కృష్ణా జలాలపై తెలంగాణ గణాంకాలన్నీ తప్పులే!
ABN , Publish Date - Mar 24 , 2026 | 04:42 AM
కృష్ణా జలాల విషయంలో తెలంగాణ చెబుతున్న గణాంకాలన్నీ తప్పుల తడకగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ స్పష్టంచేసింది.
పంట కాలంపై ఆ వాదనను పరిగణనలోకి తీసుకోవద్దు: ఏపీ
నేడు కూడా కృష్ణా ట్రైబ్యునల్ విచారణ
అమరావతి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల విషయంలో తెలంగాణ చెబుతున్న గణాంకాలన్నీ తప్పుల తడకగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ స్పష్టంచేసింది. ఢిల్లీలో సోమవారం జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ (కృష్ణా నదీ జల వివాద ట్రైబ్యునల్ -2) ముందు ఏపీ తరఫు సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా పటిష్ఠ వాదనలు వినిపించారు. ‘75 శాతం డిపెండెన్సీ కింద కృష్ణా నదిలో 2,060 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. 1954-56 నాటికే కృష్ణా డెల్టా పరిధిలో లక్షన్నర ఎకరాల ఆయకట్టు ఉండేది. 1969లో ప్రణాళికా సంఘం ఈ లక్షన్నర ఎకరాల ఆయకట్టును నాగార్జున సాగర్ నుంచి తొలగించింది. డెల్టాకు 264 టీఎంసీలు అవసరం కాగా.. కృష్ణా ట్రైబ్యునల్-1 181.20 టీఎంసీలను తప్పుగా కేటాయించింది. సాగర్ పరీవాహక ప్రాంతంలోనూ, పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజీ దిగువన 2060 టీఎంసీలు అందుబాటులో ఉంటాయన్న తెలంగాణ వాదన కరెక్టు కాదు. అలాగే పంట కాలానికి సంబంధించి ఆ రాష్ట్రం చెబుతున్న లెక్కలన్నీ తప్పులే. వాటిని పరిగణనలోకి తీసుకోవడానికి వీల్లేదు’ అని తేల్చిచెప్పారు. కేసీ కెనాల్ ఆయకట్టు 2,78,000 ఎకరాలు కాగా.. 85 వేల ఎకరాలేనంటూ తెలంగాణ కుదించడాన్ని తాము అంగీకరించబోమని స్పష్టంచేశారు. ఈ విషయంలో ఏపీ వాదనతో ట్రైబ్యునల్ కూడా అంగీకరించింది. పెన్నా పరీవాహక ప్రాంతంలో సాగునీటి కేలాయింపులు అత్యంత స్వల్పంగా ఉన్నాయని గుప్తా తెలిపారు. ట్రైబ్యునల్ విచారణ మంగళవారం కూడా కొనసాగుతుంది.