మండలాలకురెవెన్యూ సారథులు
ABN , Publish Date - Jun 05 , 2026 | 05:25 AM
రాష్ట్ర రెవెన్యూ శాఖలో సందడి వాతావరణం నెలకొంది. 21ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒకేసారి 296 మంది డిప్యూటీ తహశీల్దార్(డీటీ)లు తహశీల్దార్లుగా పదోన్నతి పొందారు.
జిల్లాలకు కేటాయిస్తూ సీసీఎల్‌ఏ ఉత్తర్వులు
21ఏళ్ల త ర్వాత శాఖలో పదోన్నతుల పండుగ
కొత్తవారికి మండలాలు కేటాయించిన కలెక్టర్లు
అభినందనలు తెలిపిన మంత్రి అనగాని
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర రెవెన్యూ శాఖలో సందడి వాతావరణం నెలకొంది. 21ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒకేసారి 296 మంది డిప్యూటీ తహశీల్దార్(డీటీ)లు తహశీల్దార్లుగా పదోన్నతి పొందారు. 2005 సంవత్సరంలో ఒక్కసారే 195 మంది డీటీలకు రెగ్యులర్ ప్రమోషన్లు ఇచ్చారు. ఆ తర్వాత ఇన్నేళ్లకు మళ్లీ ఆ స్థాయిలో పదోన్నతులు కల్పించడంపై సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘకాలం రగిలిన సర్వీసు వివాదాలు, వాటిపై ప్రతిష్ఠంభన, న్యాయపరమైన వివాదాలను అధిగమించి ఎట్టకేలకు రెవెన్యూ శాఖ భారీగా పదోన్నతుల ప్రక్రియను పూర్తిచేసింది. రాష్ట్రంలో మొత్తం 340 తహశీల్దార్ పోస్టులు ఖాళీగా ఉండగా, అందులో 304 భర్తీ చేశారు. తహశీల్దార్లుగా ప్రమోషన్ పొందినవారిని జోన్లవారీగా జిల్లాలకు కేటాయిస్తూ భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ జి.జయలక్ష్మి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కొత్త తహశీల్దార్లకు మండలాలను కేటాయిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు గురువారం సాయంత్రానికి ఆదేశాలు ఇచ్చారు.
ముగిసిన ఇన్‌చార్జిల పాలన
వందలాది మండలాలకు కొత్త రెవెన్యూ సారథులు రావడంతో ఇన్‌చార్జీల పాలన ముగిసింది. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఎస్‌ఐఆర్ ప్రక్రియతో పాటు భూముల రీసర్వే, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వేగం పుంజుకుంటాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి. 2005లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 195మంది డీటీలకు ఒకేసారి తహశీల్దార్లుగా పదోన్నతులు ఇచ్చారు. అప్పట్లో అదో పెద్ద సంచలనం. ఆ తర్వాత నుంచి సంవత్సరం వారీగా ఏర్పడే ఖాళీల ఆధారంగా ప్యానళ్లను తయారుచేసి అవసరాన్ని బట్టి పదోన్నతులు ఇస్తూ వచ్చారు. అయితే, ఇందులో అనేక వివాదాలు, న్యాయపరమైన చిక్కుముళ్లు వచ్చాయి. రాష్ట్ర విభజన జరిగేవరకూ ఈ అనిశ్చితి కొనసాగింది. విభజన తర్వాతా ఈ సమస్య పరిష్కారం కాలేదు. ఎవరి సీనియారిటీ ఏమిటి? ఎవరి ప్యానల్ ఏమిటన్న కసరత్తు ఆశించిన స్థాయిలో జరగలేదు. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలించి, పూర్తిస్థాయిలో సంస్కరించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ఓ కేసులో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు మేరకు 2013-14 నుంచి 2017-18 ప్యానళ్లకు పదోన్నతులు కల్పిస్తామని రెవెన్యూ శాఖ కోర్టుకు నివేదించింది. దీనికి కోర్టు అనుమతించడంతో పదోన్నతుల ప్రక్రియను చేపట్టింది.
మంచి పేరు తెచ్చుకోవాలి: మంత్రి అనగాని
తహశీల్దార్లుగా పదోన్నతి పొందిన అధికారులకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అభినందనలు తెలిపారు. ప్రజలకు సేవచేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రజల్లో మంచిపేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. భూముల రీసర్వే, భూ సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి కోరారు.
తహశీల్దార్లకు వృత్తిపరమైన శిక్షణ: సీసీఎల్‌ఏ
పదోన్నతుల ప్రక్రియ అనంతరం సీసీఎల్‌ఏ జి.జయలక్ష్మి ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ఇంతకాలం ఎక్కువ మండలాల్లో ఇన్‌చార్జిల పాలన ఉండటంతో ప్రజల సమస్యలు, విన్నపాలు సరిగ్గా పరిష్కా రం కాలేదన్న ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఇప్పుడు 304 మండలాలకు రెగ్యులర్ తహశీల్దార్లు వచ్చారని చెప్పారు. ప్రజల మన్ననలు పొందేలా పనిచేయడమే వారి తక్షణ కర్తవ్యమని పేర్కొన్నారు. సీఎం సూచిస్తున్నట్లుగా ప్రజల్లో రెవెన్యూ ప్రతిష్ఠను పెంచాలని కోరారు. తమ సమస్యలను రెవెన్యూ శాఖ పరిష్కరిస్తుందన్న భరోసా ప్రజలకు కలిగేలా పనిచేయాలని, నిబంధనల మేరకు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని, ప్రజలతో మానవతా కోణంలో వ్యవహరించాలని సూచించారు. రెవెన్యూ చట్టాలు, నిబంధనలపై తహశీల్దార్లకు వృత్తిపరమైన శిక్షణ ఇస్తామన్నారు. మానవ వనరులు, రెవెన్యూ చట్టాలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కా రం తదితర అంశాలపై బ్యాచ్‌ల వారీగా శిక్షణ ఇప్పించి, వారి సర్వీసు మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకుంటామని సీసీఎల్‌ఏ చెప్పారు.
ముందు ప్యానళ్లు... తర్వాత పదోన్నతులు
అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 340 తహశీల్దార్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు 2013 -14 నుంచి 2017-18 వరకూ ప్యానళ్లను తయారుచేసి ఆ సీనియారిటీ జాబితాలోకి వచ్చే డీటీలకే పదోన్నతులు ఇవ్వాల్సి ఉంది. దీంతో 304 పోస్టుల భర్తీకే ప్రమోషన్లు ఇచ్చారు. మొత్తం 296 మంది అర్హులైన డీటీలకు తహశీల్దార్‌గా పదోన్నతులు దక్కాయి. వీరిలో 70శాతం మంది పదోన్నతుల ద్వారా డీటీ అయినవారు కాగా, మరో 30శాతం మంది ఏపీపీఎస్సీ ద్వారా ప్రత్యక్షంగా నియమితులైనవారు ఉన్నారు. జోన్-1లో 59 మంది, జోన్-2లో 84, జోన్-3లో 49, జోన్4లో 104 మంది తహశీల్దార్లుగా పదోన్నతి పొందారు. మిగిలిన 36 పోస్టులను హైకోర్టు ఆదేశాలకు లోబడి భర్తీ చేస్తామని సీసీఎల్‌ఏ తెలిపారు. 2018 -19 నుంచి అందుబాటులో ఉన్న ప్యానళ్లను తయారుచేసి, సీనియారిటీని ఖరారుచేసి పదోన్నతులు ఇస్తామన్నారు. పదోన్నతులతో పాటు జిల్లాల కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. వచ్చిన ప్రతీ అభ్యంతరాన్ని సీసీఎల్‌ఏ నిశిత పరిశీలన చేసి పరిష్కరించారని, జిల్లాల కేటాయింపులో ఉద్యోగుల విన్నపాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని వివరించాయి.