పెద్ద రాష్ట్రాల జాబితాలో 6వ స్థానం
ABN , Publish Date - Jul 18 , 2026 | 04:38 AM
దేశంలో పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న అతిపెద్ద రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ జాబితాలో గుజరాత్ టాప్‌లో ఉండగా, ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, మధ్యప్రదేశ్ నిలిచాయి.
పెట్టుబడులకు ఏపీ అనుకూలం
టాప్‌లో గుజరాత్.. పదో స్థానంలో తెలంగాణ
నీతి ఆయోగ్ ‘ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్’ నివేదికలో వెల్లడి
తలసరి డిజిటల్ లావాదేవీల్లో ఏపీ టాప్‌లో ఉందని ప్రశంసలు
న్యూఢిల్లీ, జూలై 17(ఆంధ్రజ్యోతి): దేశంలో పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న అతిపెద్ద రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ జాబితాలో గుజరాత్ టాప్‌లో ఉండగా, ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, మధ్యప్రదేశ్ నిలిచాయి. తెలంగాణ పదో స్థానంలో ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకుంటే ఏపీ 8వ స్థానంలో, తెలంగాణ 13వ స్థానంలో ఉన్నాయి. ఈ మేరకు నీతి ఆయోగ్ శుక్రవారం విడుదల చేసిన ‘ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్’ నివేదికలో పేర్కొంది. మౌలిక సదుపాయాలు, వ్యాపార వాతావరణం, వనరులు, నిబంధనల సడలింపు, ప్రభుత్వ విధానాలు, నియంత్రణ సౌలభ్యం, సంస్థాగత వాతావరణం, ఆర్థిక పటిష్ఠత, పర్యావరణం తదితర అంశాలపై ఒక్కో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో నీతి ఆయోగ్ ర్యాంకులు కేటాయించింది. పెద్ద రాష్ట్రాల్లో ఏపీకి 48.7 స్కోర్ దక్కినట్టు పేర్కొంది. ఏపీలో తలసరి జీఎ్‌సడీపీ రూ.1,61,243 ఉందని, 2024 సంవత్సరంలో రాష్ట్రానికి 92.13 మిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లభించాయని తెలిపింది. ఏపీలో ఆహార ఉత్పత్తులు, రసాయనాలు, ఫార్మాస్యూటికల్స్ బలమైన పారిశ్రామిక రంగాలని పేర్కొంది. స్థూల దేశీయ ఉత్పత్తిలో సేవల రంగానికి అధిక శాతం వాటా ఉందని, ఆ తర్వాత పరిశ్రమలు, వ్యవసాయం ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని వెల్లడించింది. తలసరి డిజిటల్ లావాదేవీల్లో మొత్తం దేశంలోనే ఏపీ అగ్రగామిగా ఉందని నీతి ఆయోగ్ ప్రశంసించింది. ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులు ప్రశంసిస్తున్నారని పేర్కొంది.
ఈ నివేదిక ప్రకారం... ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల్లో 48శాతం మంది సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ రంగాల్లో నమోదు చేసుకున్నారు. ఏపీలో సగటున 23.71 గంటలు పారిశ్రామిక విద్యుత్ లభిస్తోంది. లోహేతర ఖనిజ వనరుల ఉత్పత్తిలో జాతీయ వాటాలో ఆంధ్రప్రదేశ్ 10 శాతం తోడ్పాటును అందిస్తోంది. పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో జాతీయంగా, అంతర్జాతీయంగా ఏపీ ఐదో శ్రేణిలోకి వస్తుంది. విశాఖపట్నం పోర్టు, శ్రీసిటీ, జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీ, ఏపీఐఐసీ ఎస్టేట్లు అద్భుతంగా పనిచేస్తున్నాయని, గిడ్డంగులు, శీతలీకరణ కేంద్రాలు చెప్పుకోదగ్గ రీతిలో అభివృద్ధి చెందాయి. టైర్-2, టైర్-3 నగరాల్లో ఆంతర్గత రహదారుల పరిస్థితి మెరుగుపడాల్సి ఉందని నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది..