Share News

స్కూళ్లు ఉన్నాయ్‌.. పిల్లలే లేరు!

ABN , Publish Date - Jul 22 , 2026 | 05:07 AM

రాష్ట్రంలో అతి తక్కువమంది విద్యార్థులతో నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలల సంఖ్య పెరుగుతోంది. 2025-26 విద్యా సంవత్సరం గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 996 పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 40లోపే ఉంది.

స్కూళ్లు ఉన్నాయ్‌.. పిల్లలే లేరు!

  • 16 స్కూళ్లలో ఒకే ఒక్క విద్యార్థి

  • 10 మందితో నడుస్తున్నవి 171

  • 996 పాఠశాలల్లో 40 మందిలోపే

  • నిబంధనలకు విరుద్ధం: విద్యాశాఖ

  • రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలకు ఆదేశం

అమరావతి, జూలై 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అతి తక్కువమంది విద్యార్థులతో నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలల సంఖ్య పెరుగుతోంది. 2025-26 విద్యా సంవత్సరం గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 996 పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 40లోపే ఉంది. వాటిలో కేవలం ఒకే ఒక్క విద్యార్థి ఉన్న పాఠశాలలు 16 ఉన్నాయి. 1 నుంచి 10 మంది విద్యార్థులున్న పాఠశాలలు 171, 11 నుంచి 20 మంది ఉన్న పాఠశాలలు 237, 21 నుంచి 30 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలు 297, 31 నుంచి 39 మంది ఉన్న పాఠశాలలు 291 ఉన్నాయి. మరీ ఇంత తక్కువ మంది విద్యార్థులతో పాఠశాలలు నడపడంపై విద్యాశాఖ దృష్టి సారించింది. 40 మంది కంటే తక్కువ మంది విద్యార్థులతో పాఠశాలలు కొనసాగడం జీవో 1 నిబంధనలకు విరుద్ధమని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆయా పాఠశాలలను తనిఖీ చేసి, విద్యార్థుల సంఖ్యను పరిశీలించి, వాటిపై నివేదికలు ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 2025-26 విద్యా సంవత్సరం యూడైస్‌ గణాంకాలను కేంద్ర విద్యాశాఖ ఇటీవల విడుదల చేసింది. రాష్ట్రంలో 60,843 పాఠశాలలు ఉంటే వాటిలో 84.37 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. 3.53 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. 12.9 శాతం పాఠశాలలు 10 మంది కంటే తక్కువ విద్యార్థులతో నడుస్తున్నాయి. 500 మంది కంటే ఎక్కువ విద్యార్థులున్న పాఠశాలలు 6.2 శాతం ఉన్నాయి. రాష్ట్రంలో 58,780 పాఠశాలల్లో క్రీడా మైదానాలున్నాయి. 7,364 పాఠశాలల్లో డిజిటల్‌ లైబ్రరీ సౌకర్యం ఉంది.


ఇక, 44,222 ప్రభుత్వ యాజమాన్య, 797 ఎయిడెడ్‌, 15,710 ప్రైవేటు పాఠశాలలున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 2.01 లక్షలు, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 3537, ప్రైవేటు పాఠశాలల్లో 1,48,720 మంది టీచర్లు పనిచేస్తున్నారు. టీచర్లు, విద్యార్థుల మధ్య నిష్పత్తి ఫౌండేషనల్‌ స్థాయిలో 1:11, ప్రిపరేటరీ స్థాయిలో 1:12, మిడిల్‌ స్థాయిలో 1:16, సెకెండరీ స్థాయిలో 1:15గా ఉంది. మొత్తం.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారు 34.93 లక్షలు, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 95,710, ప్రైవేటు పాఠశాలల్లో 48.4 లక్షల మంది ఉన్నారు. దాదాపు 45 వేల ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో సుమారు 36 లక్షల మంది చదువుతుంటే, కేవలం 15,710 ప్రైవేటు పాఠశాలల్లో 48.4 లక్షల మంది చదువుతుండటం గమనార్హం.

Updated Date - Jul 22 , 2026 | 05:08 AM