Share News

రాష్ట్రానికి మరిన్ని హెచ్‌పీవీ వ్యాక్సిన్లు

ABN , Publish Date - Apr 07 , 2026 | 03:52 AM

గర్భాశయ క్యాన్సర్‌ నుంచి రక్షణ కల్పించేందుకు తీసుకొచ్చిన హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ రాష్ట్రంలో మరోసారి అందుబాటులోకి వచ్చింది. రెండో విడత పంపిణీలో భాగంగా...

రాష్ట్రానికి మరిన్ని హెచ్‌పీవీ వ్యాక్సిన్లు

  • రెండో విడతలో 1.9 లక్షల డోసులు పంపిన కేంద్రం

  • రాష్ట్రవ్యాప్తంగా 1,14,512 మంది బాలికలకు వ్యాక్సినేషన్‌

  • హెచ్‌పీవీ టీకాతో బాలికల్లో గర్భాశయ క్యాన్సర్‌ నివారణ

అమరావతి, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): గర్భాశయ క్యాన్సర్‌ నుంచి రక్షణ కల్పించేందుకు తీసుకొచ్చిన హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ రాష్ట్రంలో మరోసారి అందుబాటులోకి వచ్చింది. రెండో విడత పంపిణీలో భాగంగా రాష్ట్రానికి మరో 1.9 లక్షల డోసుల హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను కేంద్ర ప్రభుత్వం పంపించింది. గర్భాశయ క్యాన్సర్‌ (సర్వైకల్‌ క్యాన్సర్‌), ఇతర హెచ్‌పీవీ (హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌) సంబంధిత క్యాన్సర్లను నివారించేందుకు ఈ వ్యాక్సిన్‌ ఉపయోగపడుతుంది. 14-15 ఏళ్ల బాలికలకు ఉచితంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఈ వ్యాక్సిన్‌ను అందిస్తోంది. ఏపీలోనూ తొలి విడత కింద గత నెలలో 1.9 లక్షల డోసులు అందించింది. తాజాగా రెండో విడతలోనూ 1.9 లక్షల డోసులు పంపించింది. రాష్ట్రంలో మే నెల వరకు బాలికలకు నిరాటంకంగా వ్యాక్సిన్‌ పంపిణీ జరగనుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో రికార్డుల ఆధారంగా 14 నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న బాలికలు రాష్ట్రవ్యాప్తంగా 3.45 లక్షల మంది ఉన్నారు. ఆరోగ్యశాఖ సోమవారం వరకు 1,14,512 మందికి వ్యాక్సిన్‌ అందించింది.


వ్యాక్సినేషన్‌లో ఏపీ టాప్‌..

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి బాలికలకు వ్యాక్సిన్‌ పంపిణీ చేయడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందజంలో ఉంది. హెచ్‌పీవీ టీకా సురక్షితమైనది. ప్రభావంతంగా పని చేస్తుంది. కాగా, రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుండడంపై ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి రెండు విడతల్లో కలిపి రాష్ట్రానికి 3.81 లక్షల డోసుల వచ్చాయని మంత్రి చెప్పారు.

వ్యాక్సిన్‌ ఇచ్చి.. 240 కోట్లు నిలిపివేత..?

2025-26 బడ్జెట్‌లో భాగంగా నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ద్వారా ఏపీకి రావాల్సిన రూ.240 కోట్లను కేంద్రం నిలిపివేసింది. దీనిపై ఏపీ అధికారులు అనేకసార్లు కేంద్రానికి లేఖలు రాశారు. అయితే నిధుల రూపంలో ఇవ్వాల్సిన రూ.240 కోట్లను.. డ్రగ్స్‌, వ్యాక్సిన్ల రూపంలో అందించామని కేంద్రం విచిత్రమైన సమాధానం ఇస్తోంది. కేంద్రం ఇప్పటివరకూ ఏపీకి ఇచ్చిన హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ విలువ రూ.150 కోట్లపైనే ఉంటుంది. దీంతో నిధుల రూపంలో ఇవ్వాల్సిన బడ్జెట్‌ను హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ రూపంలో అందించినట్లు అధికారులు భావిస్తున్నారు. ఏదైతేనేం హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వల్ల రాష్ట్రానికి రావాల్సిన రూ.240 కోట్ల ఎన్‌హెచ్‌ఎం నిధులను కేంద్రం నిలిపివేసింది.

Updated Date - Apr 07 , 2026 | 03:55 AM