Share News

‘సగం’ పెరగనున్న స్థాన బలం!

ABN , Publish Date - Apr 16 , 2026 | 04:25 AM

అసెంబ్లీ స్థానాలు మాత్రమే కాదు... లోక్‌సభ నియోజకవర్గాలూ 50 శాతం పెరగనున్నాయి. దీనిపై ఇప్పటిదాకా ఉన్న సందేహాలు, అస్పష్టతకు కేంద్ర వర్గాలు తెరదించాయి. బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జనసేన అధిపతి...

‘సగం’ పెరగనున్న స్థాన బలం!

  • అసెంబ్లీతోపాటు ఎంపీ స్థానాలూ 50 శాతం పెంపు

  • చంద్రబాబుకు స్పష్టం చేసిన కేంద్ర మంత్రులు!.. పవన్‌, మాధవ్‌లతో సుదీర్ఘ చర్చ

  • సందేహాలపై స్పష్టతకు నిర్ణయం.. నేడే పార్లమెంటులో మహిళా కోటా, డీలిమిటేషన్‌ బిల్లు

  • గట్టెక్కితే రాష్ట్రంలో 263కు పెరగనున్న అసెంబ్లీ సీట్లు.. 37 లేదా 38కి చేరనున్న లోక్‌సభ సీట్లు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

అసెంబ్లీ స్థానాలు మాత్రమే కాదు... లోక్‌సభ నియోజకవర్గాలూ 50 శాతం పెరగనున్నాయి. దీనిపై ఇప్పటిదాకా ఉన్న సందేహాలు, అస్పష్టతకు కేంద్ర వర్గాలు తెరదించాయి. బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జనసేన అధిపతి, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో సుమారు రెండున్నర గంటలపాటు సమావేశమయ్యారు. అసెంబ్లీ స్థానాలను గుండుగుత్తగా 50 శాతం పెంచుతారనే స్పష్టత ఉన్నప్పటికీ... లోక్‌సభ స్థానాల విషయంలో సందేహాలున్నాయని, 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటే మనకు నష్టం జరిగే అవకాశముందనే అంశంపై చర్చ జరిగింది. దక్షిణాది రాష్ట్రాల్లో నెలకొన్న ఆందోళనలూ ప్రస్తావనకు వచ్చాయి. దీంతో చంద్రబాబు... ‘శషభిషలు ఎందుకు!? ఇప్పుడే స్పష్టత తీసుకుందాం’ అని తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజుజు, కేంద్ర న్యాయ శాఖమంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌లతో ఫోన్‌లో మాట్లాడారు. లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచుతున్నట్లుగా బిల్లులో పొందుపరచకపోవడంతో నెలకొన్న సందిగ్ధత గురించి ప్రశ్నించారు. దీంతో... అన్ని వివరాలను బిల్లులో పొందుపరచలేమని, అన్ని రాష్ట్రాల్లో పార్లమెంటు సీట్లు 50 శాతం పెరుగుతాయని ఇద్దరు కేంద్ర మంత్రులు స్పష్టం చేసినట్లు తెలిసింది. సభలో చర్చ సందర్భంగా ఈ విషయాన్ని పార్లమెంటు వేదికగానే ప్రభుత్వం ప్రకటిస్తుందని పేర్కొన్నట్లు సమాచారం. అనంతరం కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, రామ్మోహన్‌ నాయుడుతో కూడా సీఎం ఫోన్‌లో మాట్లాడారు. కేంద్ర మంత్రుల నుంచి స్పష్టత తీసుకున్న అనంతరం నేతలు బిల్లుపై సంతృప్తి వ్యక్తం చేశారు. 50శాతం నియోజకవర్గాల పెంపుతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదని, దీనిని రాజకీయంగా కలిసి కట్టుగా స్వాగతించాలని ముగ్గురు నేతలు నిర్ణయించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా నేతలు చర్చించారు. జిల్లా, నియోజకవర్గాల స్థాయిలోనూ భారీ కార్యక్రమాలు చేపట్టి సోదరీమణులకు, ప్రధానికి ధన్యవాదాలు తెలపాలని నిర్ణయించారు.


అసెంబ్లీలో ధమాకా... సాధారణంగా నియోజక వర్గాలను జనాభా ప్రాతిపదికనే ఏర్పాటు చేస్తుంటారు. చివరిసారిగా... 1971 జనాభా లెక్కల ప్రకారం 1972లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఆ తర్వాత... నియోజకవర్గాల సంఖ్య పెరగలేదు. కానీ... కొన్ని పరిధులు, పేర్ల మార్పుతో 2009లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి ఏపీలో 2014 వరకు 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి 175 స్థానాలు, తెలంగాణకు 119 సీట్లు వెళ్లాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలను పెంచుతామని రాష్ట్ర విభజన చట్టంలోనే పేర్కొన్నారు. ఈ లెక్కన ఏపీలోని అసెంబ్లీ స్థానాల సంఖ్య 175 నుంచి 225కు పెరగాలి. ఇప్పుడు అసెంబ్లీ స్థానాలను గుండుగుత్తగా 50 శాతం పెంచనుండటంతో ఏపీలో నియోజకవర్గాలు 175 నుంచి ఒకేసారి 263కు చేరుకుంటాయి. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న 225 స్థానాలతో పోల్చితే ఇది చాలా ఎక్కువ. వెరసి... అసెంబ్లీలో ప్రజా ప్రతినిధుల సంఖ్య గణనీయంగా పెరగనుంది.


లోక్‌సభ స్థానాలు ఇలా... లోక్‌సభ స్థానాలకు జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటారనే వాదనలు వినిపించాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో రాష్ట్ర వాటా 4.08 శాతం. ఆ నిష్పత్తి ప్రకారం ఏపీకి వచ్చే లోక్‌సభ స్థానాలు 33 మాత్రమే. ఉత్తరాదితో పోల్చితే మనకు అన్యాయం జరుగుతుంది. అయితే... జనాభా ప్రాతిపదికన కాకుండా, గుండుగుత్తగా 50 శాతం సీట్లు పెంచాలన్న కేంద్ర నిర్ణయం ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ మేలు చేసేదే. దీని ప్రకారం... రాష్ట్రంలో లోక్‌సభ స్థానాల సంఖ్య ఇప్పుడున్న 25 నుంచి 37 లేదా 38కి చేరుతుంది. అయితే... గురువారం పార్లమెంటులో ఏం జరుగుతుంది? చట్టసభల్లో మహిళా కోటాకు మద్దతిచ్చి, డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తున్న విపక్షాలు ఏం చేస్తాయి? మహిళా కోటానూ డీలిమిటేషన్‌తో ముడిపెట్టి సభలో గట్టెక్కించాలన్న ఎన్డీయే సర్కారు వ్యూహం ఫలిస్తుందా? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు! దీనికి సమాధానం కోసం వేచి చూడాల్సిందే!

Updated Date - Apr 16 , 2026 | 04:27 AM