Share News

‘రోడ్ల’ నాణ్యతలో ఏపీ బెస్ట్‌

ABN , Publish Date - Jul 10 , 2026 | 04:46 AM

పంచాయతీరాజ్‌ (పీఆర్‌), గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఈ శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న చర్యలతో పలు కార్యక్రమాలు రోల్‌మోడల్‌గా నిలుస్తున్నాయి.

‘రోడ్ల’ నాణ్యతలో ఏపీ బెస్ట్‌

  • దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన రాష్ట్రం

  • రోడ్ల నాణ్యతలో 2021-22లో 19వ స్థానం

  • కూటమి సర్కారు చర్యలతో మంచి ఫలితాలు

అమరావతి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్‌ (పీఆర్‌), గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఈ శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న చర్యలతో పలు కార్యక్రమాలు రోల్‌మోడల్‌గా నిలుస్తున్నాయి. పవన్‌ చొరవతో రోడ్ల నిర్మాణ సమయంలోనే క్వాలిటీ కంట్రోల్‌ సిబ్బందితో తనిఖీ చేయించడంతో రాష్ట్రంలోని రహదారుల నాణ్యత పెరిగింది. కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ చేపట్టిన తనిఖీల్లో ఈ విషయం స్పష్టమైంది. దేశవ్యాప్తంగా రోడ్ల నాణ్యత విషయంలో 2021-12లో ఆంధ్రప్రదేశ్‌ 19వ స్థానంలో ఉంటే... తాజాగా చేపట్టిన తనిఖీల్లో రెండో స్థానానికి చేరుకుంది. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన (పీఎంజీఎ్‌సవై) ద్వారా చేపట్టిన పనులకు సంబంధించి కేంద్ర బృందం చేసిన తనిఖీల్లో ఏపీలో రోడ్ల నాణ్యత మెరుగ్గా ఉందని స్పష్టమైంది. 2025 ఏప్రిల్‌ నుంచి 2026 మార్చి వరకు చేపట్టిన పనుల నాణ్యతను పరిశీలించగా గుజరాత్‌ దేశంలోనే అగ్రస్థానంలో నిలవగా.. ఏపీ రెండో స్థానం దక్కించుకుందని పీఎంజీఎ్‌సవై నేషనల్‌ క్వాలిటీ మానిటరింగ్‌ విభాగం తెలిపింది. మధ్యప్రదేశ్‌, తమిళనాడు, రాజస్థాన్‌ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా 2,948 రహదారులను తనిఖీ చేయగా.. 441 రోడ్లు నాణ్యత తక్కువగా ఉన్నాయని, ఏపీలో మొత్తం 126 రోడ్లు తనిఖీ చేయగా.. ఒక్కటి మాత్రమే నాణ్యత తక్కువగా ఉందని తేల్చింది.


డిప్యూటీ సీఎం స్వయంగా తనిఖీలు..

కూటమి సర్కారు వచ్చిన తర్వాత రోడ్ల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించింది. రోడ్లు అనతి కాలంలోనే దెబ్బతినడం, ఏడాది లోపే చిన్నపాటి వర్షాలకు సైతం గుంతలు పడుతుండడంతో డిప్యూటీ సీఎం పవన్‌ ఈ విషయంపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీంతో జిల్లాల్లో పంచాయతీరాజ్‌ నాణ్యతా నియంత్రణ విభాగాలు రోడ్ల నిర్మాణాల సమయంలోనే తనిఖీలు చేపట్టాయి. రాష్ట్రంలోని ఏజెన్సీ, ఇతర ప్రాంతాల్లో గత రెండేళ్లలో రూ.వెయ్యి కోట్లకు పైగా ఖర్చుచేసి తారు రోడ్లు నిర్మించారు. ఈ క్రమంలో అన్ని స్థాయిల్లో విజిలెన్స్‌ తనిఖీలు చేపట్టారు. నాణ్యత విషయంలో నిర్లక్ష్యం వహించిన క్వాలిటీ ఇంజనీర్లను తొలగించారు. సుమారు 10 మంది సిబ్బందిని బదిలీ చేశారు. రాష్ట్రంలో గతేడాది పీఎంజీఎ్‌సవై కింద సుమారు 500 కి.మీ. మేర రోడ్లు నిర్మించారు. రోడ్ల నాణ్యత కోసం పంచాయతీరాజ్‌ విభాగంలో 8 డివిజన్లు, 41 సబ్‌ డివిజన్లు పనిచేస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కూడా పలుచోట్ల స్వయంగా తనిఖీలు చేపట్టారు. ఒకప్పుడు నామమాత్రంగా ఉన్న క్వాలిటీ కంట్రోల్‌ విభా గం ఇప్పుడు చురుకుగా పనిచేయడం ప్రారంభించింది.

Updated Date - Jul 10 , 2026 | 04:47 AM