Share News

28 రోజులు నో బ్యాగ్‌ డే

ABN , Publish Date - Jun 23 , 2026 | 04:23 AM

పాఠశాల విద్యాశాఖ ఎట్టకేలకు 2026-27 విద్యా సంవత్సరానికిగాను అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల చేసింది.

28 రోజులు నో బ్యాగ్‌ డే

  • ఆ రోజు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వృత్తి విద్య, క్విజ్‌లకు ప్రాధాన్యం

  • పని దినాలు 229.. సెలవులు 87

  • అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల

  • మార్చి 15 నుంచి టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు

అమరావతి, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్యాశాఖ ఎట్టకేలకు 2026-27 విద్యా సంవత్సరానికిగాను అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల చేసింది. ‘అకడమిక్‌ క్యాలెండర్‌ ఏదీ?’ శీర్షికతో సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంతో అధికార యంత్రాంగం స్పందించింది. సోమవారం ఉదయమే క్యాలెండర్‌ను విడుదల చేస్తూ క్షేత్రస్థాయికి సమాచారం ఇచ్చింది. విద్యా సంవత్సరంలో మొత్తం 229 రోజులు పాఠశాలలు పనిచేస్తాయని, 87 సెలవులు ఉంటాయని ఈ క్యాలెండరులో ప్రకటించారు. ప్రతి శనివారం 6 నుంచి 9 తరగతులకు ‘నో బ్యాగ్‌ డే’ ఉంటుంది. ఏడాదిలో మొత్తం 28 నో బ్యాగ్‌ డేలు ఉంటాయి. ఈ రోజుల్లో కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇండోర్‌ గేమ్స్‌, విలువల విద్య, వృత్తి విద్య, పాఠశాల స్థాయిలో హిందీ దివస్‌ పోటీలు, గణిత పజిల్స్‌, క్విజ్‌, క్లస్టర్‌ కాంప్లెక్స్‌ సమావేశాలు ఉంటాయి. అక్టోబరు 12 నుంచి 21 వరకు దసరా సెలవులు, జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. మైనారిటీ పాఠశాలలకు క్రిస్మస్‌ సెలవులు అదనంగా ఇస్తారు.


ఉన్నత పాఠశాలలు..

ఆగస్టు 3 నుంచి 7 వరకు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌-1, అక్టోబరు 5 నుంచి 8 వరకు ఎఫ్‌ఏ-2, నవంబరు 9 నుంచి 20 వరకు సమ్మేటివ్‌ అసె్‌సమెంట్‌-1, జనవరి 4 నుంచి 7 వరకు ఎఫ్‌ఏ-3, ఫిబ్రవరి 8 నుంచి 11 వరకు ఎఫ్‌ఏ-4, ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు ఎస్‌ఏ-2, ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు పదో తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్‌, మార్చి 15 నుంచి 31 వరకు పబ్లిక్‌ పరీక్షలు జరుగుతాయి. జూలై 10, డిసెంబరు 5న మెగా పేరెంట్‌-టీచర్‌ మీటింగ్స్‌ నిర్వహిస్తారు. గతేడాది తరహాలోనే రాజ్యాంగ దినోత్సవం రోజున మాక్‌ పార్లమెంటు నిర్వహిస్తారు. తొమ్మిది నుంచి పదో తరగతికి వచ్చిన విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు ఉంటుంది. వేసవి సెలవులకు ముందు ఈ కోర్సు బోధిస్తారు.

ప్రాథమిక పాఠశాలలు

పని దినాలు, సెలవులు, పండగ సెలవులు ఉన్నత పాఠశాలల తరహాలోనే ప్రాథమిక పాఠశాలలకు కూడా ఉంటాయి. ఆగస్టు 3 నుంచి 6 వరకు ఎఫ్‌ఏ-1, అక్టోబరు 5 నుంచి 7 వరకు ఎఫ్‌ఏ-2, నవంబరు 9 నుంచి 16 వరకు ఎస్‌ఏ-1, జనవరి 4 నుంచి 6 వరకు ఎఫ్‌ఏ-3, ఫిబ్రవరి 8 నుంచి 10 వరకు ఎఫ్‌ఏ-4, ఏప్రిల్‌ 8 నుంచి 13 వరకు ఎస్‌ఏ-2 పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు పాఠశాలలు పని చేస్తాయి. 28 రోజులు నో బ్యాగ్‌ డేగా ఉంటాయి.

Updated Date - Jun 23 , 2026 | 04:26 AM