15లోపు ఓటర్ల జాబితా సిద్ధం చేయండి
ABN , Publish Date - Mar 26 , 2026 | 03:04 AM
గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితా ఏప్రిల్ 15లోపు ప్రచురించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వాన్ని కోరింది.
రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్‌ఈసీ ఆదేశం
అమరావతి, మార్చి 25(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితా ఏప్రిల్ 15లోపు ప్రచురించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వాన్ని కోరింది. మార్చి 18 నాటికి ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని గతంలో ఎస్‌ఈసీ ఆదేశించింది. అయితే సాఫ్ట్‌వేర్ సమస్యలున్నాయని, ప్రక్రియ పూర్తి చేసేందుకు 4 వారాల గడువు కావాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కోరింది. అందుకు ఎస్‌ఈసీ అంగీకరించలేదు. దీంతో కలెక్టర్ల నుంచి వాస్తవ సమాచారాన్ని సేకరించి ప్రభుత్వం సమర్పించింది. సంతృప్తి చెందిన ఎస్‌ఈసీ ఏప్రిల్ 15లోపు ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియను పూర్తి చేయాలని కోరింది.
పంచాయతీలకు ప్రత్యేకాధికారుల జాబితా సిద్దం
గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుండటంతో ప్రత్యేకాధికారులను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఇప్పటికే ప్రత్యేకాధికారులను నియమించే అధికారం కలెక్టర్లకు ఇవ్వడంతో మండల అధికారుల జాబితాను సిద్ధం చేస్తున్నారు.