జీ రామ్ జీ అమల్లోనూ రాజీ లేదు!
ABN , Publish Date - Jan 29 , 2026 | 04:36 AM
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వినియోగంలో రాష్ట్రం దేశంలోనే ముందు వరుసగా ఉంది. ఈ పథకం స్థానంలో ఇటీవల తెచ్చిన గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అజీవిక మిషన్ గ్రామీణ్....
పక్కా ప్రణాళికలతో సిద్ధమైన సర్కారు
బడ్జెట్‌లో రూ.9 వేలకోట్ల ప్రతిపాదన!
కొత్త స్కీమ్ సద్వినియోగానికి కార్యాచరణ
అమరావతి, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వినియోగంలో రాష్ట్రం దేశంలోనే ముందు వరుసగా ఉంది. ఈ పథకం స్థానంలో ఇటీవల తెచ్చిన గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అజీవిక మిషన్ గ్రామీణ్(జీ రామ్ జీ) పథకం నుంచీ గరిష్ఠ ప్రయోజనం పొందేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. కొత్త పథకం కొంతమేర రాష్ట్రాలకు భారమైనా, సమర్థవంతంగా అమలుచేస్తే మంచి ఫలితాలే సాధించవచ్చునన్న ధీమా వ్యక్తమవుతోంది. ఏపీకి అనువుగా జీ రామ్ జీని వినియోగించుకునేందుకుప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. వచ్చే బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.9వేల కోట్లు ప్రతిపాదించాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల నుంచి ఈ మేరకు ప్రతిపాదనలు అందాయి. మన రాష్ట్రంలో ఈ నెల 5న నిర్వహించిన గ్రామ సభల్లో జీ రామ్ జీ గురించి అవగాహన కల్పిస్తూ తీర్మానాలు చేశారు. ఈ ఏడాది మార్చికి ఉపాధి హామీ పథకం గడువు పూర్తికానుంది. దాని స్థానంలో ఏప్రిల్ 1 నుంచి కొత్త పథకం అమల్లోకి రానుంది. పాత పథకంలో పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు అధికారులు రాత్రింబవళ్ల్లు పని చేస్తున్నారు. జీరామ్‌జీ పథకంపై చట్టమైతే చేశారుగానీ, ఇంకా ఆపరేషన్ మార్గదర్శకాలు విడుదల చేయలేదు. కొత్త పథకం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలపై భారం పడే మాట నిజమే. అయితే కొత్త పథకంలో ఒక్కో కుటుంబానికి పని దినాలను వంద రోజులకు బదులుగా 125 రోజులు ఇవ్వడం వల్ల రాష్ట్రానికి అదనపు పనిదినాలు వస్తాయి. దీంతో గతంలో మాదిరిగానే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏ మాత్రం తగ్గకుండా సమీకరించుకునే అవకాశముందని భావిస్తున్నారు.
అమలుపైనే దృష్టి..
జీ రామ్ జీ పథకం పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. కేంద్రం కొత్త పథకంలో తెచ్చిన సంస్కరణలను మన రాష్ట్రానికి అనుకూలంగా మలుచుకుని ముందుకెళ్లాలని, ఆ మేరకు అధికారులు సైతం సిబ్బందిని సిద్ధం చేయాలని ప్రభుత్వం సంకేతాలను ఇస్తోంది. ఒక్కో కుటుంబానికి 125 రోజుల పనిదినాలు కొంత మెరుగైన అంశమైనప్పటికీ...ఏటా 100 రోజుల పైబడి పనుల్లో పాల్గొనే కుటుంబాలు 4 లక్షలకు మించి ఉండదు. గత పదేళ్లుగా మన రాష్ట్రానికి సుమారు 20 కోట్ల పనిదినాలు ఏటా లేబర్ బడ్జెట్ కింద కేంద్రం మంజూరుచేస్తోంది. గత ఏడాది ఈ కేటాయింపుల్లో కోత విధించి 18 కోట్లకే పరిమితం చేసింది. అంటే గతం కంటే పనిదినాలు తగ్గించేసింది. ఈ నేపఽథ్యంలో ఒక్కో జాబ్‌కార్డుకు 125 పనిదినాలు కల్పించే అవకాశం ద్వారా మన రాష్ట్రంలో లేబర్ బడ్జెట్ కూడా పెరిగే అవకాశముంది. ఒక్కో జాబ్‌కార్డ్‌కు వంద పనిదినాలు చొప్పున కల్పిస్తూ 65 లక్షల జాబ్‌కార్డులు, 91 లక్షల శ్రామికులు ప్రస్తుత ఉపాధి పథకంలో పనిచేస్తున్నారు. మన రాష్ట్రానికి ఏటా 20 కోట్ల పనిదినాలు మంజూరుచేస్తున్నారు. ఇప్పుడు ఒక్కో కుటుంబానికి 125 రోజులకు పెరగడం వల్ల మరో 5 కోట్ల పనిదినాలు అదనంగా మంజూరయ్యే అవకాశముంది. దీంతో రాష్ట్రానికి వచ్చే కేటాయింపులు కూడా పెరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం మరింతగా శ్రామికులకు పనులు కల్పించాలన్న సంకల్పంతో అదనపు పనిదినాలు పొందే అవకాశం కూడా ఉంది. గతంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఈ నిధులు భరించేది. అయితే, దొంగ మస్టర్లను అరికట్టడంలో రాష్ట్రాల అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలు రావడంతో, అందులో సంస్కరణలు తెచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. రెండూ ఖర్చు భరించేలా విధానంలో మార్పులు తెచ్చింది. కొత్త పథకంలో అనుకూల అంశం ఏమిటంటే, గతంలో ఉపాధి పథకం వల్ల వ్యవసాయ సీజన్‌లో శ్రామికులు దొరకక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలున్నాయి. రైతులు ఎంత గగ్గోలు పెట్టినా...అప్పట్లో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ దానిపై స్పందించలేదు. కొత్త పథకంలో ఆ డిమాండ్‌కు పరిష్కారం దొరికింది. ఆయా రాష్ట్రాల్లో 60 రోజులపాటు ఉపాధి హాలీడేను ప్రకటించుకునే వెసులుబాటు రాష్ట్రాలకు కొత్త పథకంలో కల్పించారు. అంటే ఏడాదిలో పది నెలలు మాత్రమే ఇక ఉపాధి పనులు జరిగే అవకాశముంది.