Project: నల్లమలసాగర్‌పై కేసును కొట్టేయండి

  • ఈ పథకంపై అపరిపక్వతతో కేసు వేసిన తెలంగాణ

  • సుప్రీంలో వాదనలు వినిపించడానికి సిద్ధమవుతున్న ఏపీ

  • రేపు అఫిడవిట్‌ దాఖలు చేయనున్న జల వనరుల శాఖ

అమరావతి, జనవరి 3(ఆంధ్రజ్యోతి): పోలవరం- నల్లమలసాగర్‌ అనుసంధానంపై తెలంగాణ అపరిపక్వతతో కేసు వేసిందని సుప్రీంకోర్టులో ఏపీ జల వనరుల శాఖ అఫిడవిట్‌ దాఖలు చేయనుంది. ఈ కేసుతో ఆ రాష్ట్రానికి గానీ, అక్కడి ప్రజలకు గానీ ఎలాంటి ప్రయోజనం లేదని, కేవలం రాజకీయ కారణాలతో కోర్టుల్లో కేసులు వేస్తోందని వాదనలు వినిపించడానికి సిద్ధమైంది. తరచూ ఇలాంటి వ్యాజ్యాలతో కోర్టు సమయాన్ని వృథా చేస్తోందని, ఈ కేసును కొట్టివేయాలని అభ్యర్థించాలని నిర్ణయించింది. పోలవరానికి కేంద్రం జాతీయహోదాను ప్రకటించిందని, సీడబ్ల్యూసీ ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టుపైనా తెలంగాణ నిరంతరం కేసులు వేస్తోందని వాదనలు వినిపించనుంది. సముద్రంలోకి వృథాగా పోతున్న 3వేల టీఎంసీల వరద జలాల్లో 200 టీఎంసీలు తరలిస్తున్నామని కోర్టు దృష్టికి తీసుకెళ్లనుంది. పోలవరం- బనకచర్ల, నల్లమలసాగర్‌ అనుసంధాన పథకాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన కేసు ఈ నెల 5న విచారణకు రానుంది. ఈ కేసును పరిగణనలోనికి తీసుకోవద్దంటూ అడ్వకేట్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రమోద్‌కుమార్‌ ద్వారా రాష్ట్ర జల వనరుల శాఖ ఇప్పటికే కేవియెట్‌ దాఖలు చేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు సెలవులు రావడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ కేసులో రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపించేందుకు ప్రముఖ సీనియర్‌ అడ్వకేట్‌ను జల వనరుల శాఖ ఎంపిక చేయనుంది. దీనిలో భాగంగా ఈ పథకంపై తెలంగాణ వ్యక్తం చేసిన 25 అభ్యంతరాలకు సమాధానాలు సిద్ధం చేసింది.

Updated Date - Jan 04 , 2026 | 03:55 AM