ఆర్టీసీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు
ABN , Publish Date - Aug 10 , 2026 | 04:19 AM
ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ కోసం ఆర్టీసీ జేఏసీ చేపట్టబోయే ఉద్యమాలకు, భవిష్యత్తు కార్యక్రమాలకు..
ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్
విజయవాడ(బస్‌స్టేషన్), ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ కోసం ఆర్టీసీ జేఏసీ చేపట్టబోయే ఉద్యమాలకు, భవిష్యత్తు కార్యక్రమాలకు ఏపీఎన్జీజీవో సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జేఏసీ చైర్మన్ కె.విద్యాసాగర్ తెలిపారు. తాము చేపడుతున్న మూడో దశ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ ఆదివారం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్లు వై.శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదర్‌రావు, ఇతర నాయకులు విద్యాసాగర్‌ను ఆయన కార్యాలయంలో కలిశారు. అనంతరం విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడాన్ని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు స్వాగతిస్తున్నాయని, ఈ బస్సులన్నింటినీ ప్రభుత్వం కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బందితో నిర్వహించి, ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి.. ప్రైవేటీకరణ కావటం లేదన్న భరోసాను కల్పించాలని కోరారు. కాగా, ఆర్టీసీ జేఏసీ ఉద్యమానికి విద్యార్థి, యువజన సంఘాలు సంపూర్ణ మద్దతు ఇవ్వనున్నట్టు ఏఐఎ్‌సఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.వలరాజు, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.యుగంధర్ తెలిపారు.