వైద్య కళాశాలలకు ‘వీజీఎఫ్’ ఇవ్వండి: లంకా దినకర్
ABN , Publish Date - May 14 , 2026 | 05:09 AM
రాష్ట్రంలో పీపీపీ విధానంలో ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలలకు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్(వీజీఫ్) మంజూరు చేయాలని నీతి ఆయోగ్ సభ్యుడు ఎం.శ్రీనివాస్‍ను....
న్యూఢిల్లీ, మే 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పీపీపీ విధానంలో ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలలకు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్(వీజీఫ్) మంజూరు చేయాలని నీతి ఆయోగ్ సభ్యుడు ఎం.శ్రీనివాస్‍ను, ఏపీ ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ కోరారు. ఈ మేరకు బుధవారం న్యూఢిల్లీలో ఆయనకు వినతిపత్రం అందజేశారు. ‘రాష్ట్రంలో ప్రతిపాదించిన 6 కళాశాలలకు కేంద్ర సహాయం అందుతోంది. అయితే మార్కాపురం, ఆదోని, మదనపల్లె, పులివెందులలో ఏర్పాటు చేస్తున్న మరో నాలుగు వైద్య కళాశాలలకు సైతం వీజీఎఫ్ మద్దతు విస్తరించాలి. కేంద్రం నుంచి మద్దతు లభిస్తే రాష్ట్రంలోని మొత్తం 10 వైద్య కళాశాలల నిర్మాణం సకాలంలో పూర్తయి, వెనుకబడిన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య విద్య, సేవలు అందుబాటులోకి వస్తాయి’ అని వివరించారు. దీనిపై నీతి ఆయోగ్ సభ్యుడు సానుకూలంగా స్పందించారని దినకర్ తెలిపారు.