Share News

ఆర్‌సీ, డీఎల్‌ కార్డుల జారీ ఇంకెన్నేళ్లకు?

ABN , Publish Date - May 08 , 2026 | 04:25 AM

ఆంధ్రప్రదేశ్‌లో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, హెవీ వాహనాలు కొనుగోలు చేసే యజమానులతో పాటు సెకండ్‌ హ్యాండ్‌ వాహనాల క్రయ విక్రయాల్లో యజమాని పేరు మారుస్తూ ఆర్టీఏ నుంచి ఆర్‌సీ కార్డు పోస్టు ద్వారా ఇంటికి పంపేవారు.

ఆర్‌సీ, డీఎల్‌ కార్డుల జారీ ఇంకెన్నేళ్లకు?

  • వైసీపీ ప్రభుత్వంలో ‘వివాదం’తో ఆపేసిన రవాణా శాఖ

  • 2024లో జారీ మళ్లీ మొదలు

  • ఇంకా 30 లక్షల కార్డులు పెండింగ్‌

  • వాటి కోసం వాహనదారుల నుంచి రూ.60 కోట్లు వసూలు

  • సీఎం ఆదేశాలిచ్చినా మీనమేషాలు

డ్రైవింగ్‌ లైసెన్స్‌(డీఎల్‌), వాహన రిజిస్ర్టేషన్‌ సర్టిఫికెట్‌(ఆర్‌సీ) కార్డుల జారీలో రవాణా శాఖ మీనమేషాలు లెక్కిస్తోంది! డబ్బులు వసూలు చేస్తున్నా కార్డులు ఇవ్వకుండా తాత్సారం చేస్తోంది!. వైసీపీ ప్రభుత్వంలో ఒక మంత్రికి సంబంధించిన వ్యక్తికి కార్డుల జారీ కాంట్రాక్టు ఇవ్వలేదంటూ ఆపేసిన రవాణా శాఖ.. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కావస్తున్నా కార్డుల సరఫరా టెండర్‌ కొలిక్కి తీసుకురాలేకపోవడం వైఫల్యమే!

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఆంధ్రప్రదేశ్‌లో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, హెవీ వాహనాలు కొనుగోలు చేసే యజమానులతో పాటు సెకండ్‌ హ్యాండ్‌ వాహనాల క్రయ విక్రయాల్లో యజమాని పేరు మారుస్తూ ఆర్టీఏ నుంచి ఆర్‌సీ కార్డు పోస్టు ద్వారా ఇంటికి పంపేవారు. వీటికి తోడు డ్రైవింగ్‌ టెస్ట్‌ పాసైనవారికి శాశ్వత డీఎల్‌ కూడా కార్డు రూపంలో జారీ చేసేవారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో డబ్బులు వసూలు చేసినా ఆర్టీఏ కార్డులు ఇవ్వలేదు. అందుకు కారణం అప్పటి వరకూ ప్లాస్టిక్‌ కార్డులు సరఫరా చేసిన కాంట్రాక్టరుకు బిల్లులు చెల్లించక పోవడమే. అప్పట్లో వాహనదారులు గట్టిగా నిలదీయడంతో మరో కాంట్రాక్టరుకు అప్పగిద్దామంటూ రవాణా శాఖ 2023లో టెండర్‌ ప్రకియ ప్రారంభించింది. తన అనుచరుడికి కాంట్రాక్టు దక్కించుకోవడానికి ఒక మంత్రి నుంచి ఒత్తిళ్లు రావడంతో అధికారులు టెండర్‌ ప్రక్రియ ఆపేశారు. అదే సమయంలో వాహనదారులు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ హోల్డర్ల నుంచి కార్డు కోసం రూ.235 వసూలు చేయడం ఆపేసింది. ఆన్‌లైన్‌ నుంచి ఆర్‌సీ, డీఎల్‌(పేపర్‌) డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు.


2024లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రవాణా శాఖపై సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు ఆరా తీయడంతో కార్డుల జారీ ఆగిపోయిన విషయం చర్చకొచ్చింది. కొత్త కార్డులు చిప్‌తో కూడినవి జారీ చేయాలని సీఎం సూచించడంతో చిప్‌ రీడ్‌ చెయ్యాలంటే మళ్లీ రీడర్లు కొనుగోలు చేసి ఎంవీఐలు, ట్రాఫిక్‌ పోలీసులకు ఇవ్వాల్సి ఉంటుందని.. క్యూఆర్‌ కోడ్‌తో ఉన్నవి జారీ చేస్తే కేంద్ర ప్రభుత్వ ‘వాహన్‌, పరివాహన్‌’ పోర్టల్‌తో లింకయ్యేందుకు అవకాశం ఉంటుందని అధికారులు వివరించారు. అలాగే చేయాలంటూ సీఎం ఆదేశాలివ్వడంతో 2024 అక్టోబరు 1 నుంచి వాహనదారులు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ హోల్డర్ల నుంచి రవాణా శాఖ రూ.235 వసూలు చేస్తున్నా కానీ 2026 మేనాటికి కూడా కార్డులు జారీ చేయకుండా దాట వేస్తోంది.


35 లక్షల కార్డులు పెండింగ్‌..

వైసీపీ ప్రభుత్వంలో డబ్బులు వసూలు చేసి జారీ చేయాల్సిన కార్డులతో పాటు కూటమి ప్రభుత్వంలో పెండింగ్‌ ఉన్నవి కలిపి సుమారు 35 లక్షల డీఎల్‌, ఆర్‌సీ కార్డులు జారీ చేయాల్సి ఉంది. రవాణా శాఖ ఏపీటీఎస్‌కు టెండర్‌ పిలిచే ప్రక్రియ అప్పగించింది. ఒక్కో ప్లాస్టిక్‌ కార్డు క్యూఆర్‌ కోడ్‌తో తయారు చేసి ఇవ్వాలంటే కనీసం రూ.72 అవుతుందని అంచనాకు వచ్చారు. టెండర్‌లో మాత్రం రూ.50గా నిర్ణయించి పిలుద్దామని రవాణా శాఖ ప్రతిపాదించగా ఏపీటీఎ్‌సలోని ఒక అధికారి.. అంత ఎందుకు.. రూ.30 చాలంటూ కుదించినట్లు తెలిసింది. ఆర్‌సీ కార్డు కోసం వాహనదారుల నుంచి రూ.200 వసూలు చేస్తుండగా కనీసం రూ.50 అయినా కాంట్రాక్టరుకు చెల్లించకపోతే సరఫరాకు ఎవరు ముందుకు వస్తారనే ప్రశ్న వినిపిస్తోంది. కార్డు ఇంటికి చేర్చేందుకు పోస్టల్‌ చార్జీ రూ.35 వసూలు చేస్తుంటే, కార్డు ఖరీదు అంతకన్నా తక్కువకు సరఫరా చేయడానికి ఎవరు ముందుకొస్తారని అంటున్నారు. ఏడాదికి సగటున 30లక్షల కార్డులు ఇవ్వాల్సి ఉంటుందని, వాటి కోసం ప్రజల నుంచి రూ.60కోట్లు వసూలు చేసి వాటి సరఫరా దారుకు రూ.15కోట్లు కూడా ఖర్చు చేయలేక పోతే సమస్య ఎలా తీరుతుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Updated Date - May 08 , 2026 | 04:29 AM