ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యం: లోకేశ్
ABN , Publish Date - Jul 21 , 2026 | 06:37 AM
సమాజ మార్పునకు, రాష్ట్రాభివృద్ధికి విద్యే ప్రధానమని ఐటీ, విద్యా శాఖల మంత్రి లోకేశ్ అన్నారు. రాష్ట్రంలోని విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందించేందుకు కృషి చేస్తున్నామని..
మంగళగిరి నియోజకవర్గ ‘తల్లికి వందనం’ లబ్ధిదారులతో మంత్రి ముఖాముఖి
రేపటి నుంచి తల్లుల ఖాతాల్లో నిధులు జమ
మంగళగిరి సిటీ, జూలై 20(ఆంధ్రజ్యోతి): సమాజ మార్పునకు, రాష్ట్రాభివృద్ధికి విద్యే ప్రధానమని ఐటీ, విద్యా శాఖల మంత్రి లోకేశ్ అన్నారు. రాష్ట్రంలోని విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందించేందుకు కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో లీప్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గానికి చెందిన పలువురు ‘తల్లికి వందనం’ పథకం లబ్ధిదారులతో ఆయన సోమవారం మంగళగిరి బైపా్‌సలోని కొండపనేని టౌన్‌షి్‌ప పార్కులో ముఖాముఖి నిర్వహించారు. వారితో పాటు కిందే కూర్చొని మాట్లాడారు. తల్లికి వందనం అందుతున్న తీరు, ప్రభుత్వ ఆర్థిక సాయం ఏవిధంగా ఉపయోగపడుతుందనే విషయాలపై మంత్రి ఆరా తీశారు. విద్యార్థుల తల్లుల నుంచి పలు సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పనిచేస్తుందన్నారు. ప్రజా ప్రభుత్వంలో 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, ఈ ఏడాది మరో 3 వేల పోస్టులను భర్తీ చేస్తామని లోకేశ్ తెలిపారు. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి లక్షా 6 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు తరలివచ్చారని వివరించారు. తల్లికి వందనం పథకాన్ని ఈ నెలలో అమలు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ నెల 22 నుంచి 24వ తేదీలోగా నిధులు తల్లుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. మంగళగిరిని అన్ని రంగాల్లోనూ ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. కాగా, ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులను విద్యాశాఖ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సత్కరించి, పతకాలు ప్రదానం చేసింది. మండలాల వారీగా ‘షైనింగ్ స్టార్స్’ అవార్డులకు టెన్త్‌లో 4,344 మంది, ఇంటర్ విద్యార్థులు 978 మంది ఎంపికయ్యారు.