ఫ్లెక్సీ ఫేర్ తేలేరా?
ABN , Publish Date - Aug 24 , 2026 | 03:42 AM
హై-ఎండ్ శ్రేణి ఆర్టీసీ బస్సులలో ఆక్యుపెన్సీ తగ్గిపోవడం సంస్థ ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఆషాఢ మాసంలో ప్రయాణాలు తగ్గుతాయి కాబట్టి.. ఆక్యుపెన్సీ స్వల్పంగా తగ్గడం సహజమే.
ఆర్టీసీ ఏసీ బస్సుల్లో తగ్గుతున్న ఓఆర్
సాధారణ రోజుల్లో టికెట్ ధర ఎక్కువ
రద్దీ సమయాల్లో సౌకర్యాల లేమితో ఆదరణ కరువు
ప్రైవేటు బస్సుల్లో ఫ్లెక్సీ ఫేర్ విధానం
హంగులు, సౌకర్యాలతో ఆకర్షణ
రెండు సీజన్లలోనూ ప్రైవేటుకు లాభం
అన్ సీజన్‌లో ఆర్టీసీ నష్టాల బాట
బెజవాడ వంటి నగరాల్లో ప్రయోగాత్మకంగా ఫ్లెక్సీ ఫేర్ అమలుకు ప్రతిపాదనలు
(ఆంధ్రజ్యోతి-విజయవాడ)
హై-ఎండ్ శ్రేణి ఆర్టీసీ బస్సులలో ఆక్యుపెన్సీ తగ్గిపోవడం సంస్థ ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఆషాఢ మాసంలో ప్రయాణాలు తగ్గుతాయి కాబట్టి.. ఆక్యుపెన్సీ స్వల్పంగా తగ్గడం సహజమే. కానీ మిగిలిన రోజుల్లోనూ ఏసీ బస్సులలో 70 శాతం మించి ఆక్యుపెన్సీ పెరగకపోవడం ఆందోళన కలిగించే అంశం. అదే ప్రైవేటు ట్రావెల్స్‌లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ప్రైవేటు బస్సులలో ఫ్లెక్సీ ఫేర్ విధానం అమలు చేయడమే ఇందుకు కారణం. ఫ్లెక్సీ ఫేర్ అంటే.. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి బస్సు చార్జీలు మారుతుంటాయి. డిమాండ్ ఉన్న రోజులలో నిర్దేశించిన గరిష్ఠ రేటు ఉంటుంది. అదే అన్ సీజన్‌లో తక్కువ చార్జీ ఉంటుంది. దీంతో ఆర్టీసీతో పోలిస్తే ప్రైవేటు బస్సులు ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. ప్రైవేటు బస్సులతో పోల్చుకుంటే ఆర్టీసీ బస్సుల్లో ధరలు ఎక్కువగా ఉండటం, బస్సులు పాతపడిపోవడం కూడా ఆర్టీసీ నడ్డి విరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్యుపెన్సీని పెంచుకోవటానికి ఆర్టీసీలోనూ ఫ్లెక్సీ ఫేర్ విధానాన్ని అమలు చేయాలన్న ప్రతిపాదనలు వస్తున్నాయి. ఆర్టీసీ అధికారులు కూడా దీనిపై అంతర్గతంగా ఆలోచనలు చేస్తున్నారు. అయితే హెడ్డాఫీసు స్థాయిలో ఉన్నతాధికారులు దీనిపై నిర్ణయం తీసుకుంటే కానీ అమలు చేయటానికి ఆస్కారం లేదు. ప్రయోగాత్మకంగా విజయవాడ వంటి నగరాల్లో అయినా అమలు చేసి చూస్తే ప్రయోజనం ఏంటన్నది తెలుస్తుంది.
ఫ్లెక్సీ ఫేర్ అమలు సాధ్యమేనా?
పండగల సీజన్‌లో ప్రైవేటు బస్సులు వసూలు చేసే ధరలు చూస్తే కళ్లు తిరిగిపోతా యి. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు రూ.2 వేలు, చెన్నైకు రూ.2500, బెంగళూరుకు రూ.4 వేల వరకూ ఉంటోంది. అదే సమయంలో ఆర్టీసీ బస్సులలో చార్జీలు ఎప్పుడూ నిలకడగా ఉంటాయి. పండగ రోజులలో కూడా అవే ధరలు ఉంటాయి. ఈ ఫ్లెక్సీ ఫేర్ వల్ల అన్ సీజన్, సీజన్.. రెండు సందర్భాలలోనూ ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు లబ్ధిపొందుతుంటే.. ఆర్టీసీ మాత్రం పండగ సీజన్‌లో తప్ప అన్ సీజన్, సాధారణ రోజుల్లో ఆదాయాన్ని గణనీయంగా కోల్పోతోంది. ఆర్టీసీ అనేది పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్. ప్రయాణికులపై భారం లేకుండా చార్జీలను వసూలు చేస్తుంది. అన్ సీజన్‌లో టికెట్ ధరలు కాస్త తగ్గించి, సీజన్‌లో ప్రైవేటు బస్సుల తరహాలో కాకుండా గరిష్ఠ ధరను అన్ని వర్గాలకు అందుబాటులోకి తెస్తే ఆర్టీసీకి మేలు జరిగే అవకాశముంది. ఫ్లెక్సీ ఫేర్‌తో పాటు ఆర్టీసీ తన హై-ఎండ్ ఆర్టీసీ బస్సులను అప్‌గ్రేడ్ చేసుకుంటే ప్రయాణికుల ఆదరణ పెరుగుతుంది. తద్వారా అన్ని సీజన్లలోనూ ప్రజా రవాణా సంస్థ మెరుగైన ఆదాయం పొందవచ్చు.
ఆర్టీసీకి, ప్రైవేటుకు తేడా ఇదీ
విజయవాడ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ ఏసీ శ్రేణి బస్సులు ప్రయాణికుల ఆదరణను చూరగొనలేకపోతున్నాయి. ఏసీ బస్సులలో 80-90 శాతం ఆక్యుపెన్సీ రాకపోతే ఆర్టీసీ సొంతంగా కొత్త బస్సులు కొనుగోలు చేయాలన్నా, మెరుగైన సేవలు అందించాలన్నా కష్టం. కాబట్టి ప్రయాణికుల ఆదరణను పెంచుకునే దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు(నాన్ ఏసీ) టికెట్ ధర రూ.524 నుంచి రూ.550 వరకు నిలకడగా ఉండగా.. ప్రైవేటు బస్సులలో ప్రస్తుత అన్‌సీజన్‌లో ఏసీ హై-ఎండ్ బస్సులలోనే రూ.450 వసూలు చేస్తున్నారు. అంటే.. ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు టికెట్ ధర కంటే ప్రైవేటు ఏసీ బస్సులో టికెట్ ధర తక్కువ. తక్కువ చార్జీతో ఏసీ బస్సులో ప్రయాణించే అవకాశముంటే ప్రయాణికులు సాధారణంగా ప్రైవేటు బస్సులనే ఆదరిస్తారు. ఇదే ఇప్పుడు జరుగుతోంది. అందుకే ప్రైవేటు బస్సులలో ఓఆర్ ఎక్కువగా ఉంటోంది.