Share News

‘రేషన్‌’ క్రమబద్ధీకరణ

ABN , Publish Date - Jun 28 , 2026 | 05:56 AM

రాష్ట్రంలో రేషన్‌ పంపిణీలో ఇష్టానుసారం వ్యవహరిస్తున్న డీలర్ల తీరుకు ప్రభుత్వం చెక్‌ పెట్టింది. రేషన్‌ సరుకుల డోర్‌ డెలివరీకి సంబంధించిన నిబంధనలనూ మరింత కఠినతరం చేసింది.

‘రేషన్‌’ క్రమబద్ధీకరణ

  • ‘ఈ-పోస్‌’ పరికరాల్లో సాంకేతిక మార్పులు

  • ప్రభుత్వం నిర్దేశించిన తేదీల్లోనే నిత్యావసరాల పంపిణీ సాధ్యం

  • (అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో రేషన్‌ పంపిణీలో ఇష్టానుసారం వ్యవహరిస్తున్న డీలర్ల తీరుకు ప్రభుత్వం చెక్‌ పెట్టింది. రేషన్‌ సరుకుల డోర్‌ డెలివరీకి సంబంధించిన నిబంధనలనూ మరింత కఠినతరం చేసింది. ఈ మేరకు సరికొత్త మార్గదర్శకాలతో పౌరసరఫరాల శాఖ కమిషనర్‌, ప్రభుత్వ ఎక్స్‌-అఫీషియో కార్యదర్శి కె.కన్నబాబు ఇటీవలే సర్క్యులర్‌ జారీ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఎండీయూ వాహనాలను రద్దు చేసి రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ షాపుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీని పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. ప్రతి నెల 1 నుంచి 15 వరకు సాధారణ కార్డుదారులకు ఉదయం, సాయంత్రం సరుకులు పంపిణీ చేయాలని, 65 సంవత్సరాల వయసు పైబడిన వృద్ధులకు, మంచానికే పరిమితమైన దివ్యాంగులకు రేషన్‌ సరుకులను ప్రతినెలా 26 నుంచి నెలాఖరు వరకు లబ్ధిదారుల ఇంటి వద్దకే తీసుకువెళ్లి అందజేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది డీలర్లు నిబంధనలకు విరుద్ధంగా సాధారణ కార్డుదారులకు కూడా నెలంతా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు అందించాల్సిన ఐసీడీఎస్‌ సరుకులను నిర్దేశిత గడువులోగా ఇవ్వడం లేదు. ప్రభుత్వం నోటిపై చేసిన వేళల్లో డీలర్లు చౌక ధరల దుకాణాల దగ్గర ఉండటం లేదు.


మరికొందరు రేషన్‌ డీలర్లు ప్రతినెలా రేషన్‌ సరుకుల కోసం డీడీలను నిర్ణీత గడువులోపు తీయకపోవడంతో ఆయా రేషన్‌ దుకాణాలకు స్టాక్‌ చేరవేయడంలో జాప్యం జరుగుతోంది. దీంతో ప్రజా పంపిణీ కార్యకలాపాలు గాడి తప్పి.. పంపిణీ వ్యవస్థ(డిస్ట్రిబ్యూషన్‌ సైకిల్‌) అస్తవ్యస్థంగా తయారవుతోంది. సమస్యను గుర్తించిన సివిల్‌ సప్లయిస్‌ కమిషనర్‌ సరికొత్త నిబంధనలతో ఇటీవలే సర్క్యులర్‌ జారీ చేశారు. రేషన్‌ డీలర్లు సరుకుల పంపిణీ వివరాలను నమోదు చేసే ఈ-పోస్‌ పరికరాల్లో సాంకేతికపరమైన మార్పులు తీసుకువచ్చారు. జూలై నెల నుంచి ఇక మీదట ప్రతినెలా 1 నుంచి 15 వరకు సాధారణ కార్డుదారుల వివరాలు మాత్రమే ఈ-పోస్‌ పరికరాల్లో కనిపించనున్నాయి. అలాగే 26 నుంచి నెలాఖరు వరకు డోర్‌ డెలివరీకి అర్హులైన కార్డుదారుల వివరాలు మాత్రమే ఈ-పోస్‌ పరికరాల్లో కనిపిస్తాయి. అలాగే రేషన్‌ డీలర్లు ప్రతి నెలా డీడీలను సకాలంలో తీసేలా, వారికి రిలీజ్‌ ఆర్డర్లు, స్టాక్‌లను సకాలంలో చేరవేయడం, అంగన్‌వాడీ కేంద్రాలకు ఇవ్వాల్సిన సరుకులను కూడా సకాలంలో అందించడం, డీలర్లు నిర్దేశిత పని వేళల్లో. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు విధిగా చౌక ధరల దుకాణాల్లో అందుబాటులో ఉండేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి’ అని సివిల్‌ సప్లయిస్‌ కమిషనర్‌ సర్క్యులర్‌లో పేర్కొన్నారు.

Updated Date - Jun 28 , 2026 | 05:58 AM