తరగతికో కొత్త విద్యార్థి!
ABN , Publish Date - May 08 , 2026 | 05:25 AM
రాష్ట్రంలో 58,002 పాఠశాలలుండగా, వాటిలో 76.5 శాతం ప్రభుత్వ, 23.5శాతం ప్రైవేటు పాఠశాలలున్నాయి. 76.5శాతం ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 32.01 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే...
ప్రతి పాఠశాలలో 7 నుంచి 8 మంది పెరగాలి
ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల పెంపునకు లక్ష్యం
‘బడి పిలుస్తోంది’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం
రాష్ట్రవ్యాప్తంగా 3.2 లక్షల మంది పెరగాలి
2026-27 విద్యా సంవత్సరానికి ప్రణాళిక రెడీ
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో 58,002 పాఠశాలలుండగా, వాటిలో 76.5 శాతం ప్రభుత్వ, 23.5శాతం ప్రైవేటు పాఠశాలలున్నాయి. 76.5శాతం ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 32.01 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే... కేవలం 23.5 శాతంగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో ఏకంగా 37.29 లక్షల మంది చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువగా చేరడం లేదు. తక్కువ సంఖ్యలో ఉన్న ప్రైవేటు పాఠశాలలకే క్యూ కడుతున్నారు. ఈ ట్రెండ్‌ను మార్చాలని ప్రభుత్వం కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దశలవారీగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని నిర్ణయించిన ప్రభుత్వం అందులో భాగంగా తొలుత 2026-27 విద్యా సంవత్సరంలో 10శాతం విద్యార్థులను పెంచాలనే లక్ష్యం పెట్టుకుంది. ‘బడి పిలుస్తోంది’ అనే కార్యక్రమం చేపట్టి విద్యార్థుల సంఖ్యను పెంచుకుంటూ వెళ్లాలని, తద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
జిల్లాకు 10 వేలమంది పెరగాలి..
2025-26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 32,01,607 మంది విద్యార్థులు ఉన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో 3.2 లక్షల మందిని పెంచి ఆ సంఖ్యను 35.21 లక్షలకు చేర్చాలని పాఠశాల విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లాకు సగటున కనీసం 8 వేల నుంచి 10 వేల మందిని పెంచాలని సూచనలు చేసింది. అంటే ఒక్కో పాఠశాలలో 7 నుంచి 8 మంది పెరుగుతారని, ఆయా పాఠశాలల్లో ఒక్కో తరగతిలో ఒకరిని పెంచితే సరిపోతుందని స్పష్టంచేసింది. ప్రధానంగా పెద్దగా ప్రమాణాలు లేని ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులను ప్రభుత్వ బడులవైపు మళ్లించాలని భావిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యం కలిగిన టీచర్లు, ఉత్తమ మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ... సి కేటగిరీలో ఉండే ప్రైవేటు పాఠశాలలకు పిల్లల్ని ఎందుకు పంపుతున్నారనే దానిపై దృష్టి సారిస్తోంది. అంతిమంగా ప్రతి పాఠశాలలో ప్రతి తరగతికి ఒక టీచర్‌ను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.
మోడల్ ప్రైమరీ స్కూళ్లలోనూ పెంచాలి
గతేడాది నుంచి కొత్తగా ప్రారంభించిన మోడల్ ప్రైమరీ స్కూళ్లలోనూ విద్యార్థుల సంఖ్య పెంచాలని పాఠశాల విద్యాశాఖ నిర్దేశించింది. ప్రతి పాఠశాలలో కనీసం 60 మంది విద్యార్థులుండేలా చర్యలు చేపట్టనుంది. రాష్ట్రంలో 9620 మోడల్ ప్రైమరీ స్కూళ్లు ఉండగా, వాటిలో 7,56,193 మంది విద్యార్థులున్నారు. సగటున ఒక్కో పాఠశాలలో 79 మంది విద్యార్థులున్నారు. 60 కంటే తక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలు 3087 ఉన్నాయి. ఆ పాఠశాలల్లో గతేడాది నుంచి తరగతికి ఒక టీచర్‌ను ఇచ్చారు. ఇక నుంచి 60 మంది విద్యార్థులు దాటితే బేసిక్ ప్రైమరీ పాఠశాలలను కూడా మోడల్ ప్రైమరీ పాఠశాలలుగా మార్చి తరగతికి ఒక టీచర్‌ను ఇస్తారు. తిరుపతి, చిత్తూరు, కాకినాడ, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, పశ్చిమగోదావరి, నెల్లూరు, పల్నాడు జిల్లాల్లో 60లోపు విద్యార్థులున్న మోడల్ ప్రైమరీ పాఠశాలలు ఎక్కువగా ఉన్నాయి.
కలెక్టర్లకు సూచనలు ఇవీ..
ఈ అంశంపై కలెక్టర్లు, పాఠశాల విద్యాశాఖ అధికారులకు విద్యాశాఖ పలు సూచనలు చేసింది.
డ్రాపౌట్లు సున్నాకు చేరాలి. ముఖ్యంగా 5 నుంచి 6.. 8 నుంచి 9 తరగతులకు ప్రమోటయ్యేవారి స్కూల్ మార్పిడి సక్రమంగా జరగాలి.
ఆయా ప్రాంతాల్లోని బడి ఈడు పిల్లల్ని వంద శాతం గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలి.
విద్యార్థుల చేరికలపై స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలు, ప్రజాప్రతినిధులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
పాఠశాలల్లోని డ్రాప్ బాక్స్ డేటా ఆధారంగా ఆయా పాఠశాలల పరిధిలో డ్రాపౌట్లపై దృష్టి పెట్టాలి.
బాగా వెనకబడిన కుటుంబాల పిల్లలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పిల్లలను గుర్తించి తప్పనిసరిగా బడుల్లో చేర్పించాలి.
విద్యార్థుల నమోదుపై 30 రోజుల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి.