Share News

హాస్టళ్లకు ‘సౌర’ శక్తి!

ABN , Publish Date - Apr 07 , 2026 | 04:25 AM

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లను నెట్‌ జీరో అండ్‌ హెల్దీ క్యాంపస్‌(ఎన్‌జెడ్‌హెచ్‌సీ)లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.

హాస్టళ్లకు ‘సౌర’ శక్తి!

అమరావతి, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లను నెట్‌ జీరో అండ్‌ హెల్దీ క్యాంపస్‌(ఎన్‌జెడ్‌హెచ్‌సీ)లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు సోమవారం సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం ఆదేశాల మేరకు రెండేళ్లలో ఈ లక్ష్యాన్ని చేరు కోడానికి దశలవారీ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రస్తుతం ఉన్న పర్యావరణ వ్యవస్థలో సమూల మార్పు తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో సౌరశక్తి ప్యానెల్స్‌ ఏర్పాటుచేసి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌, వినియోగం సమానంగా ఉండేలా చూసుకుంటారు. ప్రతి క్యాంపస్‌లో మొక్కలు నాటి, కిచెన్‌ గార్డెన్లు, గ్రీన్‌ బౌండరీలు ఏర్పాటుచేసి జీవ వైవిధ్యాన్ని పెంపొందిస్తారు. పర్యావరణానికి అనుకూలంగా, ఆరోగ్యకర విద్యా వాతావరణాన్ని ఏర్పరచడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.

రెండు దశల్లో అమలు

మొదటి దశలో ఈ ఏడాది జూన్‌ నుంచి 2027 మే వరకు సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన 189, గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించిన 199, బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన 112 రెసిడెన్షియల్‌ విద్యాసంస్థలను నెట్‌ జీరో కాన్సెప్ట్‌లోకి తీసుకురానున్నారు. రెండో దశలో 2027 జూన్‌ నుంచి 2028 మే వరకు ప్రీమెట్రిక్‌, పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు, మైనారిటీ సంస్థలను ఈ కార్యక్రమంలో చేర్చనున్నారు.


విద్యుత్‌ వినియోగం సున్నా లక్ష్యం

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు, ప్రతి సంస్థలో సౌరశక్తి ప్యానెల్స్‌ ఏర్పాటుచేసి విద్యుత్‌ అవసరాలను తీరుస్తారు. ఉత్పత్తి అయ్యే విద్యుత్‌, వినియోగంతో సమానంగా ఉండేలా చూసుకుంటారు. ప్రతి క్యాంపస్‌లో ఒకటన్నర నుంచి రెండెకరాల వరకు మొక్కలు నాటతారు. కిచెన్‌ గార్డెన్లు, గ్రీన్‌ బౌండరీలు ఏర్పాటుచేసి జీవ వైవిధ్యాన్ని పెంపొందిస్తారు. వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలు ఏర్పాటుచేసి భూగర్భ జలాలను పునరుద్ధరిస్తారు. పర్యావరణపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు హయ్యర్‌ సెకండరీ స్థాయిలో ప్రత్యేక పాఠ్యాంశాన్ని ప్రవేశపెడతారు. రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులతో, జిల్లా స్థాయిలో కలెక్టర్‌ ఆధ్వ ర్యంలో కమిటీలు పనిచేస్తాయి.

Updated Date - Apr 07 , 2026 | 04:26 AM