Share News

గ్రామాల్లో అభివృద్ధికి జోష్‌!

ABN , Publish Date - Jun 13 , 2026 | 04:15 AM

రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధికి 16వ ఆర్థిక సంఘం నిధులతో మరింత జోష్‌ రానుంది. 2026-27 నుంచి 2030-31 వరకూ ఐదేళ్ల కాలానికి ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.16,627 కోట్లను కేంద్రం కేటాయించింది.

గ్రామాల్లో అభివృద్ధికి జోష్‌!

  • గ్రామీణ స్థానిక సంస్థలకు 16,627 కోట్లు

  • 16వ ఆర్థిక సంఘం నిధులు కేటాయింపు

  • ఇందులో బేసిక్‌ గ్రాంట్లు 13,302 కోట్లు

  • పనితీరు ఆధారిత గ్రాంట్లు రూ.3,325 కోట్లు

  • గతంలో కంటే రూ.3,771 కోట్లు అదనం..

  • కేంద్ర ఆర్థిక శాఖ మార్గదర్శకాలు విడుదల

అమరావతి, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధికి 16వ ఆర్థిక సంఘం నిధులతో మరింత జోష్‌ రానుంది. 2026-27 నుంచి 2030-31 వరకూ ఐదేళ్ల కాలానికి ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.16,627 కోట్లను కేంద్రం కేటాయించింది. ఇందులో రూ.13,302 కోట్లు బేసిక్‌ గ్రాంట్లు, రూ.3,325 కోట్లు పనితీరు ఆధారిత గ్రాంట్లు ఉన్నాయి. మొదటి ఏడాది 2026-27లో బేసిక్‌ గ్రాంట్‌ కింద ఏపీకి రూ.2,136 కోట్లు లభించనున్నాయి. అనంతరం పనితీరు గ్రాంట్లు కూడా కలవడంతో కేటాయింపులు క్రమంగా పెరుగుతూ 2031 నాటికి రూ.4,338 కోట్లకు చేరనున్నాయి. 2027-28లో బేసిక్‌ గ్రాంట్‌ రూ.2,371 కోట్లు, పనితీరు గ్రాంట్‌ రూ.353 కోట్లు, 2028-29లో బేసిక్‌ గ్రాంట్‌ రూ.2,632 కోట్లు, పనితీరు గ్రాంట్‌ రూ.889 కోట్లు, 2029-30లో బేసిక్‌ గ్రాంట్‌ రూ.2,921 కోట్లు, పనితీరు గ్రాంట్‌ రూ.987 కోట్లు, 2030-31లో బేసిక్‌ గ్రాంట్‌ రూ.3,242 కోట్లు, పనితీరు గ్రాంట్‌ రూ.1,096 కోట్లు చొప్పున రాష్ట్రానికి కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతులు, తాగునీరు, పారిశుధ్యం, స్థానిక అభివృద్ధి పనులకు ఈ నిధులు వినియోగించాల్సి ఉంటుంది. వివిధ రాష్ట్రాలకు నిధుల కేటాయింపులపై కేంద్ర ఆర్థికశాఖ తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. కాగా, 16వ ఆర్థిక సంఘం సిఫారసులతో ఏపీ గ్రామీణ స్థానిక సంస్థలకు కేటాయింపులు స్పల్పంగా పెరిగాయి. 15వ ఆర్థిక సంఘంలో రాష్ట్రానికి రూ.12,856 కోట్లు కేటాయించారు. దీనితో పోలిస్తే ఈసారి రూ.3,771 కోట్లు అదనంగా విడుదల చేయనున్నారు. అయితే 2025-26లో కేటాయించిన రూ.2,099 కోట్లతో పోలిస్తే తొలి ఏడాదిలో రూ.37 కోట్లు మాత్రమే ఎక్కువ లభించనుంది.


8వ స్థానంలో ఏపీ

గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్రం కేటాయించిన నిధుల జాబితాలో దేశవ్యాప్తంగా తొలి పది రాష్ట్రాల్లో ఏపీ 8వ స్థానంలో నిలిచింది. యూపీ, బిహార్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర వంటి భారీ జనాభా ఉన్న రాష్ట్రాలు అగ్రస్థానాల్లో ఉండగా, దక్షిణాదిన ఏపీకి గణనీయమైన వాటా లభించింది. 16వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు గ్రాంట్ల వినియోగంపై కేంద్రం స్పష్టమైన నిబంధనలు విధించింది. గ్రామ పంచాయతీలకు 80 శాతం, మండల పరిషత్‌లకు 10 శాతం, జిల్లా పరిషత్‌లకు 10 శాతం చొప్పున నిధులు విభజిస్తారు. కేంద్ర నిధుల విడుదలకు అవసరమైన ఖాతాల నిర్వహణ, ఆడిట్‌, ఆన్‌లైన్‌ నివేదికలు, పనుల పర్యవేక్షణ వంటి అంశాలను తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీలకు కేంద్ర నిధుల విడుదలను మరింత క్రమబద్ధీకరించనున్నారు. పనుల అమల్లో ఆన్‌లైన్‌ మానిటరింగ్‌ పెంచనున్నారు. ఆడిట్‌ నివేదికలు సమర్పించని సంస్థల నిధులు నిలుపుదల చేసే అవకాశం ఉంది. కేంద్రం నిర్దేశించిన పనితీరు ప్రమాణాలను రాష్ట్రాలు, స్థానిక సంస్థలు తప్పనిసరిగా పాటించాలి. ఈ మార్గదర్శకాల అమలు, పర్యవేక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్రం స్పష్టం చేసింది. నిధుల వినియోగంపై క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని సూచించింది.

Updated Date - Jun 13 , 2026 | 04:16 AM