సర్వే సిత్రాలు
ABN , Publish Date - Jun 01 , 2026 | 04:18 AM
‘రైతుల సమక్షంలోనే రీ సర్వే జరగాలి. రీ సర్వే రికార్డును రైతుల ముందు ఉంచాలి. గ్రామసభలో ప్రదర్శించాలి. అంతిమంగా రైతు ఆమోదం ఉండాలి’... ఈ ఏడాది జనవరి 5న ముఖ్యమంత్రి చంద్రబాబు రెవెన్యూ అధికారులకు ఇచ్చిన ఆదేశాలివీ.
సీఎం చెప్పినా తీరని రైతు సమస్యలు
జగన్ రీ సర్వేతో భూ రికార్డులు తారుమారు
ఇప్పుడు 2.0లోనూ మళ్లీ అవే తప్పులు
రీ సర్వే తర్వాత రికార్డుల్లో భూమి మాయం
135 గ్రామాల్లో తప్పుల తడక
ఉన్న భూమి లేనట్టుగా నమోదు
రైతుల గోడు పట్టించుకోని అధికారులు
పనిచేయని రీసర్వే అప్పీళ్ల వ్యవస్థ
తప్పులు రాకుండా చర్యలు తీసుకోవాలని
సీఎం చంద్రబాబు పదేపదే ఆదేశాలు
అయినా గాడిన పడని రెవెన్యూ
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
‘రైతుల సమక్షంలోనే రీ సర్వే జరగాలి. రీ సర్వే రికార్డును రైతుల ముందు ఉంచాలి. గ్రామసభలో ప్రదర్శించాలి. అంతిమంగా రైతు ఆమోదం ఉండాలి’... ఈ ఏడాది జనవరి 5న ముఖ్యమంత్రి చంద్రబాబు రెవెన్యూ అధికారులకు ఇచ్చిన ఆదేశాలివీ.
రీ సర్వేలో తప్పులు రాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం అనేక సందర్భాల్లో ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్లు-రెవెన్యూ సమావేశాల్లోనూ ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కానీ ఆచరణలో భూముల రీ సర్వే, వివాదాల పరిష్కారం జరగడం లేదు.జనవరి 5 తర్వాత చంద్రబాబు క్రమం తప్పకుండా ప్రతినెలా ఏదో ఒక గ్రామానికి వెళ్తున్నారు. రీ సర్వే సమస్యల పరిష్కారంపై రైతులు, అధికారులతో మాట్లాడుతున్నారు. కానీ సీఎం సందర్శించిన గ్రామాల్లోనూ సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఆయన దృష్టికి వెళ్లిన రైతుల భూ సమస్యలు అలాగే ఉండిపోయాయి. గత జగన్ ప్రభుత్వం సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా, సొంత ప్రచారం, ఆర్బాటం కోసం చేపట్టిన భూముల రీ సర్వే అనేక సమస్యలు తెచ్చిపెట్టింది. లక్షల్లో ఫిర్యాదులు వచ్చాయి. కూటమి ప్రభుత్వం వచ్చినా పూర్తి స్థాయిలో పరిష్కారం లభించడం లేదు.
మళ్లీ అవే తప్పులు జరుగుతున్నాయి. రీ సర్వే 2.0లో జరుగుతున్న తప్పులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ ఏడాది జనవరి మొదటి వారంలో వరుస కథనాలతో ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చింది. జగన్ ప్రభుత్వం చేపట్టిన రీ సర్వేలో ఏ తప్పులు జరిగాయో, ఇప్పుడు అవే పునరావృతం అవుతున్నాయని ‘మళ్లీ అవే తప్పులు’ శీర్షికతో జనవరి 4న వార్తను ప్రచురించింది. ఆ మరుసటి రోజే సీఎం తన క్యాంపు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
135 గ్రామాల్లో ఆందోళన
భూముల రీసర్వే 2.0 దాదాపు వెయ్యికి పైగా గ్రామాల్లో పూర్తయినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. అంటే ఆ గ్రామాల్లో 13 నోటిఫికేషన్ ఇచ్చేశారు. కానీ అధికారిక లెక్కల ప్రకారమే 135 గ్రామాల్లో జరిగిన రీసర్వేపై ఆందోళన నెలకొంది. పొజిషన్‌లో ఉన్న భూమిపై, పాస్‌బుక్‌లో ఉన్న విస్తీర్ణం కంటే 20-86 సెంట్ల మీర విస్తీర్ణాన్ని తగ్గించి రికార్డులు ఇచ్చారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. రీ సర్వేలో వచ్చిన తప్పుల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన అప్పీళ్లు కూడా ఈ సమస్యలను సెటిల్ చేయలేదు. అసలు అప్పీళ్లను సెటిల్ చేసే డీటీలు ఉంటే కదా... సమస్యలు పరిష్కరించేది. సింహభాగం డీటీలు తమకున్న పలుకుబడిని ఉపయోగించుకొని మండలాల ఇన్‌చార్జి తహశీల్దార్లుగా పోస్టులు దక్కించుకున్నారు. దీంతో రీసర్వే అప్పీళ్లు అలాగే ఉండిపోయాయి. అన్ని పరిష్కరించినట్లుగా కాగితాల్లోనే మమ అనిపించేశారు. ఆచరణలో సమస్యలన్నీ పరిష్కారం అయినట్లుగా సర్వే శాఖ 13 నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ రైతుల సమస్యలు గతంలో కంటే మరింతగా పెరిగిపోయాయన్న ఆందోళన మిన్నంటింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నోటీసుకెళ్లిన అంశాలు కూడా ఇప్పటికీ పరిష్కారం కాలేదు. రెవెన్యూ శాఖ మాత్రం అద్భుతాలు జరిగిపోతున్నట్లుగా నివేదికలు ఇస్తోంది.
పేరుకే మార్గదర్శకాలు
సీఎం చంద్రబాబు ఆదేశాలతో రెవెన్యూ శాఖ జనవరి 18న రీసర్వేలో కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ ఆచరణలో అవేవీ అమలుకావడం లేదు. రెవెన్యూను ప్రక్షాళన చేస్తున్నామని, డిసెంబరు నాటికి గాడిన పడుతుందని పెద్దలు చెబుతుండగా.. సమస్యలు మాత్రం పెరిగిపోతున్నాయి. ఉన్నతస్థాయి పర్యవేక్షణ లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. ఒక సమస్య తమ దృష్టికి రాగానే దాని పరిష్కారం కోరుతూ అధికారులు ఆదేశాలు ఇస్తున్నారు. ఆ తర్వాత ఆ సమస్య పరిష్కారం అయిందా? లేదా? అన్నది పట్టించుకోవడం లేదు. ఇదే విధానం రాష్ట్ర, జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో నెలకొంది.
రికార్డుల్లో భూమి మాయం
కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం చోడవరం గ్రామవాసి బిక్కిని కృష్ణవేణికి రీసర్వేకు ముందు ఆమె పాస్‌బుక్ ప్రకారం సర్వే నంబర్ 478-1లో ఉన్న భూమి 1.58 ఎకరాలు. రీ సర్వే తర్వాత ఆమె భూమి 1.36 సెంట్లుగా నిర్ధారించి పాస్‌బుక్ ఇచ్చారు. ఆ గ్రామంలో రీసర్వే పూర్తయినట్లుగా 13 నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక రైతులకు ఏవైనా అభ్యంతరాలుంటే కోర్టుకే వెళ్లాలి. మరి ఆ రైతుకు చెందిన 22 సెంట్ల భూమి ఎక్కడికి వెళ్లినట్లు? చోడవరంలో 28 మంది రైతులు భూమి విస్తీర్ణం తగ్గిపోయి ఇబ్బందులు పడుతున్నారు. ఈ మండలంలోని 9 గ్రామాల్లో 370మంది రైతులకు ఇలాంటి సమస్యలే వచ్చాయి.
శ్రీకాకుళంలో జిరాయితీ భూముల గోల్‌మాల్
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కొండకుంకాం, కొత్తకుంకాం గ్రామంలో జిరాయితీ భూములను అక్రమంగా మ్యుటేషన్లు చేసేశారు. వారసత్వం, కొనుగోళ్లు అంటూ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఎకరాలకు ఎకరాలు పేర్లు మార్చేశారు. ఆ గ్రామంలో 2022-23 మధ్య రీ సర్వే పూర్తి అయింది. ఆ సమయంలో ఒరిజనల్ భూయజమానులు తహశీల్దార్ నుంచి జాయింట్ కలెక్టర్ వరకూ ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు.
సర్వేయర్లపై తీవ్ర ఒత్తిడి
రీ సర్వే సమయంలో గ్రామ వీఆర్‌ఓ, సర్వేయర్, ఇతర విభాగాల సిబ్బంది విధిగా హాజరవ్వాలని మార్గదర్శకాలున్నాయి. కానీ అనేక గ్రామాల్లో వీఆర్‌ఓ సర్వేకు హాజరుకాలేదన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఇతర అధికారులు కూడా రీసర్వే డ్యూటీలను వదిలేసినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. దీంతో భారమంతా గ్రామ సర్వేయర్లపైనే పడింది. రోజుకు సగటున ఒక గ్రామంలో 20 ఎకరాలు పూర్తిచేయాలని టార్గెట్ లు విధిస్తున్నారని తెలిసింది. సర్వేయర్లు ఒత్తిడిలో కొలతలు వేసి ఉంటారని, అందుకే తప్పులు వచ్చి ఉంటాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. రీ సర్వే పేరిట గ్రామ సర్వేయర్లను జిల్లాలు దాటిస్తున్నారు. రోజుకు సగటున 100 కి.మీ.పైనే ప్రయాణం చేయిస్తున్నారు.
కలువాయిది కన్నీటిగాథ
నెల్లూరు జిల్లా కలువాయి మండలం మాదన్నగారిపల్లె రెవెన్యూగ్రామంలోని రామన్నగారిపల్లెలో 1986లో 465 ఎకరాల భూమిని పేదలకు అసైన్ చేశారు. వాటిని పేదలు సాగుచేసుకుంటున్నారు. బావుల తవ్వకానికి సంబంధించిన జీవన్‌ధార, ఎన్టీఆర్ జలసిరి పథకాలను అమలు చేశారు. సహకార సంఘాల ద్వారా రుణాలు పొందారు. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రీ సర్వే సమయంలో ఆ భూముల కేటాయింపు చెల్లదని చావుకబురు చల్లగా చెప్పారు. ఇదే రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్ 331లో రైతులకు అసైన్ చేసిన భూములు, రెవెన్యూ, అటవీ భూములు కూడా ఉన్నాయంటూ మెలికపెట్టారు. రీ సర్వే తర్వాత రైతుల భూములను కూడా మొత్తం అటవీభూమిగా నమోదు చేశారు. కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఈ సమస్యను ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చింది. సీసీఎల్‌ఏ జి. జయలక్ష్మి వెంటనే స్పందించి ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేశారు. జాయింట్ కలెక్టర్ ఆ గ్రామానికెళ్లి 450 మంది రైతుల నుంచి వినతులు స్వీకరించారు. స్వయంగా భూములను సందర్శించి నివేదిక తయారు చేశారు. సీసీఎల్‌ఏ అధికారులు ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటుచేసి ఒకటి రెండు రోజులు హడావుడి చేశారు. జాయింట్ కలెక్టర్ ఈ నివేదికను సీసీఎల్‌ఏకు పంపారు. క్లియరెన్స్ వచ్చిన తర్వాత రైతుల రికార్డులను ఎప్పటిలాగే మీ-భూమిలో నమోదు చేస్తామని చెప్పారు. ఇది జరిగి ఏడాది దాటింది. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఈ అంశంపై అసెంబ్లీ దృష్టికి రెండు దఫాలు తీసుకొచ్చారు. రెవెన్యూ మంత్రికి లేఖ రాశారు. సీసీఎల్‌ఏ స్పందించి రైతుల భూమి రికార్డులపై అనిశ్చితి తొలగించాలని కలెక్టర్‌ను కూడా ఆదేశించారు. తర్వాత నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్, కలెక్టర్ బదిలీ అయ్యారు. రైతులు ఇప్పుడున్న జాయింట్ కలెక్టర్ వద్దకు వెళ్లగా.. మీ భూముల రికార్డులే లేవంటూ సమాధానమిస్తున్నారు.