రాష్ట్రానికి రూ.1500 కోట్ల ‘ఉపాధి’ నిధులు
ABN , Publish Date - May 01 , 2026 | 04:18 AM
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖకు కేంద్రం నుంచి గురువారం రెండు శుభవార్తలు అందాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి...
ఈ ఏడాది ఫిబ్రవరి వరకు బిల్లులు క్లియర్
ఏప్రిల్‌లో రాష్ట్రంలో 3 కోట్ల పని దినాలు కల్పన
మే నెలకు 6 కోట్ల లేబర్ బడ్జెట్ మంజూరు
అమరావతి, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖకు కేంద్రం నుంచి గురువారం రెండు శుభవార్తలు అందాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి పథకంలో మెటీరియల్ పనులకు సంబంధించి బకాయిలు చెల్లించేందుకు నిధుల మంజూరుతోపాటు.. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఎంపవర్ కమిటీ మే నెలకు సంబంధించి రాష్ట్రానికి 6 కోట్ల పని దినాలకు లేబర్ బడ్జెట్‌ను మంజూరుచేస్తూ మరో తీపి కబురు అందించింది. ఉపాధి హామీ పథకంలో దేశంలోని శ్రామికులకు ఏప్రిల్ నెలలో 6.34 కోట్ల పని దినాలు కల్పిస్తే.. వీటిలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే 3.05 కోట్ల పనిదినాలు కల్పించారు. దీంతో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు మన రాష్ట్ర అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. శ్రామికులకు ఈకేవైసీ చేయడంలోనూ ఏపీ ముందున్నదని, ఏప్రిల్ నెలలో ఎన్‌ఎంఎంఎస్ యాప్ ఉపయోగిస్తూ అత్యధికంగా కూలీలకు పనులు కల్పించారని ప్రశంసించారు.
ఫిబ్రవరి నాటికి చేపట్టిన బిల్లులన్నీ క్లియర్
కేంద్ర ప్రభుత్వం మెటీరియల్ నిధులు రూ.1123.15 కోట్లు మంజూరు చేసింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ వాటా 25 శాతం సుమారు రూ.374.38 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో సుమారు రూ.1500 కోట్ల మెటీరియల్ నిధులు వెండర్ల అకౌంట్లలో జమచేస్తారు. దీంతో గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు చెల్లించాల్సిన బకాయిలన్నీ క్లియర్ అవుతాయి. బిల్లుల చెల్లింపులతో ఉపాధి పథకం ద్వారా చేపట్టే పనులు వేగవంతం కానున్నాయి. దీంతోపాటు అడ్మిన్ నిధులను కూడా రూ.69.01 కోట్లు మంజూరు చేశారు. రాష్ట్ర వాటా మరో రూ.23 కోట్లు చెల్లిస్తే మొత్తం రూ.92 కోట్లు సిబ్బంది జీతాలకు ఖర్చు చేసుకునే అవకాశముంది. కాగా రాష్ట్రవ్యాప్తంగా మెటీరియల్ నిధులతో చేపట్టిన మినీ గోకులాలకు గ్రీన్ చానల్‌లో బిల్లులు చెల్లించాలని పాడి రైతులు కోరుతున్నారు.