రెవెన్యూ సమస్యలు తీర్చాలి
ABN , Publish Date - Feb 14 , 2026 | 03:01 AM
భూములు లాక్కున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. వైసీపీ హయాంలో చేసిన రీ సర్వే తప్పుల తడక. మ్యుటేషన్లన్నీ అక్రమమే. నియోజకవర్గాల్లో మాకు వినిపిస్తున్న ప్రధాన సమస్య ఇదే.
భూములు లాక్కున్నారని రైతులు గగ్గోలు
వైసీపీ హయాంలో మ్యుటేషన్లన్నీ అక్రమమే
కూటమి ప్రభుత్వ సదస్సుల్లోనూ పరిష్కరించలేదు
సమస్యలు విని పరిష్కరించామంటే ఎలా?: ఎమ్మెల్యేలు
2.34 లక్షల వినతుల్లో 2.33 లక్షలు పరిష్కరించాం: అనగాని
సీఎంతో చర్చించి చర్యలు చేపట్టాలి: అయ్యన్న
అమరావతి, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): ‘భూములు లాక్కున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. వైసీపీ హయాంలో చేసిన రీ సర్వే తప్పుల తడక. మ్యుటేషన్లన్నీ అక్రమమే. నియోజకవర్గాల్లో మాకు వినిపిస్తున్న ప్రధాన సమస్య ఇదే. రెవెన్యూ సదస్సుల్లో బాధితుల విజ్ఞాపనలు పరిష్కారం కాలేదు. సమస్య పరిష్కరించకుండానే చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం దీన్ని ప్రధాన సమస్యగా తీసుకుని పరిష్కరించాలి’ అని పలువురు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో కందుల నారాయణరెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దూళిపాళ్ల నరేంద్ర, ఏలూరి సాంబశివరావు, ఉగ్ర నరసింహారెడ్డి తదితరులు రెవెన్యూ సమస్యల్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. 2019-2024 మధ్యలో జరిగిన రెవెన్యూ అక్రమాలు, అవకతవకలు పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సులు కనీస పరిష్కారం చూపించలేదన్నారు. బాధితుల సమస్యలు విని పరిష్కరించామని చెబితే ఎలా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కలెక్టర్లు సైతం రెవెన్యూ సమస్యలపై సరిగా స్పందించడం లేదన్నారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ బదులిస్తూ.. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజల నుంచి ఎక్కువగా రెవెన్యూకు సంబంధించినవి వినతులు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్లు చెప్పారు. 2,34,644 వినతులు అందగా 2,33,578 పరిష్కరించినట్లు వెల్లడించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందిస్తూ.. ‘ప్రతి నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది. ముఖ్యమంత్రితో చర్చించి అన్ని జిల్లాల కలెక్టర్లు, జేసీలతో పాటు ఎమ్మెల్యేలను సైతం ఆహ్వానించి ఉమ్మడి సమావేశాలు ఏర్పాటు చేయండి’ అంటూ రెవెన్యూ మంత్రికి సూచించారు.

ఆహార కల్తీ పరీక్షలు సరిగా జరగలేదు: మంత్రి సత్యకుమార్
రాష్ట్రంలో ఆహార కల్తీపై పరీక్షలు అనుకున్న స్థాయిలో జరగడం లేదని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అంగీకరించారు. హోటళ్లు, ఆహార దుకాణాల్లో నాసిరకం, కల్తీ పదార్థాలను వినియోగిస్తూ ప్రజల్ని ఆసుపత్రి పాలు చేస్తున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ప్రశ్నించారు. మంత్రి సమాధానమిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా నిరంతరం తనిఖీలు చేపట్టాలంటే 700 మంది సిబ్బంది అవసరం ఉండగా, 579 ఖాళీలు ఉన్నాయని చెప్పారు. ఆహార కల్తీ పరీక్షల ల్యాబ్‌లు కూడా లేవన్నారు. ముఖ్యమంత్రితో మాట్లాడి 150 మంది నియామకానికి ప్రక్రియ ప్రారంభించామని, విశాఖ, గుంటూరు, తిరుపతిలో రూ.100 కోట్లు ఖర్చు చేసి ల్యాబ్‌లు ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. టీటీడీకి ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. స్పీకర్ అయ్యన్న స్పందిస్తూ.. ‘గ్రామ సచివాలయాల సిబ్బందిలో ఫుడ్ సేఫ్టీ కోర్సు చేసిన వారు ఉన్నారట.. వీలైతే వారిని డిప్యుటేషన్‌పై తీసుకోండి’ అని సూచించారు. మన్యం ప్రాంతంలో గిరిజన విద్యార్థుల మరణాలకు కామెర్లు, వైరల్ జ్వరాలు కారణం కాదని.. వివిధ కారణాల వల్ల 11 మంది మరణించారని ఓ ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు.

వైసీపీ ప్రభుత్వంలో దోపిడీ: కొల్లు
గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం విధానాన్ని అనుకూలంగా మార్చుకుని దోపిడీ చేశారని ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నాసిరకం మద్యాన్ని తీసుకొచ్చి మాఫియా తరహాలో రూ.3500 కోట్ల దోపిడీకి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు సైతం ఇంత పెద్ద లిక్కర్ స్కామ్‌లో నిందితులకు బెయిల్ ఇవ్వలేమని వ్యాఖ్యలు చేసిందని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అభాసుపాలు చేసేందుకు ఇబ్రహీంపట్నం, ములకలచెరువు ప్రాంతంలో నాసిరకం మద్యాన్ని తయారు చేశారన్నారు. తాము అప్రమత్తమై చర్యలు తీసుకున్నామని, ప్రస్తుతం మద్యం నాణ్యతపై 13 రకాల పరీక్షలు జరుగుతున్నాయని చెప్పారు. అక్రమ మద్యం సరఫరా కేసుల్లో సీజ్ చేసిన వాహనాల్లో కోర్టు ఆదేశాల మేరకు కొన్నింటిని విడుదల చేశామని, ఇంకా 26,804 ఉన్నాయని తెలిపారు. సీజ్ చేసిన వాహనాల వల్ల వేలాది మంది ఉపాధి కోల్పోతున్నారని, ప్రభుత్వం ఒక విధానం తీసుకొచ్చి వాటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు.

ఉద్యోగాలు కల్పిస్తాం: రామ్‌ప్రసాద్
నిరుద్యోగ యువతకు భృతి అందించే పథకం ఏదీ రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేయట్లేదని, 2029 నాటికి 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని.. వైసీపీ ఎమ్మెల్యేలు అమరనాథ్ రెడ్డి, చంద్రశేఖర్, శివప్రసాద్ రెడ్డి, విరూపాక్షి రాతపూర్వకంగా అడిగిన ప్రశ్నకు మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి రాతపూర్వకంగా సమాఽధానం ఇచ్చారు. ఐదు లక్షల మందికి ఇప్పటికే ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. వైసీపీ హయాంలో డ్వాక్రా గ్రూపుల సొమ్ము రూ.60.35 కోట్లు దుర్వినియోగం అయిందని, అందులో రూ.17.78 కోట్లు తిరిగి వసూలు చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. పదవీ విరమణ చేసిన పింఛనుదారులు మరణించాక వారి భార్యలకు పింఛను అందజేస్తున్నామని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పరవాడ మండలం ముత్యాలమ్మపాలెంలో త్వరలో మినీ జెట్టి నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నట్లు మంత్రి అచ్చెన్న తెలిపారు.