ట్రిపుల్ ఐటీల్లో ప్రభుత్వ స్కూళ్ల సత్తా!
ABN , Publish Date - Jun 14 , 2026 | 05:05 AM
రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ సాంకేతిక విజ్ఞాన విశ్వవిద్యాలయం(ఆర్‌జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐఐటీలలో ప్రవేశాలకు సంబంధించిన మెరిట్ లిస్టును విద్యాశాఖ మంత్రి లోకేశ్ శనివారం విడుదల చేశారు..
మెరిట్ లిస్టులో 96.7శాతం మంది ఈ విద్యార్థులే
70.6 శాతం మందితో సత్తా చాటిన బాలికలు
ఆర్జీయూకేటీ మెరిట్ లిస్టు విడుదల చేసిన లోకేశ్
19 నుంచి 24 వరకు కౌన్సెలింగ్.. 1 నుంచి క్లాసులు
అమరావతి/నూజివీడు టౌన్/వేంపల్లె, జూన్ 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ సాంకేతిక విజ్ఞాన విశ్వవిద్యాలయం(ఆర్‌జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐఐటీలలో ప్రవేశాలకు సంబంధించిన మెరిట్ లిస్టును విద్యాశాఖ మంత్రి లోకేశ్ శనివారం విడుదల చేశారు.. పదో తరగతిలో లభించిన మార్కుల ఆధారంగా ఈ మెరిట్ లిస్టును రూపొందించి 4 ట్రిపుల్ ఐటీలలో విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. తాజాగా విడుదల చేసిన మెరిట్ లిస్ట్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 96.7 శాతం మంది సీట్లు సంపాయించి రికార్డు సృష్టించారు. ఇక, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు కేవలం 3.3 శాతం మంది మాత్రమే జాబితాలో చోటు సంపాయించుకున్నారు. నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళంలోని ట్రిపుల్ ఐటీలలో 4,400 బీటెక్(ఆరేళ్ల కోర్సు) సీట్లు ఉన్నాయి. వీటిలో 4,040 సీట్లకు సంబంధించిన మెరిట్ జాబితాను విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 3,907 మంది జాబితాలో చోటు సంపాయించుకోగా, ప్రైవేటు స్కూళ్లకు చెందిన 133 మంది అర్హత సంపాయించారు.
ఒక్కొక్క సీటుకు 10 మంది పోటీ
ట్రిపుల్ ఐటీలలో ప్రవేశాలకు సంబంధించి మొత్తం 44,104 విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలల నుంచి 25,406 విద్యార్థులు, ప్రైవేటు పాఠశాలల నుంచి 17,798 మంది ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి 900 దరఖాస్తులు అందాయి. అంటే.. ఒక్కొక్క సీటుకు దాదాపు పది మంది విద్యార్థులు పోటీ పడ్డారు. ఆర్జీయూకేటీ టాపర్‌గా బాపట్ల జిల్లా కొల్లూరు జడ్పీ బాలికల హైస్కూల్‌కు చెందిన భవిరెడ్డి దివ్యతేజశ్రీ 596 మార్కులతో అగ్రస్థానంలో ఉండగా పలువురు విద్యార్థులు 595, 594 మార్కులు సాధించి తర్వాత స్థానాల్లో నిలిచారు. కాగా, ఆర్‌జీయూకేటీకి ఎంపికైనవారిలో 2,855 మంది బాలికలు, 1,185 మంది బాలురు ఉన్నారు. ట్రిపుల్ ఐటీలలో ప్రవేశాలకు ఈ నెల 19 నుం చి 24వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. నూజివీడు, ఇడుపులపాయ క్యాంప్‌సలలో 19, 20 తేదీల్లో, ఒంగోలు క్యాంపస్ విద్యార్థులకు సం బంధించి ఈ నెల 22, 23 తేదీల్లో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఇక, శ్రీకాకుళం క్యాంప్‌సకు సంబంధించి 23, 24 తేదీలలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని క్యాంప్‌సలో కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయిస్తారు. విద్యార్థులు పదోతరగతి మార్కుల మెమో, టీసీ, స్టడీ సర్టిఫికెట్, అభ్యర్థి, తల్లిదండ్రుల ఆధార్ కార్డులతో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి. జూలై 1 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.
గర్విస్తున్నా: లోకేశ్
ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. అభ్యర్థులలో 96.7 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులే ఉన్నందుకు గర్వపడుతున్నానని ‘ఎక్స్’ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.