పోలీసింగ్ మూడో నేత్రంగా ఆర్టీజీఎస్!
ABN , Publish Date - May 03 , 2026 | 04:24 AM
రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడంలో.. నేరాలను అదుపు చేయడంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే, తాజాగా నేరస్తులను గుర్తించడంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ(ఆర్‌టీజీఎస్) ప్రధాన భూమిక పోషిస్తోందని అధికారులు తెలిపారు.
అదృశ్య కేసుల్లో ఫొటోల ఆధారంగా గుర్తింపు
నేరాల కట్టడికీ తోడ్పాటు
పోలీసుల పనిని సులభతరం చేస్తున్న సేవలు
అమరావతి, మే 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడంలో.. నేరాలను అదుపు చేయడంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే, తాజాగా నేరస్తులను గుర్తించడంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ(ఆర్‌టీజీఎస్) ప్రధాన భూమిక పోషిస్తోందని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పోలీసింగ్‌కు మూడో నేత్రంగా పనిచేస్తున్నాయని ఆర్టీజీఎస్ అధికారులు పేర్కొన్నారు. నేరాలను పసిగడుతూ.. నేరస్తులను గుర్తించేందుకు 360 డిగ్రీలతో పనిచేసే సీసీ కెమెరా వ్యవస్థ ఉపయోగపడుతోందని తెలిపారు. దీనికి కొన్ని ఉదాహరణలను పేర్కొన్నారు. కర్నూలు జిల్లా నందవరం పోలీసు స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 22న 17 సంవత్సరాల బాలిక అదృశ్యమైందని పోలీసులకు ఫిర్యాదు అందింది. బాలిక ఆచూకీ కోసం పోలీసులు ఆర్టీజీఎస్ సహకారం తీసుకున్నారు. ఆమె ఫోటోను ఆర్టీజీఎస్ సీసీ టీవీ 360 అప్లికేషన్‌లో అప్‌లోడ్ చేసి టైమ్ సెన్సిటివ్ అప్రోచ్ ద్వారా డిజిటల్‌గా గాలింపు చేపట్టారు. అదృశ్యమైన బాలిక విజయవాడకు వచ్చి నగరంలోని ఒక ప్రధాన కూడలిలో తచ్చాడుతున్నట్లు ఆర్టీజీఎస్ రియల్ టైమ్ అలర్ట్ గుర్తించింది. ఈ సమాచారంతో విజయవాడ పోలీసులు బాలికను గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
నంద్యాలలో అదృశ్యమైన బాలిక ఒంగోలులో
నంద్యాల జిల్లా గడివేముల పోలీసు స్టేషన్ పరిధిలో గత నెల 25న 16 ఏళ్ల బాలిక అదృశ్యమైనట్లు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె వెళ్లిన వాహనం నంబరు ఆధారంగా ఆచూకీ కనిపెట్టడానికి పోలీసులు ఆర్టీజీఎస్ సహకారం కోరారు. ఆ బాలిక ఫొటో.. ఆమె వెళ్లిన వాహనం నంబరును ఆర్టీజీఎస్ 360 అప్లికేషన్‌లో అప్‌లోడ్ చేశారు. ఆమె ఏప్రిల్ 29న ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఓ ప్రధాన కూడలిలో ఉన్నట్లు సీసీ టీవీ ద్వారా గుర్తించారు.
యువతి ఆచూకీ చిటికెలో
చిత్తూరు జిల్లా రొంపిచర్లలో గత నెల 24న 22 ఏళ్ల యువతి అదృశ్యమైనట్టు అక్కడి పోలీసులకు యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తమ గ్రామానికి చెందిన ఓ యువకుడు ఈ ఘటనకు పాల్పడి ఉంటాడని ఆరోపించారు. దీంతో ఈ కేసును ఛేదించేందుకు పోలీసు ఆర్టీజీఎ్‌సని ఆశ్రయించారు. ఈ యువకుడి వాహనం నెంబరు, యువతి ఫొటోలను ఆర్టీజీఎస్ సీసీ కెమెరా 360 అప్లికేషన్‌లో అప్‌లోడ్ చేసి పర్సస్ ఆఫ్ ఇంట్ర్‌స్ట(పీవోఐ), అటోమెటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా గాలించారు. వారు వెళ్లిన వాహనం గత నెల 28వ తేదీ దాకా తిరుపతిలోని పలు ప్రాంతాల్లో తిరిగినట్లుగా ఆర్టీజీఎస్ అధికారులు గుర్తించారు. యువతీ యువకుడు చిత్తూరు వెళ్తున్నారని గుర్తించి ఆ సమాచారం పోలీసులకు అందించారు. యువతిని చిత్తూరు పోలీసులు పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు.