Share News

పోలవరం నిర్వాసితులకు మరో 600 కోట్లు

ABN , Publish Date - May 15 , 2026 | 04:25 AM

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం వరుసగా పరిహారాన్ని చెల్లిస్తోంది. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మూడు దఫాలుగా సంక్రాంతి, దీపావళి, ఉగాది పర్వదినాల్లో నిర్వాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించింది.

పోలవరం నిర్వాసితులకు మరో 600 కోట్లు

  • 1250 మందికి 300 కోట్ల పరిహారం

  • మరో 312 కుటుంబాలకు

  • ఓటీఎస్‌ కింద రూ.300 కోట్లు

  • 190 మంది ఎస్టీలకు భూమి పట్టాలు

  • నేడు అందించనున్న సీఎం చంద్రబాబు

అమరావతి, మే 14 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం వరుసగా పరిహారాన్ని చెల్లిస్తోంది. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మూడు దఫాలుగా సంక్రాంతి, దీపావళి, ఉగాది పర్వదినాల్లో నిర్వాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించింది. తాజాగా 600 కోట్ల పరిహారం చెల్లిస్తోంది. 14 గ్రామాలకు చెందిన 1250 మంది నిర్వాసితులకు రూ.300 కోట్లు, అలాగే వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌(ఓటీఎస్‌) కింద 312 నిర్వాసిత కుటుంబాలకు మరో 300 కోట్లు అందజేయనుంది. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెక్కులు అందజేయనున్నారు. 190 గిరిజన కుటుంబాలకు భూమికి భూమి పథకంలో పట్టాలు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌ ప్రశాంతి, జల వనరుల శాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి తదితరులు పాల్గొంటారు. వచ్చే ఏడాది జూన్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు తొలిదశ పూర్తికానున్న నేపథ్యంలో ఈలోపు 41.15 మీటర్ల కాంటూరులో 119 టీఎంసీల గోదావరి జలాలను నిల్వ చేసేలా ముంపు ప్రాంతాల కుటుంబాలకు సహాయ, పునరావాస కార్యక్రమాన్ని అమలు చేయాలని జల వనరుల శాఖ నిర్ణయించింది. వచ్చే ఏడాది మార్చి నాటికి సహాయ, పునరావాస కార్యక్రమాలను పూర్తి చేస్తామని ఇటీవల ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి కాంతారావుకు పోలవరం సహాయ, పునరావాస కమిషనర్‌ ప్రశాంతి స్పష్టం చేశారు. సహాయ, పునరావాస కార్యక్రమాలకు కేంద్రం నిధులు మంజూరు చేయడంతో దాదాపు రూ.600 కోట్ల మేర పరిహారం చెల్లించేందుకు ప్రశాంతి జాబితాను సిద్ధం చేశారు.

Updated Date - May 15 , 2026 | 04:25 AM