Share News

డీటీలతో రెవెన్యూ చెలగాటం!

ABN , Publish Date - Mar 25 , 2026 | 05:12 AM

‘ఏడాదిలో రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసి గాడిన పెడతాం. భూ సమస్యలు లేని రాష్ట్రంగా చేస్తాం’.. సీఎం చంద్రబాబు ప్రజా వేదికలపై ఇస్తున్న హామీ ఇది! ఆ దిశగా అనేక సంస్కరణలను ప్రతిపాదించారు.

డీటీలతో రెవెన్యూ చెలగాటం!

  • కేడర్‌ సంఖ్య తేల్చకుండా నాన్చుడు

  • హైకోర్టు పలుమార్లు చెప్పినా నిర్లక్ష్యం

  • పరిష్కారం చూపాల్సిన సీసీఎల్‌ఏ అలసత్వం దీంతో తహసీల్దార్‌ పదోన్నతులపై పీటముడి

  • 205 మండలాలకు లేని రెగ్యులర్‌ తహసీల్దార్లు

  • క్షేత్రస్థాయిలో కుదేలవుతోన్న రెవెన్యూ వ్యవస్థ

  • భూ సమస్యల పరిష్కారంలో నిర్లిప్తత

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘ఏడాదిలో రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసి గాడిన పెడతాం. భూ సమస్యలు లేని రాష్ట్రంగా చేస్తాం’.. సీఎం చంద్రబాబు ప్రజా వేదికలపై ఇస్తున్న హామీ ఇది! ఆ దిశగా అనేక సంస్కరణలను ప్రతిపాదించారు. కానీ, ఆయన సంకల్పానికి ఆ శాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం గొడ్డలిపెట్టులా మారుతోంది!! ఇందుకు ఉదాహరణ డిప్యూటీ తహసీల్దార్‌ల కేడర్‌ సంఖ్య ఎంతో నికరంగా తేల్చకపోవడం. కొన్నేళ్లుగా ఈ సమస్యను పరిష్కరించకపోవడం వల్ల.. అసలు డీటీలు ఎంత మంది ఉన్నారు? ఇందులో డైరెక్ట్‌ రికూట్ర్‌ అయిన వారెందరు? ప్రమోటీలు ఎవరో తేలడం లేదు. దీంతో వారికి రెగ్యులర్‌ తహసీల్దార్‌ పదోన్నతులు ఏళ్లుగా నిలిచిపోయాయి. రాష్ట్రంలోని 680 మండలాలకు గానూ 475 కార్యాలయాల్లో మాత్రమే రెగ్యులర్‌ తహసీల్దార్లు ఉన్నారు. రీ సర్వే కోసం ఎంపిక చేసిన డీటీలతో పాటు ఇతర అధికారులను ఆయా జిల్లాల్లో కలెక్టర్లు ఎంపిక చేసి మిగతా మండలాలకు ఇన్‌చార్జి తహసీల్దార్‌లుగా నియమిస్తున్నారు. తక్షణమే డీటీల కేడర్‌ సంఖ్యను తేల్చాలని పలుమార్లు హైకోర్టు ఆదేశించినా.. రెవెన్యూ ఉన్నతాధికారులు పెడచెవిన పెడుతున్నారు. ఇక సమస్యకు తక్షణ పరిష్కారం చూపాల్సిన సీసీఎల్‌ఏ కార్యాలయం కోర్టుల్లో అఫిడవిట్‌లు, కౌంటర్‌లు దాఖలు చేయడమే లేదు. ఇలా ఉంటే.. అన్ని మండలాలకు రెగ్యులర్‌ తహసీల్దార్‌లు ఎప్పుడొస్తారు? భూ సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. కేడర్‌ సంఖ్య తేలడం వల్ల 12 ఏళ్లుగా డీటీలుగా పనిచేస్తున్న వారికి పదోన్నతులు వచ్చి, రెగ్యులర్‌ తహసీల్దార్‌లు అవుతారు. అప్పుడు వారి ప్రతిభ, పనితీరు బట్టి తహసీల్దార్‌లుగా నియమించవచ్చు. ఇటు రీ సర్వే, అటు రైతులు, సాధారణ ప్రజల భూ సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుంది.


అసలు పోస్టులు ఎన్ని?

గ్రూప్‌-2 కింద డిప్యూటీ తహసీల్దార్‌ (డీటీ)లను ఏపీపీఎస్సీ ద్వారా డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పద్ధతిలో భర్తీ చేస్తారు. మొత్తం పోస్టుల్లో ఇవి 30 శాతం. మిగిలినవి ఆర్‌ఐలు, ఇతర కేడర్‌ల వారికి పదోన్నతులు ఇచ్చి డీటీలుగా భర్తీ చేస్తారు. 2014 ఫిబ్రవరి నాటికి ఉమ్మడి రాష్ట్రంలో జీవో 47 ప్రకారం డీటీల మొత్తం కేడర్‌ సంఖ్య 1917. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు 759, మిగిలినవి ఏపీకి వచ్చాయి. 2016లో తెలంగాణ సర్కారు తమ రాష్ట్రంలో డీటీల కేడర్‌ సంఖ్య 759 అని ఓ జీవోలో వెల్లడించింది. దీని ప్రకారం ఏపీలో కేడర్‌ సంఖ్య 1,158 ఉండాలి. కానీ రెవెన్యూ శాఖ 2016లో 1,147 డీటీ పోస్టులే ఉన్నాయని లెక్కచెప్పింది. అందులో 300 ఖాళీలను చూపించి భర్తీ చేయాలని ఏపీపీఎస్సీని కోరింది. 2016లో ఆర్థిక శాఖ ఆమోదంతో 250 డీటీ పోస్టులను ఏపీపీఎస్సీ భర్తీ చేసింది. ఇంకా మరో 50 భర్తీ చేయలేదు.


హైకోర్టు చెప్పినా అదే నిర్లక్ష్యం

ఇదే సమయంలో రెవెన్యూ శాఖ నిబంధనలకు విరుద్ధంగా అనేక మందికి అడహక్‌ పదోన్నతులు ఇచ్చింది. వాటిని కూడా రెగ్యులర్‌ పోస్టుల కింద చూపించాలని ఓ అధికారి ప్రయత్నించారు. ఇందులో 175 ఎలక్షన్‌ డీటీ పోస్టులు కూడా ఉన్నాయి. నిజానికి అవి తాత్కాలిక పదోన్నతులు. వీటిని కూడా రెగ్యులర్‌ కేడర్‌ సంఖ్యలో చూపించి, వారికి లబ్ధి చేయాలని అధికారులు విశ్వప్రయత్నాలు చేశారు. ఇదే జరిగితే, ఏపీపీఎస్సీ ద్వారా నియమితులైన డీటీలు, నిబంధనల ప్రకారం పదోన్నతి ద్వారా డీటీలు అయిన వారికి సర్వీసులో తీవ్ర అన్యాయం జరుగుతుంది. రెవెన్యూ శాఖ ప్రయత్నాలను కొందరు డీటీలు హైకోర్టులో సవాల్‌ చేశారు. ఎలక్షన్‌ డీటీలు, నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతి పొందిన వారిని కేడర్‌ సంఖ్యలో భాగంగా చూపించడానికి లేదని న్యాయస్థానం గతేడాది స్పష్టం చేసింది. రాష్ట్రం విడిపోయే నాటికి అసలు కేడర్‌ సంఖ్య ఎంత? ఆ తర్వాత ఇచ్చిన పదోన్నతులు, ఏపీపీఎస్సీ నియామకాలు ఎన్ని? మొత్తంగా ఖాళీలు ఎన్నో కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు రెవెన్యూ శాఖను ఆదేశించింది. అనేక తర్జనభర్జనల తర్వాత ఆర్థిక శాఖ డీటీల కేడర్‌ సంఖ్యపై ఓ స్పష్టత తీసుకొచ్చింది. విభజన అనంతరం ఏపీలో డీటీల కేడర్‌ సంఖ్య 1,315 అని తేల్చింది. నియామకాలకు పరిగణలోకి తీసుకున్నవి 1,213 అని పేర్కొంది. దీన్ని రెవెన్యూ శాఖ ప్రామాణికంగా తీసుకొని, హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేయాలి. కానీ ఈ విషయంలో రెవెన్యూ అధికారులు సంసిద్ధత వ్యక్తం చేయడం లేదు. ఇందుకు అనేక కారణాలున్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక శాఖ చెప్పిన కేడర్‌ సంఖ్యకు అంగీకరిస్తే.. అడ్డదారిలో పదోన్నతులు పొంది ఇన్‌చార్జి తహసీల్దార్‌లుగా చెలామణి అవుతున్న వారికి రివర్షన్‌ ఇవ్వాలి. అది ఓ వర్గం అధికారులకు ఇష్టం లేదని, అందుకే కొందరు ఈ ప్రక్రియను నీరుగారుస్తున్నారన్న ఆరోపణలున్నాయి.


రీ సర్వేలో పనిచేయని వారు తహసీల్దార్లుగా ఎలా రాణిస్తారు?

జగన్‌ ప్రభుత్వంలో రీ సర్వేను ప్రారంభించిన సంగతి తెలిసిందే. రీ సర్వేలో వచ్చే భూ సమస్యలను పరిష్కరించేందుకు సీనియర్‌ తహసీల్దార్‌లకు బాధ్యతలు ఇవ్వలేదు. రెవెన్యూ కార్యాలయాల్లోని సీనియర్‌ అసిస్టెంట్లకు డీటీలుగా అడహక్‌ పదోన్నతులు ఇచ్చి.. వారినే రీసర్వే డీటీలుగా నియమించారు. రీ సర్వేలో డీటీలు రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని ఆ తర్వాత పలు నివేదికలు వెల్లడించాయి. ఇలాంటి వారిని ఇప్పుడు ఏరికోరి కొందరు కలెక్టర్‌లు కీలక మండలాలకు ఇన్‌చార్జి తహసీల్దార్‌గా నియమిస్తున్నారు. కొందరైతే.. సొంత మనుషులు, పనికొస్తారని అనుకున్న వారిని అర్హత లేకున్నా ఇన్‌చార్జి తహసీల్దార్‌లుగా నియమిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అలాంటి వారు ప్రజల సమస్యల పరిష్కారంపై కన్నా కలెక్టర్ల మెప్పుకోసమే పనిచేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

Updated Date - Mar 25 , 2026 | 05:13 AM