రహదారులకు 6 వేల కోట్లు
ABN , Publish Date - Feb 15 , 2026 | 05:18 AM
బడ్జెట్‌లో రహదారి ప్రాజెక్టులకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రాజెక్టులతో పాటు కొత్తగా రహదారుల విస్తరణ, అభివృద్ధికి రూ.6 వేల కోట్ల మేర నిధులను ప్రతిపాదించింది.
కొత్తగా రోడ్ల విస్తరణ, అభివృద్ధికి నిధులు
పలు ప్రాజెక్టులకు బడ్జెట్‌లో ప్రతిపాదనలు
అమరావతి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): బడ్జెట్‌లో రహదారి ప్రాజెక్టులకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రాజెక్టులతో పాటు కొత్తగా రహదారుల విస్తరణ, అభివృద్ధికి రూ.6 వేల కోట్ల మేర నిధులను ప్రతిపాదించింది. రైల్వే వర్క్‌లు, ఆర్‌వోబీలకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.100 కోట్లు, రైల్వే భద్రత, రహదారి భద్రత పనుల కోసం రూ.45 కోట్లు, జిల్లా రహదారుల అభివృద్ధి, విస్తరణ కోసం రూ.281 కోట్లు ప్రతిపాదించింది. జిల్లా ప్రధాన రహదారుల అభివృద్ధి కోసం మరో రూ.255 కోట్లు కేటాయించారు. కోర్ నెట్‌వర్క్ స్కీమ్ కింద చేపట్టే ప్రాజెక్టులకు రూ.250 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రహదారి అభివృద్ధి సంస్థ (ఏపీఆర్‌డీసీ) ద్వారా చేపట్టే ప్రాజెక్టులకు రూ.130 కోట్లు, ఆర్‌ఐడీఎఫ్ ప్రాజెక్టులకు రూ.200 కోట్లు, న్యూ డెవల్‌పమెంట్ బ్యాంకు రుణంతో అమలు చేస్తోన్న రెండు కీలక ప్రాజెక్టులు, బ్రిడ్జీల పునర్‌నిర్మాణం కోసం రూ.580 కోట్ల నిధులను బడ్జెట్ పద్దుల్లో ప్రతిపాదించారు. సీఆర్‌ఎఫ్ కింద రూ.400 కోట్లు, సేతబంధన్ ప్రాజెక్టు వర్క్‌లకు రూ.81 కోట్లు, సీఐఆర్‌ఎఫ్ రహదారి పనులకు రూ.400 కోట్లు ప్రతిపాదించారు. వివిధ పథకాల కింద కేంద్రమే రూ.2,600 కోట్ల నిధులు ఇచ్చేలా బడ్జెట్‌లో ప్రతిపాదించారు.