Share News

సిబ్బంది పర్యవేక్షణకు మూడంచెల వ్యవస్థ

ABN , Publish Date - Feb 10 , 2026 | 04:59 AM

స్వర్ణ గ్రామ-స్వర్ణవార్డు సచివాలయాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

సిబ్బంది పర్యవేక్షణకు మూడంచెల వ్యవస్థ

  • స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల అధికారుల జాబ్‌ చార్ట్‌ విడుదల

అమరావతి, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): స్వర్ణ గ్రామ-స్వర్ణవార్డు సచివాలయాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. 15,004 సచివాలయాల్లోని సిబ్బందిని పర్యవేక్షించేందుకు మూడంచెల వ్యవస్థను రూపొందించింది. జిల్లా, మండల స్థాయి అధికారుల పాత్ర, బాధ్యతలపై మార్గదర్శకాలు విడుదల చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. జిల్లా స్వర్ణ గ్రామ-స్వర్ణ వార్డు ఆఫీసర్‌, మండల స్వర్ణ గ్రామ-స్వర్ణ వార్డు ఆఫీసర్లకు సంబంధించి జాబ్‌చార్ట్‌ను విడుదల చేసింది. దీనికోసం పంచాయతీరాజ్‌ శాఖకు చెందిన 17 మంది జడ్పీ సీఈవో స్థాయి అధికారులను, మున్సిపల్‌ శాఖకు చెందిన 9 మందిని జిల్లా అధికారులుగా నియమించనున్నారు. వీరు జిల్లా స్థాయిలో సచివాలయాలకు సంబంధించి పూర్తి పర్యవేక్షణ బాధ్యత వహిస్తారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను సచివాలయాల ద్వారా అమలు చేసేందుకు ఆయా జిల్లాల తరఫున బాధ్యత తీసుకుంటారు. సిబ్బందిపై వచ్చే ఫిర్యాదులపై విచారణ చేపట్టి నివేదికను కలెక్టర్లకు సమర్పిస్తారు. అలాగే ఎంపీడీవోల ద్వారా ఖాళీగా ఉన్న డీడీవో పోస్టులను భర్తీ చేసి, జీతాలు డ్రా చేసేందుకు ఇబ్బందులు లేకుండా చూస్తారు. అదే విధంగా మండల స్థాయిలో స్వర్ణ గ్రామ-స్వర్ణ వార్డు అధికారులు విధులు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు.

Updated Date - Feb 10 , 2026 | 04:59 AM