Share News

పంచాయతీరాజ్‌ సంస్థల్లో బీసీలకు 34శాతం

ABN , Publish Date - Aug 21 , 2026 | 04:21 AM

గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం పునరుద్ధరించింది. గ్రామ పంచాయతీ సభ్యులు, సర్పంచ్‌లు, మండలపరిషత్‌ సభ్యులు, ఎంపీపీలు, జిల్లా పరిషత్‌ సభ్యులు, జడ్పీ చైర్‌పర్సన్‌ పదవులకు ఈ రిజర్వేషన్‌ వర్తించనుంది.

పంచాయతీరాజ్‌ సంస్థల్లో బీసీలకు 34శాతం

  • సర్పంచ్‌ నుంచి జడ్పీ చైర్‌పర్సన్‌ వరకు రిజర్వేషన్‌

  • పంచాయతీ సభ్యులు, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ పదవులకూ వర్తింపు.. ఉత్తర్వులు జారీ

అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం పునరుద్ధరించింది. గ్రామ పంచాయతీ సభ్యులు, సర్పంచ్‌లు, మండలపరిషత్‌ సభ్యులు, ఎంపీపీలు, జిల్లా పరిషత్‌ సభ్యులు, జడ్పీ చైర్‌పర్సన్‌ పదవులకు ఈ రిజర్వేషన్‌ వర్తించనుంది. గురువారం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్‌ దండే ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో పంచాయతీరాజ్‌ సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఉండేవి. 2020లో జారీ చేసిన రెండు జీవోల ద్వారా 24.15 శాతం విధానం అమల్లోకి వచ్చింది. తాజాగా పరిస్థితులను సమీక్షించిన కూటమి ప్రభుత్వం ఆ రిజర్వేషన్లను తిరిగి 34 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం-1994లోని సంబంధిత సెక్షన్ల ప్రకారం ఆయా పదవులకు 34 శాతం రిజర్వేషన్‌ వర్తిస్తుంది. చట్ట నిబంధనల ప్రకారం స్థానాల కేటాయింపు, రొటేషన్‌, మహిళలకు రిజర్వేషన్‌ వంటి ప్రక్రియలను అనుసరించి బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.


ముగిసిన సర్పంచ్‌ల పదవీకాలం

గ్రామ పంచాయతీల సర్పంచ్‌ల పదవీకాలం ఏప్రిల్‌ 2తో ముగిసింది. మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌లకు ఎన్నికైనవారి పదవీకాలం వరుసగా సెప్టెంబరు 23, 24 తేదీలతో ముగియనుంది. 16వ ఆర్థిక సంఘం మార్గదర్శకాల ప్రకారం చట్టబద్ధ్దంగా ఏర్పాటైన గ్రామీణ స్థానిక సంస్థలు ఉండటం ఫైనాన్స్‌ కమిషన్‌ గ్రాంట్లకు కీలక అర్హత అని ప్రభుత్వం పేర్కొంది. 34 శాతం బీసీ రిజర్వేషన్లకు విరుద్ధ్దంగా 2020 మార్చి 2న జారీ చేసిన 559, 560 జీఓలను అధిగమించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే అమల్లో ఉన్న సంబంధిత చట్టాలు, నిబంధనలు, న్యాయస్థానాల ఉత్తర్వులను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. బీసీ రిజర్వేషన్ల అమలుకు అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌తో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది.

Updated Date - Aug 21 , 2026 | 04:23 AM