Share News

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి సజీవ దహనం

ABN , Publish Date - May 03 , 2026 | 05:04 AM

అనంతపురం జిల్లా కూడేరు మండలం అరవకూరు గ్రామ సమీపంలో శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు సజీవ దహనమయ్యారు.

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి సజీవ దహనం

కూడేరు/హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌, మే 2 (ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా కూడేరు మండలం అరవకూరు గ్రామ సమీపంలో శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు సజీవ దహనమయ్యారు. అనంతపురం-బళ్లారి రహదారిపై ఎదురుగా వస్తున్న బొలెరోను ఓ బైకు వేగంగా ఢీకొట్టింది. బైకు పెట్రోల్‌ ట్యాంకు పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో వజ్రకరూరు మండలం పందికుండ గ్రామానికి చెందిన అజిత్‌(18), ఆకాశ్‌(20) సజీవ దహనమయ్యారు. అనంతపురంలో జరిగే వివాహంలో పాల్గొనేందుకు వారిద్దరూ బైక్‌పై బయల్దేరారు. అరవకూరు వద్ద ఉరవకొండ వైపు వెళుతున్న బొలెరోను ఢీకొట్టారు. మంటల్లో యువకులు గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడం, సెల్‌ఫోన్‌ బొగ్గుగా మారిపోవడంతో బైక్‌ నంబరు ఆధారంగా మృతులను గుర్తించి, కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. బైకును ఢీకొట్టిన అనంతరం బొలెరో నియంత్రణ కోల్పోయి ఓ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో కొందరు గాయపడ్డారు. కాగా, జాతీయ రహదారిపై ఆగి ఉన్న టిప్పర్‌ లారీని వెనుక వస్తున్న కంటైనర్‌ ఢీకొన్న ఘటనలో అగ్ని ప్రమాదం సంభవించి కంటైనర్‌ డ్రైవర్‌ ఆగ్నికి ఆహుతైన ఘటన కృష్ణా జిల్లా వీరవల్లి బైపాస్‌ వద్ద శనివారం తెల్లవారుఝామున జరిగింది. దొనకొండ నుంచి కంకర లోడుతో ఏలూరు వైపు వస్తున్న టిప్పర్‌ను ఆదే రహదారిపై సూళ్లూరుపేట నుంచి వస్తున్న ఖాళీ కంటైనర్‌ వెనుక నుంచి ఢీకొట్టింది.

Updated Date - May 03 , 2026 | 05:05 AM